ఫోన్​ ట్యాపింగ్​ కేసు.. నేడు ఇంటెలిజెన్స్‌‌ మాజీ చీఫ్‌‌ ప్రభాకర్​రావు విచారణ!

ఫోన్​ ట్యాపింగ్​ కేసు.. నేడు ఇంటెలిజెన్స్‌‌ మాజీ చీఫ్‌‌ ప్రభాకర్​రావు విచారణ!
  • బాధితుల స్టేట్‌‌మెంట్ రికార్డు చేస్తున్న పోలీసులు
  • సంధ్యా కన్వెన్షన్​ ఎండీ శ్రీధర్ రావు వాంగ్మూలం నమోదు
  • మూడో రోజు కస్టడీలో భుజంగరావు, తిరుపతన్న 
  • సర్వర్ రూమ్‌‌లపై ఆధారాలు సేకరణ

హైదరాబాద్‌‌,వెలుగు: ఫోన్‌‌ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్‌‌ బ్యూరో మాజీ చీఫ్‌‌ ప్రభాకర్‌‌‌‌రావును విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు విడుదలైన తరువాత ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. ఎస్‌‌ఐబీ లాగర్ రూమ్ ధ్వంసం, ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో ప్రణీత్‌‌రావును అరెస్ట్ చేసిన తరువాత ప్రభాకర్‌‌‌‌రావును కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. దర్యాప్తులో భాగంగా ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ప్రభాకర్ రావు అందుబాటులో లేకపోవడంతో  విచారణకు సహకరించాలని సమాచారం ఇచ్చారు. పోలీసుల సూచనలతో ప్రభాకర్‌‌‌‌రావు హైదరాబాద్‌‌కు వచ్చినట్టు తెలిసింది. సోమవారం స్పెషల్ టీమ్‌‌ ముందు హాజరవనున్నట్టు సమాచారం.

బాధితుల స్టేట్‌‌మెంట్స్ రికార్డ్‌‌

ఫోన్​ ట్యాపింగ్​ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు బాధితుల నుంచి సాక్ష్యాలు, సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా కన్వెన్షన్‌‌ ఎండీ సంధ్యా శ్రీధర్‌‌‌‌రావును ఆదివారం విచారించారు. ఫోన్‌‌ట్యాపింగ్‌‌ ద్వారా తనపై అక్రమకేసులు పెట్టారని శ్రీధర్‌‌‌‌రావు ఇప్పటికే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల పిలుపుతో శ్రీధర్‌‌‌‌రావు తన అడ్వొకేట్‌‌తో కలిసి బంజారాహిల్స్‌‌ పీఎస్‌‌కు వచ్చారు. శ్రీధర్ రావు ఫిర్యాదు ఆధారంగా స్పెషల్‌‌ టీమ్‌‌ పోలీసులు విచారించారు. ఫోన్‌‌ట్యాపింగ్‌‌ చేసినట్టు చెప్పడానికి గల కారణాలు, వాటికి సంబంధించిన సాక్ష్యాలను అందించాలని కోరారు. అయితే, శ్రీధర్‌‌‌‌రావు ఇచ్చిన ఫిర్యాదులో టాస్క్‌‌ఫోర్స్‌‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌‌రావు, భుజంగరావు పేర్లను ప్రస్తావించినట్టు తెలిసింది.

బెదిరింపులతో అక్రమంగా వసూలు చేశారు‌‌‌‌: శ్రీధర్‌‌‌‌రావు 

సివిల్ వివాదాల్లో తనపై పదుల సంఖ్యలో కేసులు పెట్టించినట్టు శ్రీధర్‌‌‌‌రావు వివరించారు. రాధాకిషన్ రావుతో పాటు మరికొంత మంది తన ఇంటికి వచ్చి కోట్ల రూపాయలు ఎత్తుకెళ్లారని పేర్కొన్నారు. రెండు గంటల విచారణ అనంతరం శ్రీధర్‌‌‌‌రావు పీఎస్‌‌ నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఫోన్‌‌ట్యాపింగ్‌‌, తనపై బెదిరింపులకు సంబంధించిన సమాచారాన్ని స్పెషల్‌‌ టీమ్‌‌ అధికారులకు ఇచ్చేందుకు పీఎస్‌‌కు వచ్చానని తెలిపారు. ఫోన్‌‌ ట్యాపింగ్ ద్వారా భుజంగరావు కూడా తనను ఇబ్బందులకు గురి చేశాడని తెలిపారు. ఆఫీసుకు పిలిపించి మరీ బెదిరించాడని శ్రీధర్​రావు చెప్పారు. ఈ వివరాలన్నీ స్పెషల్‌‌టీమ్‌‌ అధికారులకు చెప్పానని, త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు.

సర్వర్ రూమ్‌‌లపై స్పెషల్‌‌ టీమ్‌‌ ఆరా

మరోవైపు భుజరంగరావు, తిరుపతన్న కస్టడీ కొనసాగుతున్నది. మూడోరోజు కస్టడీలో భాగంగా ఆదివారం కీలక వివరాలు సేకరించారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్‌‌కుమార్ ఆదివారం 8 గంటలకే బంజారాహిల్స్ పోలీస్‌‌స్టేషన్‌‌కు వచ్చారు. తిరుపతన్న, భుజంగరావును ప్రశ్నించారు. ఇందులో మరికొంతమంది అధికారుల పేర్లను భుజంగరావు వెల్లడించినట్టు తెలిసింది. ప్రధానంగా ఎస్‌‌ఐబీ లాగర్ రూమ్స్‌‌కు సంబంధించిన వివరాలనే సేకరించినట్టు సమాచారం. బేగంపేటలోని ఎస్‌‌ఐబీ ఆఫీస్‌‌తో పాటు సిటీ శివారు ప్రాంతాల్లోనూ సర్వర్లు, వార్‌‌‌‌ రూమ్స్‌‌ ఏర్పాటు చేసినట్టు భుజంగరావు, తిరుపతన్న వెల్లడించినట్టు తెలిసింది. ఆయా ప్రాంతాల్లో పనిచేసిన అధికారులు, సిబ్బంది వివరాలతో స్పెషల్‌‌టీమ్‌‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.