నెరవేరనున్న దశాబ్దాల కల

నెరవేరనున్న దశాబ్దాల కల
  •     సూర్యాపేట జిల్లాకు రైల్వే లైన్ రాక 
  •     డోర్నకల్ నుంచి గద్వాల్​వరకు రైల్వే లైన్ మంజూరు 
  •     రూ.5,330 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణం 

సూర్యాపేట, వెలుగు : రెండు తెలుగు రాష్ర్టాల మధ్య ఉన్న సూర్యాపేటకు రైల్వే లైన్ రాకతో దశాబ్దాల కల నెరవేరనుంది. హైదరాబాద్ –- విజయవాడ వరకు నాలుగు లైన్ల రోడ్ ఉన్నప్పటికీ నిత్యం ప్రమాదాల బారినపడి ఎంతో మంది మరణిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం డోర్నకల్ నుంచి పాలేరు, సూర్యాపేట మీదుగా 296 కిలో మీటర్లు రైల్వే లైన్ మంజూరు చేసింది.

దక్షిణ తెలంగాణను కలిపే ఈ లైన్ డోర్నకల్ నుంచి ఖమ్మం రూరల్, కూసుమంచి, పాలేరు, మోతే, సూర్యాపేట, నల్లగొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాల్​ వరకు నిర్మించనున్నారు. ఈ రైల్వే లైన్​నిర్మాణం కోసం కేంద్రం రూ.5,330 కోట్లు కేటాయించగా, సర్వే పనులు శరవేగంగా సాగుతున్నాయి. 

పూర్తయిన సర్వే పనులు.. 

రైల్వే మార్గాలను లింక్​ చేస్తూ కొత్త లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌- నుంచి విజయవాడ, హైదరాబాద్‌- నుంచి బెంగళూరు రైల్వే మార్గాలను కలుపుతూ కొత్త లైన్‌ నిర్మించేందుకు ఫైనల్‌ లొకేషన్‌ సర్వే నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి- విజయవాడ మార్గంలో ఉన్న డోర్నకల్‌ నుంచి హైదరాబాద్‌- టు బెంగళూరు మార్గంలోని గద్వాల్​వరకు ఈ కొత్త లైన్‌ కొనసాగనుంది.

దీనికి సంబంధించి గతేడాది ఫైనల్‌ లొకేషన్‌ సర్వేకు రైల్వే బోర్డు ఆమోదముద్ర వేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.ఏడున్నర కోట్లు మంజూరు చేసింది. సర్వే సంబంధించి మోతె మండలంలో మార్కింగ్‌ చేపట్టారు. డోర్నకల్‌ నుంచి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకనగూడెం మీదుగా మోతె మండలం కొత్తగూడెం ప్రాంతంలో రైల్వే మార్గం సర్వే పనులు జరిగాయి. కొత్తగూడెం, తుమ్మలపల్లి గ్రామాల వద్ద రహదారి పాసింగ్‌లను సైతం సర్వే బృందం గుర్తించింది.  

అనుసంధానం.. 

వరంగల్‌ మీదుగా సాగే హైదరాబాద్‌, -విజయవాడ లైన్‌ రైల్వేలో కీలక మార్గం. మహబూబ్‌నగర్‌ మీదుగా సాగే హైదరాబాద్‌, -బెంగళూరు మార్గం కూడా అలాంటిదే. కానీ, ఈ రెండింటిని అనుసంధానం చేసే మరో కీలక మార్గం అవసరమని రైల్వేశాఖ భావిస్తోంది. ఇందు కోసం డోర్నకల్‌ నుంచి గద్వాల్​వరకు రైల్వే లైన్‌ నిర్మించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. డోర్నకల్‌లో మొదలయ్యే రైల్వే లైన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, పాలేరు, ఉమ్మడి మోతె, సూర్యాపేట, భీమారం, నాంపల్లి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి, భూత్పూర్‌ మీదుగా గద్వాల్ వద్ద ముగుస్తుంది.

దీంతో ఆయా మార్గాల్లో నడిచే రైళ్లను అవసరానికి తగ్గట్టు దారి మళ్లించి కొత్త రైళ్లను నడపనున్నారు. ఇప్పటి వరకు రైల్వే లైన్‌ లేని ప్రాంతాలను అనుసంధానించడంతో పర్యాటకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో బొగ్గు, సిమెంట్, విద్యుత్​ఉత్పత్తి కేంద్రాలున్నందున వాటిని తరలింపు తేలికవుతుంది. వ్యవ సాయ ఉత్పత్తుల తరలింపు కూడా పెరుగుతుంది.