నిర్ణీత గడువులోగా లే అవుట్ల అనుమతులను పూర్తి చేయాలి

నిర్ణీత గడువులోగా లే అవుట్ల అనుమతులను పూర్తి చేయాలి

రివ్యూ మీటింగ్​లో ఖమ్మం కలెక్టర్​ వీపీ గౌతమ్​ 

ఖమ్మం, వెలుగు: లే అవుట్లకు పర్మిషన్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇక క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇవ్వాలని ఖమ్మం కలెక్టర్​ వీపీ గౌతమ్​ అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా లే అవుట్ల అనుమతులను పూర్తి చేయాలని చెప్పారు. శుక్రవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్​ మీటింగ్ హాల్ లో జిల్లా స్థాయి లే అవుట్ అప్రూవల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఖమ్మం నగరపాలక సంస్థ, సుడా పరిధిలో లే- అవుట్ ఆమోదం కోసం వచ్చిన 14 దరఖాస్తులను కమిటీ సమావేశంలో పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్న 8 దరఖాస్తులకు కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ జిల్లాలో లే- అవుట్ల ఆమోదం కోసం రెవెన్యూ, విద్యుత్, నీటి పారుదల, రోడ్లు భవనాల, టౌన్ ప్లానింగ్  తదితర శాఖల నుంచి అనుమతుల కోసం అందజేసిన దరఖాస్తులను 21 రోజుల లోగా క్లియర్ చేయాలని సూచించారు. ఆ తర్వాత జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమోదించడం జరుగుతుందని తెలిపారు. గ్రీనరీ కోసం కేటాయించిన స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకొని మొక్కలు నాటాలని ఆదేశించారు. లేఅవుట్ డెవలపర్స్ కూడా నిబంధనల ప్రకారం ల్యాండ్ డెవలప్​మెంట్ పనులు చేపట్టాలని అన్నారు. మున్సిపల్​ కమిషనర్ ఆదర్శ్ సురభి, అడిషనల్​ కలెక్టర్ ఎన్. మధుసూదన్, ఆర్డీవో రవీంద్రనాథ్, ట్రాన్స్ కో ఎస్ఈ సురేందర్, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, ఆర్అండ్​బీ ఈఈ శ్యాంప్రసాద్  పాల్గొన్నారు.

మట్టి విగ్రహాలనే వాడాలి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలనే వాడాలని కలెక్టర్​ అనుదీప్​ సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని సూచించారు. సింగరేణి, ఐటీసీ, నవభారత్, కేటీపీఎస్​ వంటి పరిశ్రమలతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారంతో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. మండపాలు ఏర్పాటు చేసే వారు విద్యుత్​ శాఖ అనుమతి తీసుకొని కరెంట్​ వాడుకోవాలన్నారు. మున్సిపల్​ కమిషనర్లు, తహసీల్దార్లు, విద్యుత్​శాఖ అధికారులు మండపాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. డీజేకు అనుమతి లేదని స్పష్టం చేశారు.