
- అగ్రిచట్టాల రద్దు బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం 24న?
- ఆ తర్వాత పార్లమెంటు ముందుకు బిల్లులు
- మిగతా డిమాండ్లపై పోరుకూ సిద్ధమవుతున్న రైతు సంఘాలు
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు సంబంధించిన బిల్లులను కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేబినెట్ ఆమోదించిన తర్వాత ఈ బిల్లులను పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపాయి. రైతులు వ్యతిరేకిస్తున్న అగ్రి చట్టాలను రద్దు చేస్తామని, ఇందుకోసం వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ప్రాసెస్ ను పూర్తి చేస్తామని ప్రధాని మోడీ శుక్రవారం ప్రకటించారు. దీంతో మూడు చట్టాలను రద్దు చేసేందుకు మూడు వేర్వేరు బిల్లులను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వింటర్ సెషన్ లో ఈ చట్టాల రద్దు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇయ్యాల లక్నో మహాపంచాయత్
పార్లమెంటులో అగ్రి చట్టాల రద్దు ప్రాసెస్ పూర్తయ్యేదాకా వెనక్కి తగ్గబోమని ఇదివరకే ప్రకటించిన రైతు సంఘాలు ఇతర డిమాండ్ల సాధనపై ఈ నెల 27న భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించాయి. ఆదివారం సింఘూ బార్డర్లో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) కోర్ కమిటీ మీటింగ్‌లో ఆయా సంఘాల నేతలు పాల్గొన్నారు. మీటింగ్ తర్వాత రైతు సంఘం నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ మీడియాతో మాట్లాడారు. ఇతర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 27న కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఇంతకుముందే నిర్ణయించిన కార్యక్రమాలు మాత్రం యథావిధిగా ఉంటాయన్నారు. సోమవారం లక్నోలో మహా పంచాయత్, 26న ఢిల్లీ బార్డర్లలో నిరసనలు చేపడతామని, 29న పార్లమెంటుకు రోజూ 500 మందితో ట్రాక్టర్ ర్యాలీ స్టార్ట్ చేస్తామని
ప్రకటించారు.
అగ్రి చట్టాలను మళ్లా తెస్తరు: అఖిలేశ్
వచ్చే ఏడాది 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందుకే కేంద్రం అగ్రి చట్టాలను రద్దు చేసిందని, ఆ ఎన్నికలు అయిపోగానే మళ్లా వ్యవసాయ చట్టాలను తెస్తారని యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్అఖిలేశ్ యాదవ్ అన్నారు. అవసరమైతే సాగు చట్టాలను మళ్లీ తీసుకురావొచ్చంటూ శనివారం రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ చేసిన కామెంట్లే ఇందుకు నిదర్శనమని అఖిలేశ్ ఆదివారం ట్వీట్ చేశారు. రైతులకు క్షమాపణలు చెప్తున్నట్లు కేంద్రం నటించిందని, కానీ మోడీ సర్కారు అసలు రంగు బయటపడిందని ఆరోపించారు. ధనవంతుల కోసం పనిచేసే బీజేపీ పేద రైతులను సాగు చట్టాలతో మోసం చేయాలని చూస్తోందన్నారు.
6 డిమాండ్లతో ప్రధానికి లెటర్
పార్లమెంట్లో అగ్రి చట్టాలను రద్దు చేసేవరకు పోరాటం ఆపబోమని ఇప్పటికే స్పష్టం చేసిన రైతు సంఘాలు ఆదివారం ఆరు డిమాండ్లతో ప్రధానికి ఓపెన్ లెటర్ రాశారు. ఇందులో ప్రధానంగా పంటలకు మద్ధతు ధర(ఎంఎస్పీ)కి గ్యారంటీ కల్పించే చట్టంతో పాటు రైతులతో చర్చలను వెంటనే పునరుద్ధరించాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) లీడర్లు కోరారు. ఆందోళనలలో చనిపోయిన 700 మంది రైతులకు ఓ స్మారకం నిర్మించేందుకు ఢిల్లీలో స్థలం ఇవ్వాలన్నారు. ఎలక్ట్రిసిటి అమెండ్మెంట్ బిల్‌ను కూడా వాపస్ తీసుకోవాలని, వ్యర్థాలను కాలిస్తే ఫైన్ వేసేందుకు వీలు కల్పించే ఎన్సీఆర్ఏఏ చట్టంలో ప్రతిపాదనలను తొలగించాలన్నారు. లఖీంపూర్ ఖేరీ సంఘటనలో నిందితుడు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొల గించాలని, రైతులపై కేసులు వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.