కేసీ కెనాల్ ద్వారా ఏపీ భారీ లూటీ! ఒప్పందాలు, బచావత్ అవార్డులకు మించి నీటి తరలింపు

కేసీ కెనాల్ ద్వారా ఏపీ భారీ లూటీ! ఒప్పందాలు, బచావత్ అవార్డులకు మించి నీటి తరలింపు
  • బ్రజేశ్​కుమార్​ ట్రిబ్యునల్​ ముందు తెలంగాణ వాదనలు
  • 1944లో 10 టీఎంసీలకే హైదరాబాద్, మద్రాస్​ స్టేట్​ మధ్య  అగ్రిమెంట్
  • దానిని తుంగలో తొక్కుతూ 39.9 టీఎంసీలకు బచావత్​ ట్రిబ్యునల్‌‌తో అవార్డు
  • ఆ అవార్డుకు మించి సగటున 54 టీఎంసీలను దోచేస్తున్న ఏపీ 
  • బనకచర్ల  క్రాస్​ రెగ్యులేటర్​ వద్ద టెలిమెట్రీలు పెట్టకుండా అడ్డు 
  • కేసీ కెనాల్​ కింద పంటలకు 18.51 టీఎంసీల నీళ్లే అవసరం
  • మిగిలిన 26.59 టీఎంసీలను ఆదా చేసి తెలంగాణకు ఇవ్వాలి
  • బనకచర్ల నుంచి కేసీ కెనాల్​ ద్వారా నీటిని తీసుకెళ్లకుండా ఏపీని నియంత్రించాలని డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ​స్టేట్, మద్రాస్​ స్టేట్​ మధ్య ఒప్పందం,  బచావత్​ ట్రిబ్యునల్​ కేటాయింపులకు మించి కేసీ (కర్నూల్​– కడప) కెనాల్​ ద్వారా ఏపీ నీళ్లను దోచుకెళ్తున్నదని తెలంగాణ ఆరోపించింది.  కేసీ కెనాల్ ​ద్వారా కేవలం 10 టీఎంసీల వినియోగానికి మాత్రమే ఒప్పందం జరిగిందని, కానీ, ఏపీ మాత్రం 54 టీఎంసీల నీటిని తరలించుకుంటున్నదని తెలిపింది.  బనకచర్ల క్రాస్​ రెగ్యులేటర్​ వద్ద ఏర్పాటు చేసుకున్న ఎస్కేప్​ చానెల్​ ద్వారా ఏపీ ఎడాపెడా నీటిని తోడేస్తున్నదని,  అక్కడ టెలిమెట్రీలు పెట్టకుండా అడ్డుతగులుతున్నదని పేర్కొన్నది. 

బనకచర్ల దగ్గర ఉన్న అన్ని రెగ్యులేటర్ల వద్ద టెలిమెట్రీలను ఏర్పాటు చేసేంతవరకు అక్కడి నుంచి ఏపీ ఎన్ని నీళ్లను తరలించుకెళ్తున్నదో చెప్పడం కష్టమని స్పష్టం చేసింది. బనకచర్ల వద్ద ఉన్న తెలుగు గంగ, శ్రీశైలం రైట్​ బ్రాంచ్​ కెనాల్, కేసీ కెనాల్స్ వద్ద టెలిమెట్రీలను ఏర్పాటు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. బ్రజేశ్​కుమార్​ ట్రిబ్యునల్​(కృష్ణా వాటర్​ డిస్ప్యూట్స్​ ట్రిబ్యునల్​ –2) ముందు బుధవారం తెలంగాణ తరఫున తుది దశ వాదనలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా బనకచర్ల క్రాస్​ రెగ్యులేటర్​ నుంచి కేసీ కెనాల్​ ద్వారా ఏపీ నీళ్ల దోపిడీకి ఎలా పాల్పడుతున్నదో వివరిస్తూ తెలంగాణ తరఫు అడ్వకేకేట్లు, అధికారులు వాదనలు వినిపించారు.

 1860లో అప్పటి హైదరాబాద్​ రాష్ట్రంలో కేసీ కెనాల్‌‌‌‌‌‌‌‌ను అభివృద్ధి చేశారని వివరించారు. ‘‘భవిష్యత్తులో హైదరాబాద్​ రాష్ట్రం నీటిని మళ్లించుకోవాలనుకుంటే ఎలాంటి అభ్యంతరాలూ లేవనెత్తొద్దని ఆనాడే షరతులు పెట్టారు. అందుకు అనుగుణంగా 1944 జూన్‌‌‌‌‌‌‌‌లో ఆనాటి హైదరాబాద్​ రాష్ట్ర ప్రభుత్వం, మద్రాస్​ ప్రభుత్వం మధ్య ఒక అగ్రిమెంట్​ జరిగింది. ఈ మేరకు ఆనాటి మద్రాస్​ రాష్ట్రంలోని (ఇప్పటి ఏపీ) కేసీ కెనాల్​, హైదరాబాద్​ రాష్ట్రంలోని రాజోలిబండ డైవర్షన్​ స్కీమ్​ (ఆర్డీఎస్​)  ద్వారా నీటి తరలింపులకు సంబంధించి ఒప్పందం కుదిరింది. 

దాని ప్రకారం కేసీ కెనాల్​ ద్వారా కేవలం 10 టీఎంసీలనే వినియోగించుకోవాలి. ఆర్డీఎస్​ నుంచి తెలంగాణ 15.9 టీఎంసీలు, కర్నాటక 1.2 టీఎంసీలు కలిపి 17.1 టీఎంసీల వినియోగానికి ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్నే 1951లో జరిగిన ఇంటర్​ స్టేట్​ కాన్ఫరెన్స్​లో సెంట్రల్​ వాటర్​ అండ్​ పవర్​ కమిషన్​ ఆమోదించింది’’ అని ట్రిబ్యునల్​ ముందు తెలంగాణ తరుపు అడ్వకేట్లు వాదించారు.

ఒప్పందాన్ని ఏపీ తుంగలోకి తొక్కింది 

హైదరాబాద్, మద్రాస్​ రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాన్ని ఏపీ ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని ట్రిబ్యునల్​ ముందు తెలంగాణ వెల్లడించింది. కేసీ కెనాల్​ ద్వారా వినియోగాన్ని 39.9 టీఎంసీలకు ఏపీ పెంచుకున్నదని, ఆ మొత్తానికి బచావత్​ ట్రిబ్యునల్​ (కేడబ్ల్యూడీటీ –1) ద్వారా అవార్డు ఇప్పించుకున్నదని అడ్వకేట్లు తెలిపారు. అయితే, ఆ అవార్డుకు మించి ఏపీ నీటిని వాడుకుంటున్నదని వాదించారు. 

సగటున ఏటా 54 టీఎంసీల నీటిని కేసీ కెనాల్​ ద్వారా ఏపీ తీసుకెళ్తున్నదని పేర్కొన్నారు. కేసీ కెనాల్​ ఆయకట్టులోని నిప్పులవాగు, పెన్నా ఉపనదులైన గాలేరు, కుందు నుంచి వచ్చే 5.2 టీఎంసీల నీటి వాడకాన్ని బచావత్​ ట్రిబ్యునల్​ ముందు ఏపీ చూపించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. సుంకేశుల బ్యారేజీ నుంచే కాకుండా.. మరో మూడు అడిషనల్​ సోర్సుల ద్వారా కూడా కేసీ కెనాల్‌‌‌‌‌‌‌‌కు ఏపీ నీటిని తీసుకెళ్తున్నదని ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌కు వివరించారు. 

ముచ్చుమర్రి కేసీ కెనాల్​ లిఫ్ట్​ స్కీమ్​, మల్యాల లిఫ్ట్​ స్కీమ్​, బనకచర్ల ఎస్కేప్​ చానెల్ ద్వారా శ్రీశైలం నీటిని కేసీ కెనాల్‌‌‌‌‌‌‌‌కు విడుదల చేసి తీసుకెళ్తున్నదని పేర్కొన్నారు. ఈ మూడు సోర్సుల ద్వారా నీటి తరలింపు బచావత్​ ట్రిబ్యునల్​ అవార్డుకు విరుద్ధమని తెలంగాణ అడ్వకేట్లు, అధికారులు బలమైన వాదనలు వినిపించారు.

18 టీఎంసీల కన్నా ఎక్కువ వినియోగం లేదు

కేసీ కెనాల్​ ద్వారా ఏపీ ఎంత మేర నీటిని తరలించుకెళ్తున్నదని తెలంగాణ అడ్వకేట్లను ట్రిబ్యునల్​ చైర్మన్​ ప్రశ్నించగా.. బనకచర్ల వద్ద టెలిమెట్రీలను ఏర్పాటు చేసేందుకు ఏపీ ససేమిరా అంటున్నదని, అక్కడ టెలిమెట్రీలను ఏర్పాటు చేస్తే ఏపీ ఎంత నీటిని తీసుకెళ్తున్నదో కచ్చితంగా చెప్పగలుగుతామని  సమాధానం ఇచ్చారు. శాస్త్రీయ లెక్కల ఆధారంగా చూస్తే కేసీ కెనాల్​ కింద పంటలకు 18.51 టీఎంసీల నీళ్లు సరిపోతాయని వివరించారు. 

కానీ, ఏపీ ప్రస్తుతం బచావత్​ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ అవార్డు ప్రకారం కేటాయించిన 39.9 టీఎంసీలు, నిప్పులవాగు, కుందు, గాలేరు నదుల నుంచి మరో 5.2 టీఎంసీలను కలిపి 45.1 టీఎంసీల నీళ్ల వినియోగం చూపుతున్నదని పేర్కొన్నారు. కేసీ కెనాల్​ కింద అవసరమైన 18.51 టీఎంసీల నీటిని తీసేస్తే.. 26.59 టీఎంసీల  నీటిని ఆదా చేసేందుకు వీలవుతుందని, ఆ నీటిని కృష్ణా బేసిన్​లోని తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించాలని ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌కు విజ్ఞప్తి చేశారు. ట్రిబ్యునల్​ కేటాయించిన మేరకే కేసీ కెనాల్​ ద్వారా నీటిని వినియోగించుకునేలా ఏపీని నియంత్రించాలని ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ను కోరారు. కాగా, ట్రిబ్యునల్​ ముందు తెలంగాణ వాదనలు గురువారం, శుక్రవారం కూడా కొనసాగనున్నాయి.