తెలంగాణకు ఎవరేం ఇచ్చారో తేల్చుకుందామా? .. కేటీఆర్‌‌కు బండి సంజయ్‌ సవాల్‌

తెలంగాణకు ఎవరేం ఇచ్చారో  తేల్చుకుందామా? .. కేటీఆర్‌‌కు బండి సంజయ్‌ సవాల్‌
  • భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర బహిరంగ చర్చకు సిద్ధమా?

కరీంనగర్, వెలుగు: తెలంగాణకు ఎవరేం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా? డేట్, టైం ఫిక్స్ చేయండి. పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి వద్దకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వో లేక మీ తండ్రో బహిరంగ చర్చకు సిద్ధమా?’’అని మంత్రి కేటీఆర్‌‌కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 9 ఏండ్లలో రూ.9 లక్షల కోట్లు ఇచ్చిందని, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో? ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీని విమర్శించే కనీస అర్హత కేటీఆర్‌‌కు లేదని మండిపడ్డారు. 

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని బుధవారం కరీంనగర్‌‌లోని కోతిరాంపూర్ చౌరస్తా వద్ద ఉన్న బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. నమ్మిన సిద్ధాంతాల కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు బాపూజీ అని కొనియాడారు. చేనేత, చేతివృత్తుల కార్మికుల కంచంలో అన్నం మెతుకుగా మారిన మానవతావాది కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. టీఆర్ఎస్ పురుడు పోసుకుంది బాపూజీ నివాసమైన ‘జలదృశ్యం’లోనేనని, తెలంగాణ నినాదం ఎత్తుకున్న దేవేందర్‌ గౌడ్‌, ఆలె నరేంద్ర, గద్దర్‌, విమలక్క లాంటి వారికీ ఆయన అండగా నిలిచారని గుర్తుచేశారు. బాపూజీ టీఆర్ఎస్ కోసం ఇంటిని త్యాగం చేస్తే, ఆయననే అవమానించిన మూర్ఖుడు కేసీఆర్ అని విమర్శించారు. 

నీకు మోదీని విమర్శించే అర్హత ఉందా?

కేసీఆర్ లేకుంటే కేటీఆర్‌‌కు ఉన్న అర్హత ఏంటని సంజయ్‌ ప్రశ్నించారు. కేటీఆర్ లెక్క అయ్య పేరు చెప్పుకొని ప్రధాని మోదీ, కిషన్ రెడ్డి రాజకీయాల్లోకి రాలేదన్నారు. కృష్ణా నది ద్వారా తెలంగాణకు 575 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉంటే అప్పటి ఏపీ సీఎంతో కుమ్మక్కై 299 టీఎంసీలకు అంగీకరిస్తూ సంతకం చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల్లో అనుమతి లేకుండా ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ ఇవ్వరని, అలాంటిది పాలమూరు ప్రాజెక్టు కోసం డీపీఆర్ ఇవ్వకుండా జాతీయ హోదా ఎలా సాధ్యమని నిలదీశారు. కేటీఆర్‌‌ కండకావరమెక్కి ప్రధానిపై మాట్లాడుతున్నారని, సొంత పార్టీ నేతలే ఆయన భాషను చూసిచీదరించుకుంటున్నారని విమర్శించారు.