ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : పీఎంఈజీపీ లోన్​కోసం అప్లై చేసుకోవాలని ఉమ్మడి జిల్లా ఖాదీ ఇండస్ట్రీస్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం నాగర్ కర్నూల్ లోని ప్రజావాణి మీటింగ్  హాల్​లో ‘ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్’ లోన్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల స్థాపన కోసం 18 ఏళ్లు దాటిన వారికి  రూ.25 లక్షలు,  వివిధ సేవా రంగాల్లో రూ.10 లక్షలు చొప్పున బ్యాంకులు ఇస్తాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 10 శాతం, దివ్యాంగులు 5 శాతం తమ వాటా కింద పెట్టుబడి పెట్టాలన్నారు. ఈ ప్రాజెక్టు కింద ప్రొడక్షన్ కో-ఆపరేటివ్ సంస్థలు, చారిటబుల్ ట్రస్టులు.. కావాల్సిన డాక్యుమెంట్లు, ఆధార్, పాన్ కార్డు, ప్రాజెక్టు రిపోర్ట్ తదితర సర్టిఫికెట్లతో ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలన్నారు. జిల్లా పరిశ్రమల అధికారి హనుమంతు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్​అనిల్ ప్రకాశ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌషల్ కిషోర్ పాండే పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

కందనూలు, వెలుగు: ప్రజలకు వారి హక్కులు చట్ట ప్రకారం దక్కాలంటే ముందు అవగాహన  కలిగి ఉండాలని నాగర్ కర్నూల్​ జడ్జి డి. రాజేశ్ బాబు సూచించారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా  బిజినేపల్లి మండలం  పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో స్టూడెంట్లకు చట్టాలపై అవగాహన కల్పించారు. హాజరైన జడ్జి మాట్లాడుతూ స్టూడెంట్లు తమ పరిశోధనలతో కొత్త వంగడాలను  సృష్టించి వ్యవసాయం లాభసాటిగా ఉండేలా కృషి చేయాలని, రైతులకు ప్రతి అంశంపై అవగాహన పెంచాలన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, వారి హక్కుల సాధనకు పోరాడాలని   ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సబిత అన్నారు.  మహిళలకు తల్లిదండ్రుల ఆస్తుల్లో సమాన హక్కులను రాజ్యాంగం కల్పించిందన్నారు. బాలికలు బాల్య వివాహాలపై, ఈవ్​టీజింగ్​చేసే వారిపై అలర్ట్​గా ఉండాలని ఆమె తెలిపారు.  ప్రిన్సిపల్​జూనియర్ సివిల్ జడ్జి కె.స్వరూప, బార్ అసోసియేషన్ జిల్లా  అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా, కాలేజీ ఏ  డీఆర్​గోవర్ధన్, అగ్రికల్చర్​సైంటిస్టులు డాక్టర్ పుష్పవతి, డాక్టర్ సుజాత, డాక్టర్ అరుణ తదితరులు పాల్గొన్నారు.  

ముంబై సభ పాంప్లెంట్లు రిలీజ్​

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: డిసెంబర్ 6 న  ముంబైలో నిర్వహించే ‘మహా పరి నిర్వాస్ దివస్’  ‘హలో మాల  చలో ముంబై’  సభ పాంప్లెంట్లను టీఎంఎం స్టేట్ ప్రెసిడెంట్ మంత్రి నర్సింహ్మయ్య  గురువారం జిల్లా కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 6  అంబేద్కర్ వర్ధంతిని మహా పరి నిర్వాస్ దివస్ గా జరుపుకుంటామన్నారు.  కొత్త పార్లమెంట్ భవనానికి  అంబేద్కర్ పేరు  పెట్టాలని నర్సింహ్మయ్య డిమాండ్ చేశారు. అంబేద్కర్ పేరును నోబెల్​ప్రైజ్​కు  ఎంపిక చేయాలన్నారు. టీఎంఎం స్టేట్ సెక్రటరీ బండి శ్రీనివాసులు, రాష్ర్ట నాయకుడు చంటి, ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ మంత్రి చెన్నకేశవులు తదితరులుపాల్గొన్నారు.     

కలెక్టరేట్ నిర్మాణ పనులు స్పీడప్​ చేయాలి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా  దగ్గరలో నిర్మిస్తున్న కొత్త ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను స్పీడప్​చేయాలని కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. గురువారం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ పనులు చివరిదశలో ఉన్నాయని,  డిసెంబర్ 15 నాటికి కలెక్టరేట్​ను సిద్ధం చేసి అప్పగించాలని ఆఫీసర్లను ఆదేశించారు.   రూ.51 కోట్లతో  కొత్త కలెక్టరేట్​ను నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు.  రోజూ నిర్మాణ పనుల వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలన్నారు. కలెక్టర్, అడిషనల్​కలెక్టర్లు, జిల్లా అధికారుల నివాస సముదాయాల నిర్మాణ పనులు పూర్తయ్యాయని ఆర్అండ్​బీ ఈఈ తెలిపారు. కలెక్టర్ ఈఈ భాస్కర్,  డీఈ రమాదేవి, కాంట్రాక్టర్ శ్రీధర్ రెడ్డి ఉన్నారు. 

పిల్లలకు పౌష్టికాహారం అందించాలి

నారాయణపేట, వెలుగు:  అంగన్​వాడీ పిల్లలకు మిల్లెట్ చిక్కీలు తదితర పౌష్టికాహారం అందించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో చైల్డ్​వెల్ఫేర్​ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు.  జిల్లాలో వయసుకు తగ్గ బరువు, ఎత్తు లేని ‘స్యామ్ మ్యామ్’ పిల్లల సంఖ్యను తగ్గించేందుకు ఇప్పటికే  చిక్కీలను ఇస్తున్నామని, జిల్లాలోని అన్ని అంగన్​వాడీలకు అందేలా చూడాలన్నారు. చిక్కీలను తయారు చేసే బాధ్యతను అరుణ్య మహిళా సంఘాలకు అప్పగించినట్లు కలెక్టర్​తెలిపారు. అదేవిధంగా మహిళా సంఘాలకు స్వయం ఉపాధి  విషయంలో తగిన ప్రోత్సాహం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మీటింగ్​లో జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్,   డీపీఎం రాము నాయక్  పాల్గొన్నారు. 

అంగన్​వాడీ రికార్డుల ఆన్​లైన్​తో మేలు

లింగాల, వెలుగు : అంగన్​వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న 14 రకాల రికార్డులను  ఆన్​లైన్​చేసేందుకు ‘ఈ న్యూట్రిషన్ ట్రాకింగ్ సిస్టం’   ఉపయోగపడుతుందని పోషణ్ అభియాన్ టీం  ఆఫీసర్లు ఈశ్వర్,  సాహితీ అన్నారు. గురువారం లింగాల మండల కేంద్రంలోని రైతు వేదికలో, అంబటిపల్లి , అప్పాయి సెక్టార్ లో ఉన్న అంగన్​వాడీ టీచర్లకు ఎన్​హెచ్​టీ యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ యాప్ లో అంగన్​వాడీలో జరిగే కార్యక్రమాలు, నెల వారి రిపోర్టులు, లబ్ధిదారుల వివరాలు, సేవలు పూర్తి వివరాలు ఆన్​లైన్​ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో  సూపర్​వైజర్ ​విజయలక్ష్మి , అంగన్​వాడీ టీచర్లు గీత, దేవి పాల్గొన్నారు.  

పెండింగ్ కేసులపై నిర్లక్ష్యం వద్దు

వనపర్తి టౌన్, వెలుగు: పెండింగ్ కేసులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు   పరిష్కరించాలని ఎస్పీ కె. అపూర్వరావు ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ ఆఫీస్​లో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నెలవారీ సమీక్ష నిర్వహించారు. ముందుగా జిల్లాలోని అన్ని పోలీస్టేషన్లలో  పెండింగ్​ కేసుల  వివరాలడిగి తెలుసుకున్నారు. కేసుల విచారణలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని, ప్రతి కేసులో సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.  సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతూ అమాయక ప్రజల నగదును సునాయాసంగా దోచుకుంటున్నారన్నారు. జిల్లా ప్రజలకు సైబర్​నేరాలపై అవగాహన కల్పించాలన్నారు. ఎవరైనా సైబర్​నేరానికి గురైతే 1930 కు ఫోన్ చేయాలని అవగాహన కల్పించాలన్నారు. మీటింగ్​లో వనపర్తి జిల్లా అడిషనల్ ఎస్పీ షాకీర్ హుస్సేన్, డీఎస్పీ ఆనంద్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్  ఇన్​స్పెక్టర్, శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటుదే కీలక పాత్ర

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ప్రజాస్వామ్య పరిరక్షణలో ‘ఓటు’ కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు చెప్పారు. ఓటర్​లిస్ట్​, సవరణ, ఓటరు ఎన్​రోల్ మెంట్​పై అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన కలెక్టర్ ఆఫీస్​నుంచి  క్లాక్ టవర్ వరకు సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు  ప్రజలకు ఓటే ఆయధమన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి  ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు.  అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

ఓపెన్ ప్లాట్లకు ప్రత్యక్ష వేలం

మహబూబ్ నగర్, భూత్పూర్ పట్టణాలకు దగ్గరలో ఉన్న పెద్ద టౌన్ షిప్ లోని ఓపెన్ ప్లాట్లకు ఈ నెలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యక్ష వేలం నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ రెండు టౌన్ షిప్ లలోని ఓపెన్ ప్లాట్ల ప్రత్యక్ష వేలంపై గురువారం ఎక్స్ పో ప్లాజాలో నిర్వహించిన ఫ్రీ బిడ్​మీటింగ్​లో ఆయన మాట్లాడారు.  అనంతరం  కలెక్టర్ చాంబర్ లో నిర్వహించిన మీటింగ్​లో కమర్షియల్ ప్లాట్ కు ఈ యాక్షన్ 
వివరాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్​ద్వారా వివరించారు.   

బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలి

పెద్దమందడి, వెలుగు:  మండల కేంద్రంలోని  ఏపీజీవీబీ బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలని  ఆర్ఎం బీమ్ సేన్ రావు,  అడిషనల్​కలెక్టర్​వేణుగోపాల్ సూచించారు. గురువారం మండల కేంద్రంలో కొత్త  బిల్డింగ్​లోకి బ్యాంక్ సేవలను మార్చారు. ఈ సందర్భంగా హాజరైన ఆర్ఎం మాట్లాడుతూ బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్లు పెట్టాలని ఖాతాదారులను కోరారు. ఖాతాదారులకు మెరుగైన సేవలందించి అభివృద్ధి పథంలో నడపాలని బ్యాంక్ మేనేజర్ కిషన్ లాల్ కు సూచించారు.  మణిగిల్ల గ్రామానికి చెందిన వ్యక్తి  ప్రమాదవశాత్తు  చనిపోతే  ఆయన భార్యకు రూ. 10 లక్షలు చెక్కును అందజేశారు.  జడ్పీటీసీ రఘుపతి రెడ్డి, జిల్లా రైతుబంధు  అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, సింగల్ విండోఅధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

మోడీ పాలనలోనే దేశం అభివృద్ధి

గద్వాల, వెలుగు:  ప్రధాని మోడీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి అన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలో గురువారం  కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సౌత్​ఇండియాకు ఎరువులు ఎగుమతి చేసే ఫ్యాక్టరీని రేపు ప్రధాని ప్రారంభిస్తున్నందున..  ధన్యవాదాలు తెలుపుతూ  వైఎస్సార్​చౌరస్తాలో మోడీ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.  

రైతులు రూల్స్​ ప్రకారం వడ్లు తీసుకెళ్లాలి

వనపర్తి, వెలుగు: రైతులు రూల్స్​పాటిస్తూ కొనుగోలు కేంద్రాలకు  వడ్లు తీసుకెళ్లి మద్దతు ధర పొందాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సూచించారు. గురువారం కలెక్టర్ ఆఫీస్​లో జిల్లా సివిల్​సప్లై శాఖ ఆధ్వర్యంలో కనీస మద్దతు ధరకు  వడ్ల కొనుగోలు గోడపత్రిక,  పాంప్లెంట్లను కలెక్టర్ విడుదల చేశారు. 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వడ్లను శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాలకు  తీసుకురావాలని సూచించారు.  వడ్లు ఏ గ్రేడ్ ధర రూ.2,060,  సాధారణ రకం ధర రూ.2,040 గా నిర్ధారించామన్నారు. దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకురావాలని కోరారు.  అడిషనల్ కలెక్టర్ డి.వేణుగోపాల్,  జిల్లా పౌరసరఫరాల అధికారి కొండల్ రావు, మార్కెటింగ్ అధికారి స్వరణ్​ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

పీహెచ్​సీని తనిఖీ చేసిన డీఎంహెచ్​వో

శ్రీరంగాపూర్, వెలుగు:  మండల కేంద్రంలోని  పీహెచ్​సీని గురువారం  డీఎంహెచ్​వో డాక్టర్ రవిశంకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్​సీలో సీసీ కెమెరాలు, రిజిస్టర్లు, డ్రగ్ స్టోర్ తనిఖీ చేశారు.  ఆస్పత్రి ఆవరణ ను ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉండేలా చూడాలని, ప్రసవాల సంఖ్య  పెంచాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో మాట్లాడుతూ  పీహెచ్​సీకి ఇంటర్నెట్ కనెక్షన్, ఇన్​వర్టర్​లు కావాలని కోరారు. వైద్యాధికారులు డాక్టర్ సృజన, డాక్టర్ శ్రీహరి నాథ్ రెడ్డి, డాక్టర్ ఇస్మాయిల్, డీడీఎం వెంకట కృష్ణారెడ్డి, స్థానిక  లీడర్లు  పృథ్వీరాజ్, కురుమయ్య, హెల్త్ అసిస్టెంట్ రాజశేఖర్, లక్ష్మా రెడ్డి పాల్గొన్నారు. 

ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

వనపర్తి, వెలుగు: పేద ప్రజల ఆరోగ్యం పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆర్థికంగా అదుకుంటోందని వ్యవసాయశాఖ మంత్రి  నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​వద్ద   77 మంది బాధితులకు రూ.21,09,500  విలువై న సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి  మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగాలోని  సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.  జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, జిల్లా  లైబ్రరీ చైర్మన్​లక్ష్మయ్య, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.