తరాలు మారినా మారని స్త్రీల తలరాతలు
న్యూఢిల్లీ: తరాలు మారినా ఆడవాళ్ల తలరాతలు మారడం లేదన్నది ముమ్మాటికీ నిజమేననిపిస్తోంది. నాగరిక సమాజంలో మహిళలకు పెద్దపీట వేశామని చెబుతున్నప్పటికీ వాస్తవాలు కాస్త కటువుగానే ఉన్నాయి. రోజురోజుకీ అబలలపై పెరుగుతున్న అత్యాచారాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఈ 21వ శతాబ్దంలో కూడా బానిసలుగా బతుకుతున్న మహిళల వ్యథ తెలిస్తే ఆశ్యర్యపోవాల్సిందే. తాజాగా ఐక్యరాజ్యసమితి రిపోర్టు ప్రకారం.. ప్రపంచంలో 29 మిలియన్ల మంది మహిళలు, యువతులు ఆధునిక బానిసత్వంలో మగ్గుతున్నారని తేలింది. వివిధ దేశాల్లో ప్రతి రోజూ భారీ సంఖ్యలో మహిళలు, యువతులు అనారోగ్యం బారిన పడుతున్నారని ఈ నివేదిక కళ్లు తెరిపించింది. ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో ఏదో ఒక చోట ప్రతి 130 మంది స్ర్తీలు, బాలికల్లో ఒకరు రోజూ బలవంతపు పెళ్లి, శ్రమ, గృహ హింస, దేశీ దాస్యానికి గురవుతున్నారు. ఈ సంఖ్యను అంకెల్లో లెక్కిస్తే ఆస్ట్రేలియా జనాభా కంటే అధికమని చెప్పొచ్చు.
‘వాస్తవం ఏంటంటే.. మానవ చరిత్రలో ఎన్నడూ లేనంతగా చాలా మంది మహిళలు, యువతులు, బాలికలు ఈ రోజుల్లో బానిసలుగా బతుకీడుస్తున్నారు’ అని వాక్ ఫ్రీ యాంటీ-స్లేవరీ ఆర్గనైజేషన్ కో-ఫౌండర్ గ్రేస్ ఫారెస్ట్ చెప్పారు. ఓ వ్యక్తి స్వేచ్ఛను పద్ధతి ప్రకారం తొలగించడమే ఆధునిక బానిసత్వానికి నిర్వచనమని ఫారెస్ట్ పేర్కొన్నారు. వాక్ ఫ్రీ ఫౌండేషన్ తయారు చేసిన రిపోర్టు ప్రకారం.. బలవంతపు లైంగిక దోపిడీకి గురైన వారిలో 99 శాతం మంది మహిళలే ఉన్నారు. అదనంగా, బలవంతపు వివాహాలు చేసుకున్న వారిలో 84 శాతం మంది, బలవంతంగా శ్రమకు గురైన వారిలో 58 శాతం మంది స్త్రీలు ఉండటం గమనార్హం. ఆందోళనకర విషయం ఏంటంటే.. ఈ దోపిడీని నెమ్మదిగా అందరూ ఒప్పుకునే భావనగా మార్చుతుండటం. అలాగే కరోనా మహమ్మారి వల్ల బాధితుల పరిస్థితి మరింత దిగజారింది. సమాజంలో అసమానతలు పోయి స్త్రీలకు పని విషయంలో, పెళ్లి చేసుకోవడంలో పూర్తి స్వేచ్ఛను తీసుకురావడం కోసం అందరూ ముక్త కంఠంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పలువురు మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
