ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆర్మూర్, వెలుగు: గోషామహల్ ​ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్​, అరెస్టుకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఆర్మూర్ శాఖ పిలుపు మేరకు బుధవారం చేపట్టిన ఆర్మూర్ బంద్ సక్సెస్​ అయ్యింది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు, విద్యాసంస్థలు బంద్ పాటించారు. వీహెచ్​పీ, భజరంగ్ దళ్, హిందూ ఐక్య వేదిక నాయకులను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకుని సాయంత్రం సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజాసింగ్​పై పీడీ యాక్టు పెట్టి జైలుకు పంపడం యావత్తు హిందూ ప్రజలను దిగ్ర్భాంతికి గురిచేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు ఒక వర్గానికి కొమ్ము కాయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. రాజాసింగ్ కు మద్దతుగా ప్రజలు స్వచ్చందంగా బంద్​ కు సహకరిస్తున్నారని చెప్పారు. 

డైట్ ​కాలేజీ ఎదుట ఎన్ఎస్​యూఐ నిరసన

నిజామాబాద్,  వెలుగు: ప్రభుత్వ డైట్​కాలేజీలో కొన్నేండ్లుగా జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్​యూఐ ఆధ్వర్యంలో బుధవారం డైట్​ కాలేజీ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్ మాట్లాడుతూ డైట్ కాలేజీలో నిధులు దుర్వినియోగమవుతున్నాయని ఆరోపించారు. ప్రిన్సిపల్​శ్రీనివాసరావు 20 ఏళ్లుగా ఇదే కాలేజీలో ఉంటూ విద్యార్థులను టార్గెట్​చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు.  గర్భిణి విద్యార్థులు సెలవులు అడిగినా ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. ప్రాక్టికల్స్ మార్కులు, అటెండెన్స్​తగ్గించి పరీక్షలు రాయకుండా ఫెయిల్ చేస్తానని బెదిరిస్తూ విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడన్నారు. ప్రిన్సిపల్ ను తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేయాలని లేకపోతే విద్యార్థుల పక్షాన ఎన్ఎస్ యూఐ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో  నిజామాబాద్ మైనారిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఏజాజ్, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఆరిఫ్, జాకీర్ హుస్సేన్, హుస్సేన్ ఖాన్, సయ్యద్ కైసర్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ప్రమోద్, విశాల్​ పాల్గొన్నారు.

సంక్షేమ పథకాల్లో తెలంగాణ నంబర్​వన్​

బోధన్, వెలుగు: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్​వన్​గా ఉందని ఎమ్మెల్యే షకిల్​అమేర్​ దీమా వ్యక్తం  చేశారు.  బుధవారం బోధన్​, ఎడపల్లి, రెంజల్, నవీపేట్​ మండలాల్లో ఆసరా పింఛన్​ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్​ఎన్నికల హామీ మేరకు 57 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికి పింఛన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. బీజేపీ పాలనలో దేశ ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో కొన్ని పార్టీలు ప్రజలను మతం పేరుతో రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని, అలాంటి పార్టీల మాయలో పడొద్దని ఎమ్మెల్యే అన్నారు. అర్హులకు ఎవరికైనా పింఛన్లు రాకపోతే ఆందోళన చెందొద్దని, ఎంపీడీవో ఆఫీసులో అప్లై చేసుకోవాలని సూచించారు.  కార్యక్రమంలో మున్సిపల్​ చైర్​పర్సన్​ తూము  పద్మావతి, జడ్పీ వైస్​చైర్​పర్సన్​రజితయాదవ్, ఆర్డీవో రాజేశ్వర్​, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్​లు ఎంపీటీసీలు, టీఆర్ఎస్​మండల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. 

కామారెడ్డి , వెలుగు: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వమని విప్​ గంప గోవర్ధన్​ విమర్శించారు.  బుధవారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టెకిర్యాల్​, అడ్లూర్​, రామేశ్వర్​పల్లిలో ఆసరా ఫించన్​ కొత్త లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి టౌన్​లో కొత్తగా 3,149 పింఛన్లు మంజూరయ్యాయన్నారు. కౌన్సిలర్​ శంకర్​రావు,  లీడర్లు వేణుగోపాల్​రావు, బల్వంత్​రావు, ప్రభాకర్​రెడ్డి పాల్గొన్నారు.

మహిళల హక్కుల కోసం ఉద్యమిద్దాం

సిరికొండ,వెలుగు: మహిళల హక్కుల సాధనకు ప్రతీ ఒక్కరూ ఉద్యమించాలని పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వి.గోదావరి అన్నారు. బుధవారం సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో పీవోడబ్ల్యూ మహాజన సభ జరిగింది. ఈ సందర్భంగా వి.గోదావరి మాట్లాడుతూ సమాజాలు మారుతున్నా మహిళలపై అణచివేత ఇంకా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల్లో ఉన్న పాలకులు మహిళల కోసం ఎంతో చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా ఉందన్నారు. పోరాటాల ద్వారా మహిళలు హక్కులు సాధించుకోవాలని అన్నారు. అనంతరం ఏరియా కొత్త కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా మానస, కార్యదర్శిగా పుష్స, ఉపాధ్యక్షురాలిగా గంగామణి, ట్రెజరర్​గా కోశాధికారి భాగ్య, సహాయకార్యదర్శిగా జమునను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ప్రజాపంథా నాయకులు  రామకృష్ణ, రమ, బాబన్న రాజేశ్వర్, రమేశ్,  సాయిరెడ్డి 
పాల్గొన్నారు. 

చదువుతోపాటు ఆటల్లోనూ రాణించాలి 

మాక్లూర్, వెలుగు: స్టూడెంట్స్​ చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు అన్నారు. బుధవారం మాక్లూర్ మండలం దాస్​ నగర్ లోని బీసీ వెల్ఫేర్​ గల్స్​స్కూల్లో జిల్లా స్థాయి క్రీడలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్టూడెంట్స్​ బాగా చదివి అన్ని రంగాల్లో పట్టు సాధించాలని సూచించారు. క్రీడల్లో జిల్లాలోని 9 రెసిడెన్షియల్​స్కూళ్లకు చెందిన 19 టీంలు పాల్గొంటున్నాయి. కార్యక్రమంలో ఆర్సీవో సత్యనాథ్​రెడ్డి, ప్రిన్స్​పల్​ సంజీవ్​ రెడ్డి,డీఐఈవో రఘురాజు పాల్గొన్నారు. 

నందిపేట, వెలుగు: ​నందిపేట మండలం నూత్​పల్లి గ్రామంలోని బీసీ వెల్ఫేర్​స్కూల్​లో బుధవారం క్రీడా పోటీలను జడ్పీ చైర్మన్​ విఠల్​రావ్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ​నవీన, ఆర్సీవో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సరసమైన ధరలకు వెండి, బంగారు నగలు 

నిజామాబాద్,  వెలుగు:  సరమైన ధరలకు వెండి, బంగారు నగలు అందించేందుకు లలితా జ్యూవెల్లర్స్​ఎప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే గణేశ్​గుప్తా అన్నారు. బుధవారం నిజామాబాద్ లో లలితా జ్యూవెల్లర్స్ 43 వ బ్రాంచ్ ను ఆ సంస్థ ఓనర్ ​కిరణ్​కుమార్​తో కలిసి ప్రారంభించారు. హైదరాబాద్​రోడ్​లో అధునాతన హంగులతో వివిధ రకాల బంగారు, వెండి, డైమండ్ నగల కోసం షోరూం ఏర్పాటు చేసినట్లు చె
ప్పారు. లలితా జ్యూవెలర్స్​ ఓనర్​ కిరణ్​ కుమార్​ మాట్లాడుతూ ప్రజలకు తయారీ ధరలకే  నగలు అందించడం లలితా జ్యూవెలర్స్ ప్రత్యేకత అన్నారు. నాణ్యమైన బంగారు, వెండి నగలు అందించేందుకు ఫ్లెక్సీ టు ఫ్లెక్సీ 11 నెలల నగల కొనుగోలు స్కీంను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మార్కెట్​లో కంటే తక్కువ తరుగులో బంగారు నగలను అందజేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మేయర్​ దండు నీతూ కిరణ్​, డిప్యూటీ మేయర్​ ఇద్రీస్​, కార్పొరేటర్​  బైకన్​ సుధా 
పాల్గొన్నారు. 

కేసీఆర్​ గడీలో తెలంగాణ బందీ 

కామారెడ్డి , వెలుగు: నీళ్లు, నిధులు, నియమకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ  కేసీఆర్​ గడీలో బందీ అయిందని మాజీ మంత్రి, కాంగ్రెస్​ నేత షబ్బీర్​అలీ అన్నారు. బుధవారం మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లి,  సోమార్​పేట్,  బంజేపల్లి,  నెమలి తండాల్లో  కాంగ్రెస్​ ఆధ్వర్యంలో  రైతు సంఘర్షణ డిక్లరేషన్​ ప్రోగ్రాం నిర్వహించారు. అనంతరం పార్టీ జెండాలు ఆవిష్కరించారు. షబ్బీర్​అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ ఫ్యామిలీ మాత్రమే బంగారుమయమైందన్నారు.  అన్ని వర్గాలను కేసీఆర్ సర్కారు ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.  కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై  కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు.  రైతులకు అండగా కాంగ్రెస్​ నిలుస్తుందన్నారు. భారత్ జోడో యాత్రను పార్టీ శ్రేణులు సక్సెస్​ చేయాలన్నారు.  కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్​ శ్రీనివాస్​రావు,  మండల అధ్యక్షుడు గణేశ్​నాయక్​, లీడర్లు  ఇంద్రకరణ్​రెడ్డి, చంద్రకాంత్​రెడ్డి,  రమేశ్​గౌడ్​ పాల్గొన్నారు.

జుక్కల్​లో సెంట్రల్​ టీం పర్యటన

రూర్బన్​ స్కీం పనుల పరిశీలన

కామారెడ్డి , పిట్లం, వెలుగు: మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం రూర్బన్​ స్కీం తీసుకు వచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి జాయింట్​సెక్రటరీ శ్రుతి శరణ్​ అన్నారు.  బుధవారం కామారెడ్డి జిల్లా జుక్కల్​ మండలంలో సెంట్రల్ టీం సభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా మహమ్మదాబాద్ గ్రామంలో ఏర్పాటు చేసిన మీటింగ్​లో టీం సభ్యులు మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలు పట్టణాలతో సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో రూర్బన్ స్కీంలో నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పెండింగ్​లో ఉన్న పనులను తొందరగా పూర్తి చేయాలని ఆఫీసర్లకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ జితేశ్​వి.పాటిల్​ మండలంలో జరిగిన రూర్బన్​స్కీం డెవలప్​మెంట్​పనులను వివరించారు.  అనంతరం మండలంలోని 400 మెట్రిక్​ టన్నుల గోదాం, గోపాల మిత్ర కేంద్రం, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాన్ని  పరిశీలించారు. అనంతరం జుక్కల్​లో  ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రం, 30 బెడ్ హాస్పిటల్​ను పరిశీలించారు. అంతకుముందు జుక్కల్​ క్లస్టర్​లో చేపట్టిన  రూర్బన్​ స్కీంపై కామారెడ్డి  కలెక్టరేట్​లో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు. కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి డిప్యూటీ సెక్రటరీ నివేదిత, అడిషనల్​ కలెక్టర్​వెంకటేశ్​దోత్రే,  ట్రైనింగ్​కలెక్టర్​ శివేంద్ర ప్రతాప్​, డీఆర్డీవో సాయన్న పాల్గొన్నారు. 

అధికారుల పనితీరుపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం 

తాడ్వాయి, వెలుగు: అధికారులు పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని తాడ్వాయి ఎంపీపీ కౌడి రవి హెచ్చరించారు. బుధవారం  ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీవో కార్యాలయంలో తాడ్వాయి మండల జనరల్​బాడీ మీటింగ్​జరిగింది. ఈ సందర్భంగా కొందరు అధికారుల పనితీరుపై సర్పంచ్ లు, ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్అండ్ బీ డీఈ నారాయణ తో పాటు ట్రాన్స్​కో  ఏఈ కరుణకర్ పనితీరుపై సర్పంచ్ లు, ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి – ఎల్లారెడ్డి రోడ్డుపై గుంతలతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని, ఆర్అండ్​బీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు.  అంగన్వాడీ కేంద్రాలలో సమయపాలన పాటించడం లేదని ప్రజాప్రతినిధులు ఆరోపించారు. మీటింగ్​లో జడ్పీటీసీ రమాదేవి, వైస్ ఎంపీపీ నర్సింహులు, డీసీసీబీ డైరెక్టర్ కపిల్ రెడ్డి, ఎంపీడీఓ రాజ్ వీర్, తహసీల్దార్​ వెంకటేశ్, సర్పంచ్​లు బండారి మంజూరు, నాగభూషణం పాల్గొన్నారు.

ఎంపీపీ భర్తపై బీజేపీ నాయకుల ఫిర్యాదు 

బోధన్, వెలుగు: బీజేపీని దూషించిన బోధన్​ ఎంపీపీ బుద్దె సావిత్రి భర్త బుద్దె రాజేశ్వర్​పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఆసరా పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే షకిల్, అధికారుల సమక్షంలో వేదికపై బీజేపీని పరుష పదజాలంతో దూషించడం సరికాదన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేశ్వర్​ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్​చేశారు. ఫిర్యాదు చేసినవారిలో బీజేపీ ఫ్లోర్​లీడర్ మాసిని వినోద్​, టౌన్​ప్రధాన కార్యదర్శులు కందికట్ల వాసు, అరవింద్​, ఉపాధ్యక్షుడు గాదే సందీప్, బీజేవైఎం టౌన్​ అధ్యక్షుడు వెంకటేశ్ ​ఉన్నారు. 

రూట్​ మ్యాప్​ పరిశీలన 

ఆర్మూర్, వెలుగు: గణేశ్​నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్​ చైర్ పర్సన్ పండిత్​ వినీత తెలిపారు. బుధవారం నిమజ్జన రూట్​ మ్యాప్ ను మున్సిపల్, పోలీస్, రెవెన్యూ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఆర్మూర్ శివాజీ చౌక్ మీదుగా కిందిబజార్​, పెద్దబజార్ మీదుగా దోబీఘాట్​ నుంచి గూండ్ల చెరువు మార్గంలో  లైటింగ్ ఏర్పాటు చేస్తామని, రోడ్ల వెంట మొరం పోసి రోడ్డు బాగు చేస్తామన్నారు. చెరువు వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచి, అయిదు క్రేన్ లను తెప్పిస్తున్నట్లు చైర్ పర్సన్​ తెలిపారు. తహసీల్దార్​వేణుగౌడ్​, కమిషనర్​ జగదీశ్వర్ గౌడ్​, సీఐ సురేశ్​బాబు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

భిక్కనూరు, వెలుగు: మండల కేంద్రంలోని శ్రీపార్వతీ సిద్ధరామేశ్వర ఆలయ సమీపంలోని చెరువును బుధవారం ఎస్సై ఆనంద్​గౌడ్​, సర్పంచ్​ తునికి వేణు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో కొలువుదీరిన వినాయకుల నిమజ్జనం శుక్రవారం ఉంటుందన్నారు. ఎంపీపీ గాల్​రెడ్డి,  ఉపసర్పంచ్​ బోడ నరేశ్, నరసింహారెడ్డి, నాగభూషణంగౌడ్​, వార్డు సభ్యులు పాల్గొన్నారు. 

గణేశ్​ నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు 

నవీపేట్, వెలుగు:  ఈ నెల 9న జరిగే గణేశ్​నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్​నారాయణరెడ్డి, సీపీ నాగరాజు చెప్పారు. బుధవారం నిమజ్జనం రూట్ మ్యాప్ ను పరిశీలించారు. నిజామాబాద్ నుంచి యంచ గోదావరి వరకు గణేశ్​లను ఎలా తరలించాలో ఆఫీసర్స్​కు సూచనలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గణేశ్​నిమజ్జనం కోసం గోదావరి నదికి ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివస్తారన్నారు. గోదావరి బ్రిడ్జిపై ఐదు క్రేన్స్ తో పాటు గజ ఈతగాళ్లు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బ్రిడ్జి పైన ఫోకస్ లైట్లు, రోడ్ల వెంబడి ఉన్న గుంతలు పూడ్చడం.. వంటి పనులు చేపట్టనున్నట్లు ఆయా డిపార్ట్​మెంట్​అధికారులు కలెక్టర్​కు వివరించారు. ప్రజలు శాంతి భద్రతల విషయంలో, ట్రాఫిక్ కు సహకరించాలని సీపీ నాగరాజు విజ్ఞప్తి చేసారు. అడిషనల్​కలెక్టర్​చిత్ర మిశ్రా, ఆర్డీవో రవి, ఏసీపీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ వీర్ సింగ్ పాల్గొన్నారు.

సిద్ధరామేశ్వర ఆలయ హుండీ లెక్కింపు 

భిక్కనూరు,వెలుగు: భిక్కనూరు మండల కేంద్రంలోని శ్రీసిద్ధరామేశ్వర స్వయంభూలింగ ఆలయంలో బుధవారం 41రోజులకు సంబంధించి హుండీ లెక్కింపు చేపట్టారు. హుండీ ఆదాయం రూ.3లక్షల 84వేల543 వచ్చినట్లు ఆలయాల సహాయ కమిషనర్​సోమయ్య చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీధర్​,చైర్మన్​ మహేందర్​రెడ్డి, డైరెక్టర్లు తాటికొండ బాబు పాల్గొన్నారు.

పేషెంట్లకు మెరుగైన సేవలు అందించాలి

కామారెడ్డి , వెలుగు: పేషెంట్లకు మెరుగైన సేవలు అందించాలని డాక్టర్లు, స్టాఫ్​కు వైద్య విధాన పరిషత్​ కమిషనర్​ అజయ్​కుమార్​ సూచించారు. బుధవారం కామారెడ్డి జిల్లా హాస్పిటల్​ను ఆయన పరిశీలించారు.   హాస్పిటల్​లో పేషెంట్లకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.  జిల్లా హాస్పిటల్​ మెడికల్  కాలేజీ పరిధిలోకి వెళ్తున్నందున  డాక్టర్ల సర్ధుబాటుపై పరిశీలన చేస్తామన్నారు.  సూపరింటెండెంట్​విజయలక్ష్మీ , ఆర్ఎంవో శ్రీనివాస్​ పాల్గొన్నారు. 

ఓటర్ కార్డులకు ఆధార్ లింక్​ చేసుకోవాలి

ఆర్మూర్, వెలుగు : ఓటర్ కార్డులకు ఆధార్ లింక్ చేసుకోవాలని ఆర్మూర్​ ఆర్డీవో శ్రీనివాసులు సూచించారు.  ఆర్మూర్ మున్సిపల్​పరిధిలోని పెర్కిట్​, కొటార్మూర్ లో మున్సిపల్​ టీం చేపట్టిన సర్వేను బుధవారం ఆర్డీవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. 

ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలి

నిజామాబాద్ టౌన్ , వెలుగు: నిజామాబాద్ లో క్రీడాకారుల కోసం ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలని జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్​గుప్తకు ఎమ్మెల్సీ కవితను కోరారు. బుధవారం ఈమేరకు వినతిపత్రం ఇచ్చారు.  జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నా ఇంటర్ స్టేడియం లేకపోవడం శోచనీయమన్నారు. 

బెస్ట్ ​టీచర్లకు సన్మానం 

సిరికొండ, వెలుగు: టీచర్స్​డే సందర్భంగా ఎంపికైన 15 మంది బెస్ట్​టీచర్లను ఎంపీడీవో ఆఫీసులో ఎంపీపీ సంగీత , ఇన్​చార్జి ఎంఈవో  శ్రీనివాస్​ బుధవారం సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని ఎంపీపీ అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో  లక్ష్మీ ప్రసాద్, పీఆర్​టీయూ మండల అధ్యక్షుడు నరహరి, టీచర్లు పాల్గొన్నారు. 

ఆర్మూర్​ డిపోను లాభాల్లోకి తీసుకురావాలి

ఆర్మూర్, వెలుగు: నష్టాల్లో ఉన్న ఆర్మూర్ ఆర్టీసీ డిపోను లాభాల్లోకి తీసుకువచ్చేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఆర్మూర్ డిపో మేనేజర్​ కవిత సిబ్బందికి సూచించారు. బుధవారం డిపో ఆఫీస్ లో ‘ఒక గొప్ప మార్పునకు శ్రీకారం’ కార్యక్రమాన్ని డీఎం ప్రారంభించారు. దీనిలో భాగంగా ఈనెల 30 వరకు ఆర్టీసీ సిబ్బందికి ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తారు. కార్యక్రమంలో ఆర్టీసీ కరీంనగర్​ జోన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్​ వి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.