గ్రూప్–1 ప్రిలిమినరీ ఎగ్జామ్‌‌కు ఏర్పాట్లు పూర్తి

గ్రూప్–1 ప్రిలిమినరీ ఎగ్జామ్‌‌కు ఏర్పాట్లు పూర్తి
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం
  • వివరాలు వెల్లడించిన ఉమ్మడి జిల్లా కలెక్టర్లు

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వనపర్తి, గద్వాల, నాగర్‌‌‌‌ కర్నూల్ టౌన్‌‌,  వెలుగు: ఈ నెల 16న జరగనున్న గ్రూప్–1 ప్రిలిమినరీ ఎగ్జామ్‌‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు బుధవారం టీఎస్‌‌పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులతో హైదరాబాద్‌‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు.  అనంతరం కలెక్టర్లు ఎస్పీలతో కలిసి మీటింగ్‌‌లు పెట్టి వివరాలు వెల్లడించారు.  మహబూబ్‌‌నగర్‌‌‌‌లో కలెక్టర్‌‌‌‌ వెంకట్‌‌ రావు మాట్లాడుతూ జిల్లాలో 12,115 మంది అభ్యర్థులు పరీక్ష రాయనుండగా..  34 సెంటర్లను ఏర్పాటు చేశామని చెప్పారు.  9 రూట్లుగా విభజించి  9 మంది లైజన్ ఆఫీసర్లుగా , 34 మందిని సహాయ లైజన్ ఆఫీసర్లుగా నియమించామన్నారు.  ఉదయం 10.15 గంటలు దాటితే లోపలికి అనుమతించమని,  అభ్యర్థులు బూట్లు వేసుకోవద్దని, సాదా చెప్పులు వేసుకుని రావాలన్నారు.  సెంటర్లలో డ్యూయల్ డెస్కులు ఏర్పాటు చేసినందున రైటింగ్ ప్యాడ్‌‌తో పాటు వాచ్‌‌, సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌‌ పరికరాలకు అనుమతి లేదన్నారు.  వైద్యా రోగ్యశాఖ ద్వారా ప్రాథమిక చికిత్స ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ  ప్రతి సెంటర్‌‌‌‌తో పాటు  స్ట్రాంగ్ రూమ్ వద్ద , మెటీరియల్‌‌ భద్రపరిచే చోట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 

వనపర్తిలో 4,343 మంది అభ్యర్థులు 

వనపర్తి కలెక్టర్‌‌‌‌ షేక్ యాస్మిన్‌‌ బాషా మాట్లాడుతూ జిల్లాలో 4,343 మంది అభ్యర్థులు  గ్రూప్ -1 ప్రిలిమినరీ ఎగ్జామ్‌‌ రాయనుండగా... 16  సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు.   ఎగ్జామ్‌‌ ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుందని, 10.15 గంటలకే  గేట్లు మూసివేస్తామని చెప్పారు.  బయోమెట్రిక్ విధానం ద్వారా అటెండెన్స్ తీసుకుంటామని, అభ్యర్థులు కచ్చితంగా ఉదయం  8.30 గంటల వరకు  సెంటర్ కు చేరుకోవాలని సూచించారు.  అభ్యర్థులు తమ హాల్ టికెట్ డౌన్‌‌లోడ్‌‌ చేసుకున్న తర్వాత ఫొటో సరిగా రాకుంటే  గెజిటెడ్ అధికారి  ధ్రువీకరించిన 3 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలను సెంటర్‌‌‌‌కు  తీసుకురావాల్సి ఉంటుందన్నారు.  అభ్యర్థులకు  ఏమైనా సందేహాలుంటే  కలెక్టరేట్‌‌లో ఏర్పాటు చేసిన  08545-244525  నంబర్‌‌‌‌కు కాల్‌‌ చేయాలని సూచించారు.   జిల్లాలో ఇప్పటి వరకు 3,110 మంది హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారని,  హాల్ టికెట్ తో పాటు ఫొటో, ఐడీ కార్డును వెంట తెచ్చుకోవాలన్నారు.  సెంటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ డి వేణుగోపాల్ పాల్గొన్నారు.

గద్వాల జిల్లాలో 15 సెంటర్లు ఏర్పాటు 

గద్వాల జిల్లాలో 4874 మంది అభ్యర్థులు ఉండగా.. 15 సెంటర్లు ఏర్పాటు చేశామని కలెక్టర్‌‌‌‌ వల్లూరి క్రాంతి తెలిపారు.   బయోమెట్రిక్ విధానంలో హాజరు ఉంటుందని, 10 .15 గంటలలోగా  సెంటర్లకు చేరుకోవాలని స్పష్టం చేశారు.  ఇప్పటికే ఇన్విజిలేటర్లు, సిట్టింగ్ , ఫ్లయింగ్ స్క్వాడ్‌‌లను నియమించామని చెప్పారు. ఇప్పటివరకు 3,485 మంది హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారని, మిగతావారు వెంటనే డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.  మీటింగ్‌‌లో ఎస్పీ రంజన్ రతన్ కుమార్‌‌‌‌ ఉన్నారు. 

నాగర్‌‌‌‌ కర్నూల్‌‌లో 5,134 మంది అభ్యర్థులు 

నాగర్ కర్నూల్‌‌  జిల్లాలో 5,134 మంది అభ్యర్థులు ఉండగా.. 20 సెంటర్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ ఉదయ్ కుమార్ తెలిపారు.  అన్ని సెంటర్లలో  డ్యూయల్ బెంచీలు, ఫ్యాన్లతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు ఓఎంఆర్‌‌‌‌ షీట్ భర్తీ చేసేటప్పుడు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కోరారు.  వైట్‌‌నర్‌‌‌‌ , చాక్ పౌడర్ ఉపయోగిస్తే ఆన్సర్‌‌‌‌ షీట్‌‌ డిస్‌‌ క్వాలిఫై అవుతుందని హెచ్చరించారు. కాలిక్యులేటర్,  లాంగ్ బుక్స్, పేజర్, సెల్ ఫోన్, టాబ్లెట్, బ్లూటూత్, వాచ్ , బ్యాగులు, రైటింగ్ పాడ్‌‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు.  సెంటర్‌‌‌‌ చుట్టు పక్కల రాజకీయ, వ్యక్తిగత ప్రోగ్రామ్‌‌లను నిషేధిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మనోహర్, అడిషనల్‌‌ కలెక్టర్లు మనూ చౌదరి, మోతిలాల్, డీఈవో గోవిందరాజులు పాల్గొన్నారు.