నేడే ఎమ్మెల్సీ ఎన్నిక

నేడే ఎమ్మెల్సీ ఎన్నిక

ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 8,296 మంది ఓటర్లు
హ్యాట్రిక్​ విజయంపై కాటేపల్లి నజర్​
సానుభూతి వర్క్ అవుట్​ అవుతుందని అపోజిషన్​ లీడర్ల నమ్మకం

మహబూబ్​నగర్, వెలుగు : టీచర్​ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి పాలమూరులోని అన్ని  జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎలక్షన్​ సిబ్బందికి ఎన్నికల మెటీరియల్​ను ఆదివారం పంపిణీ చేశారు. పోలింగ్ నిర్వహణపై ప్రిసైడింగ్, అసిస్టెంట్​ ప్రిసైడింగ్  ఆఫీసర్లు, పోలింగ్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్స్, పోలీస్, ఇతర ఆఫీసర్లకు ఉన్నతాధికారులు సలహాలు, సూచనలు అందించారు. ఉదయం 8 గంటలకు పోలింగ్​ ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు పూర్తవుతుంది. మహబూబ్​నగర్,​- రంగారెడ్డి, -హైదరాబాద్  టీచర్​ ఎమ్మెల్సీ నియోకవర్గంలో 29,720 మంది ఓటర్లు ఉండగా, ఉమ్మడి పాలమూరు జిల్లాలో 8,296 మంది ఉన్నారు. 

కీలకం కానున్న టీచర్ల తీర్పు..

అసెంబ్లీ ఎన్నికలకు మరో 8 నెలల టైం మాత్రమే ఉంది. తెలంగాణ భవన్​లో జరిగిన బీఆర్ఎస్​ విస్త్రత స్థాయి సమావేశంలో అక్టోబర్​లో ఎన్నికలు వస్తాయని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రజల మధ్యే ఉండాలని సూచించారు. ఈ క్రమంలో జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ ఎన్నికల్లో టీచర్లు ఇచ్చే తీర్పు రానున్న ఎన్నికలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. దీంతో రూలింగ్​ పార్టీతో పాటు అపోజిషన్​ పార్టీలు అలర్ట్​ అయ్యాయి. ఆయా పార్టీలు తమ మద్దతు ఇచ్చిన వారిని గెలిపించుకునేందుకు ప్రచారం నిర్వహించాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటొచ్చని భావిస్తున్నారు. 

జీవో 317 ఎఫెక్ట్..​

ఈ ఎన్నికల్లో జీవో 317 ఎఫెక్ట్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రెండు ప్రధాన సంఘాలు మద్దతు తెలుపుతున్న అభ్యర్థులపై పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ జీవో కారణంగా స్థానికతను కోల్పోయామని టీచర్లు ఆందోళన బాటపట్టారు. కొందరు మనస్తాపంతో చనిపోయారు. లీడర్ల సపోర్ట్​ ఉన్న కొందరు టీచర్లకు అక్రమంగా కేటాయింపులు చేశారనే ఆరోపణలున్నాయి. దీనికితోడు సీనియారిటీ లిస్టులో తప్పులు ఉన్నా, సరి చేయకుండా కేటాయింపులు చేయడంపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ ఇష్యూపై బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​తో పాటు కాంగ్రెస్​ పార్టీ ఉద్యమాలు చేశాయి. ఈ అంశంపై ప్రస్తుతం టీచర్​ ఎమ్మెల్సీలుగా ఉన్న ముగ్గురు కూడా ప్రభుత్వంతో చర్చించకపోవడం, టీచర్ల తరపున మాట్లాడకపోవడం మైనస్​గా మారే చాన్స్​ ఉంది. దీనికితోడు ఈసారి టీచర్లు మార్పు కోరుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది.

నలుగురి మధ్య ప్రధాన పోటీ!

ఈ ఎన్నికల్లో 21 మంది పోటీలో ఉన్నారు. అందులో బీఆర్ఎస్​, కాంగ్రెస్, టీఎస్​ పీఆర్టీయూ బలపర్చిన అభ్యర్థితో పాటు బీజేపీ నుంచి పోటీ చేస్తున్న క్యాండిడేట్​ మధ్య పోటీ ఉంటుందని అంటున్నారు. బీఆర్ఎస్​ మద్దతుతో పోటీలో ఉన్న కాటేపల్లి జనార్దన్​రెడ్డి 2011, 2017లో జరిగిన టీచర్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు. ఈ సారి కూడా గెలిచి హ్యాట్రిక్​ నమోదు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇక 2017 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్​రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. ఈసారి విజయం తననే వరిస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. ఈయన తరపున కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, పార్టీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్​రెడ్డి టీచర్లతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ప్రచారం చేశారు. మాణిక్​రెడ్డి నిరుడు ఎన్నికల్లో సెకండ్​ ప్లేస్​లో నిలవగా, ఈ సారి గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. టీఎస్​ పీఆర్టీయూ వ్యవస్థాపన అధ్యక్షుడు జి హర్షవర్ధన్​రెడ్డి నిరుడు ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ మద్దతుతో బరిలో ఉన్నారు. 

ఓటుకు రూ.3 వేల నుంచి రూ.4 వేలు

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న టీచర్​ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కీలకంగా మారడంతో ప్రధాన పార్టీల మద్దతుతో పోటీలో ఉన్న కొందరు అభ్యర్థులు ఓటర్లకు ఎర వేస్తున్నారు. తమకు ఓటు వేయాలని వాట్సాప్​, టెక్ట్స్​ మెసేజ్​లు పంపుతున్నారు. కొందరు ఫోన్​పే, గూగుల్​ పే ఉందా? అని ఆరా తీస్తున్నారు. ఒక్కో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఇస్తామని ఫోన్లు చేసి మరీ చెబుతున్నారు.