బార్డర్ గొడవపై  డ్రాగన్ ఉద్దేశం ఇదే

బార్డర్ గొడవపై  డ్రాగన్ ఉద్దేశం ఇదే

న్యూఢిల్లీ:  మనదేశంతో సరిహద్దు వివాదం ముగిసిపోకుండా, నిరంతరం రగులుతూ సజీవంగా కొనసాగాలన్నదే చైనా ఉద్దేశమని ఆర్మీ చీఫ్​జనరల్ మనోజ్ పాండే అన్నారు. చైనా బార్డర్ వద్ద ఎలాంటి పరిస్థితి తలెత్తినా దీటుగా ఎదుర్కొనేలా బలగాలను మోహరించామని చెప్పారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బార్డర్ వెంబడి ఏప్రిల్ 2020 నాటికి ముందు ఉన్న పరిస్థితిని పునరుద్ధరించడమే ఆర్మీ లక్ష్యంగా పెట్టుకుందని, ఇందుకోసం బలగాలకు తగిన గైడెన్స్ ఇచ్చామన్నారు. ‘‘బార్డర్ సమస్యకు పరిష్కారం అనేది ప్రధాన విషయం. కానీ బౌండరీ ఇష్యూను సజీవంగా ఉంచాలన్నదే చైనా ఉద్దేశంగా కన్పిస్తోంది” అని ఆయన తెలిపారు. ఇప్పటివరకు దౌత్యపరంగా, మిలిటరీ పరంగా చర్చల ద్వారా పాంగాంగ్ సో సరస్సు, గోగ్రా, గల్వాన్ లోని పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద రెండు వైపులా బలగాల ఉపసంహరణ జరిగిందని, మిగతా ప్రాంతాలపైనా చర్చించి ఇలాంటి పరిష్కారం చేసుకోవాల్సి ఉందన్నారు.