రాజ్యాంగంలోని 12వ భాగంలో ఆర్టికల్​ 280

రాజ్యాంగంలోని 12వ భాగంలో ఆర్టికల్​ 280

ఆర్థిక సంఘం, నిర్మాణం, అధికారాలు విధులుల గురించి పేర్కొంటుంది. ఇది ఒక అర్ధ న్యాయ సంస్థ. ఆర్థిక సంఘాన్ని ప్రతి ఐదు సంవత్సరాల కాలానికి నియమిస్తారు. అంటే ఇది శాశ్వత సంస్థ కాదు. ఈ సంస్థకు ఒక చైర్మన్​, నలుగురు సభ్యులు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తాడు. ఆర్థిక సంఘం సిఫారసులు, దానిపై ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి రాష్ట్రపతి పార్లమెంట్​కు వివరిస్తాడు.

ఆర్థిక సంఘం చైర్మన్​కు ప్రజా వ్యవహారాల్లో 10 ఏండ్ల అనుభవం ఉండాలి. ఒక సభ్యుడు హైకోర్టు న్యాయమూర్తి పదవికి ఎన్నికయ్యే అర్హతలు కలిగి ఉండాలి. రెండో సభ్యుడు ప్రభుత్వ విత్త పాలనలో 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. మూడో సభ్యుడు ఆర్థిక పరిస్థితులపై అవగాహన, ఆర్థిక మేనేజ్​మెంట్​లో 10 సంవత్సరాల అనుభవం ఉండాలి, నాలుగో సభ్యుడు ఆర్థిక శాఖ విభాగానికి చెందిన ప్రొఫెసర్ అయి ఉండాలి. 

ద్రవ్యలోటు: అంచనా వేసిన స్థూలదేశీయోత్పత్తి పెరుగుదల 7శాతం ఉంటుందని 15వ ఆర్థిక సంఘం అంచనావేసింది. ప్రస్తుత సూక్ష్మ ఆర్థిక అంచనా ప్రకారం జీడీపీలో ద్రవ్యలోటు 2021–22లో 6శాతం, 2022–23లో 5.5శాతం, 2023–24లో 5శాతం, 2024–25లో 4.5శాతం, 2025–26లో 4శాతం ఉండనుంది. ఒకవేళ అంచనావేసిన దానికంటే ఆర్థిక పునరుద్ధరణ నెమ్మదిగా జరిగితే ద్రవ్యలోటు 2021–22లో 6.5శాతం, 2022–23లో 6శాతం, 2023–24లో 5.5శాతం, 2024–25లో 5శాతం, 2025–26లో 4.5శాతం ఉంటుంది. ఒకవేళ అంచనా వేసిన దానికంటే దేశ ఆర్థిక పునరుద్ధరణ వేగంగా జరిగితే ద్రవ్యలోటు జీడీపీలో 2021–22లో 6శాతం, 2022–23లో 5.5శాతం, 2023–24లో 5శాతం, 2024–25లో 4శాతం, 2025–26లో 3.5శాతం ఉండనుంది.

కోశలోటు: సాధారణంగా ప్రభుత్వం మొత్తం రాబడి కంటే మొత్తం వ్యయం ఎక్కువగా ఉంటే దానిని బడ్జెట్​లోటుగా పేర్కొంటారు. ఈ బడ్జెట్​ లోటుకు ప్రభుత్వ రుణాలు, ఇతర అప్పులను కలిపితే కోశలోటు వస్తుంది. అయితే కోశలోటు నుంచి వడ్డీ చెల్లింపులను తీసివేస్తే ప్రాథమిక లోటు వస్తుంది. ప్రభుత్వ రెవెన్యూ వ్యయం ఎక్కువైతే దానిని రెవెన్యూ లోటుగా పేర్కొంటారు. 15వ ఆర్థిక సంఘం విశ్లేషణల ప్రకారం ఆయా లోట్లు కింది విధంగా ఉన్నాయి. 2011–12లో కోశలోటు జీడీపీలో 5.9శాతం ఉండగా 2018–19లో 3.4శాతం ఉంది. బడ్జెటరీ అంచనా ప్రకారం 20‌‌‌‌‌‌‌‌20–21లో 3.5శాతం ఉండగా, 2018–19లో 2.4శాతం, 2020–21లో 2.7శాతం ఉంది. అంటే రెవెన్యూ లోటు క్రమంగా తగ్గుతున్న విధానాన్ని చూడవచ్చు. అదేవిధంగా ప్రాథమికలోటు చూస్తే 2011–12లో 2.8శాతం, 2018–19లో 0.4శాతం, 2020–21లో పన్నుల ఆదాయాన్ని పరిశీలిస్తే 2011–12లో ప్రత్యక్ష పన్నుల వాటా జీడీపీలో 5.7శాతం కాగా 2018–19లో 6శాతం, 2020–21 బడ్జెటరీ అంచనా ప్రకారం 5.9శాతం ఉంటుంది. పరోక్ష పన్నుల వాటాను చూస్తే 2011–12లో 4.5శాతం, 2015–16లో 5.2శాతం, 2018–19లో 5శాతం, 2020–21లో 4.9శాతం వాటా కలిగి ఉన్నాయి. రాష్ట్రాలకు పన్నుల విభజన చూస్తే 2015–20 మధ్య 42శాతం ఉండగా, 2020–21 సంవత్సరానికి 41శాతానికి తగ్గించారు. 

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల భాగస్వామ్యం: 15వ ఆర్థిక సంఘం కేంద్ర పన్నులలో రాష్ట్రాల భాగస్వామ్యానికి సంబంధించి క్షితిజ సమాంతర పంపిణీకి కేటాయించిన ప్రమణాలు, భారాలు కింది విధంగా ఉన్నాయి. 

ఇన్​కమ్​ డిస్టెన్స్​: ఇందులో అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న రాష్ట్రాల ప్రాతిపదికన విభజించారు. ఇందులో భాగంగా 2015–16, 2016–17, 2017–18 మూడేండ్లు స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిని లెక్కించారు. 

డమోగ్రాఫిక్​ పర్ఫార్మెన్స్​: డమోగ్రాఫిక్​ పర్ఫార్మెన్స్​లో భాగంగా 2011 జనాభా ఆధారంగా కేటాయింపులు చేశారు. అంటే ప్రధానంగా జనాభా నియంత్రణకు పూనుకున్న రాష్ట్రాలకు కేటాయింపులు చేశారు. ఇందులో భాగంగా మొత్తం పునరుత్పత్తి నిష్పత్తిని 1971 జనాభా ఆధారంగా లెక్కించారు. తక్కువ టీఎఫ్​ఆర్​ ఉన్న రాష్ట్రాలకు అధిక కేటాయింపులు చేశారు. 

ఫారెస్ట్​, ఎకాలజీ డిస్టెన్స్​: ఫారెస్ట్​ అండ్​ ఎకాలజీలో భాగంగా అధికంగా అటవీ విస్తరణ గల రాష్ట్రాలను, సరాసరి అడవులు గల రాష్ట్రాల ఆధారంగా కేటాయింపులు చేశారు. టాక్స్​ ఎఫర్ట్​లో భాగంగా అధిక పన్నుల వసూలు ప్రదర్శన అధికంగా గల రాష్ట్రాలకు 15వ ఆర్థిక సంఘం ప్రోత్సాహకాలు కల్పించింది. ఇందులో భాగంగా 2014–15 నుంచి 2016–17 వరకు మూడేండ్ల సరాసరి తలసరి ఆదాయం, సరాసరి పన్నులు, రాబడులు, సరాసరి రాష్ట్ర దేశీయోత్పత్తిని లెక్కించారు. 

గ్రాంట్స్​ఇన్​ ఎయిడ్: 2020–21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాలకు కింద తెలిపిన గ్రాంట్స్​ ఇన్​ ఎయిడ్​ కల్పించారు. అవి 1. రెవెన్యూలోటు గ్రాంట్లు, 2. స్థానిక సంస్థల గ్రాంట్లు 3. విపత్తు నిర్వహణ గ్రాంట్లు. వీటితోపాటు ప్రత్యేక, పర్ఫార్మెన్స్​ గ్రాంట్లను సైతం 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు కల్పించింది. 

1. రెవెన్యూ లోటు: 2020–21 ఆర్థిక సంవత్సరానికి 14 రాష్ట్రాలకు రెవెన్యూలోటు గ్రాంట్ల కింద రూ.74340 కోట్లను కేటాయించారు. అత్యధికంగా కేరళ రాష్ట్రానికి రెవెన్యూ లోటు కింద రూ.15323 కోట్ల గ్రాంట్లు కేటాయించారు. 

2. స్థానిక సంస్థల గ్రాంట్లు: 2020–21 ఆర్థిక సంవత్సరానికి స్థానిక సంస్థల గ్రాంట్ల కింద మొత్తం రూ.90000 కోట్లను కేటాయించింది. ఇందులో రూ.60750 కోట్లు (67.5శాతం) గ్రామీణ స్థానిక సంస్థలకు కాగా, రూ.29250కోట్లు (32.5శాతం) పట్టణ స్థానిక సంస్థలకు కేటాయించారు. ఈ గ్రాంట్లను రాష్ట్రాల జనాభా విస్తీర్ణం ఆధారంగా 90:10 నిష్పత్తిలో కేటాయించారు.   గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల కింద ఆంధ్రప్రదేశ్​కు రూ.2625కోట్లు, తెలంగాణకు 1847 కోట్లు కేటాయించారు. పట్టణ స్థానిక సంస్థల విషయంలో ఆంధ్రప్రదేశ్​కు రూ.1264కోట్లు, తెలంగాణకు 889కోట్లు కల్పించారు. 

3. విపత్తు నిర్వహణ గ్రాంట్లు: 15వ ఆర్థిక సంఘం స్థానిక స్థాయిలో విపత్తు తీవ్రత తగ్గింపుకోసం జాతీయ, రాష్ట్రాల్లో విపత్తు నిర్వహణ నిధులను ఏర్పాటు చేయాలని సూచించింది. వీటికిగాను అయ్యే నిధులను కేంద్ర, రాష్ట్రాల మధ్య 75:25 నిష్పత్తిలో భరించాలని, ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాల్లో అయితే ఈ నిష్పత్తి 90:10గా ఉండాలని సూచించింది. 2020–21 సంవత్సరానికి స్టేట్​ డిజాస్టర్​ రిస్క్​ మేనేజ్​మెంట్​కు రూ.28983 కోట్లను కేటాయించింది. 

15వ ఆర్థిక సంఘం 

2021-26 మధ్య ఐదేళ్ల కాలానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన పన్నుల వాటా, గ్రాంట్లను నిర్దేశిస్తూ 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసు నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ 2021–22, ఫిబ్రవరి 1న బడ్జెట్​ ప్రసంగం అనంతరం పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు. కోవిడ్​ కాలంలోని ఫైనాన్స్​ కమిషన్​ అన్న ప్రధాన శీర్షికతో రూపొందించిన 15వ ఆర్థిక సంఘం నివేదిక 2021, ఏప్రిల్​ 1 నుంచి అమలు కానుంది. 15వ ఆర్థిక సంఘం 2020–21 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర నివేదిస్తూ 41శాతం వాటాను సిఫారసు చేసింది. రానున్న ఐదేళ్లకు 41శాతం సిఫారసు చేసింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం రూ.42.2 లక్షల కోట్లను రాష్ట్రాలకు పంచనుంది. ఇక మొత్తం 17 రాష్ట్రాలకు రూ.2,94,514 కోట్లను రెవెన్యూ లోటు గ్రాంటుగా సిఫారసు చేసింది. 

నిర్మాణం: అధ్యక్షుడు ఎన్​.కె.సింగ్​, సభ్యులు అజయ్​ నారాయణ్​ ఝా, ప్రొఫెసర్​ అనూప్​సింగ్, అశోక్​ లాహిరి, రమేశ్​చంద్​.