ఏందీ ఆర్టికల్​ 370?

ఏందీ ఆర్టికల్​ 370?
  •     ప్రత్యేక రాజ్యాంగం, సిటిజన్​షిప్
  •     ఇతర ప్రాంతాల వాళ్లు  ఆస్తులు కొనడంపైనా నిషేధం
  •     ఇదే తరహాలో మరిన్ని అధికారాలు ఇచ్చిన ఆర్టికల్​ 35(ఏ)
  •      తాజాగా రెండు ఆర్టికల్స్​ రద్దు

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ కు దాదాపు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తూ రాజ్యాంగంలో చేర్చినదే ఆర్టికల్ 370. ఎన్డీయే సర్కారు దీన్ని రద్దు చేయడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుండగా.. కొన్ని  పార్టీలు, కొన్ని వర్గాలు తప్పుపడుతున్నాయి. మొత్తంగా అంతటా జమ్మూకాశ్మీర్ స్పెషల్ స్టేటస్, ఆర్టికల్​ 370పైనే చర్చలు నడుస్తున్నాయి. మరి ఈ ఆర్టికల్ 370, ఆర్టికల్ 35(ఏ)లు ఏమిటనేది పరిశీలిస్తే..

స్వాతంత్ర్య సమయంలో..

రాజ్యాంగంలోని ఆర్టికల్​ 370 జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి స్పెషల్ హోదా కల్పిస్తోంది. రాజ్యాంగంలోని 21వ పార్ట్ లో దీన్ని పొందుపరిచారు. దీనికి కొన్ని కారణాలున్నాయి. స్వాతంత్ర్యం తర్వాత దేశంలోని చాలా సంస్థానాలు ఇండియన్​ యూనియన్​లో చేరాయి. జమ్మూకాశ్మీర్ సంస్థానం పాకిస్థాన్ లో కలవాలా, ఇండియన్ యూనియన్ లో విలీనమవ్వాలా? లేక స్వతంత్ర రాజ్యంగా కొనసాగాలా అన్న దానిపై  చర్చ జరిగింది. కాశ్మీర్ రాజు హరిసింగ్ తొలుత స్వతంత్ర రాజ్యంగా కొనసాగించాలనుకున్నారు.  కాశ్మీర్ ప్రత్యేకతను నిలబెట్టేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని జవహర్ లాల్ నెహ్రూ ఇచ్చిన హామీ మేరకు ఇండియాలో విలీనానికి రాజా హరిసింగ్ అంగీకరించాడు. ఆ క్రమంలోనే ఆర్టికల్ 370 తెర మీదకొచ్చింది. రాజా హరిసింగ్, ఆయన దివాన్ గోపాలస్వామి ఈ ఆర్టికల్ ముసాయిదాను రూపొందించారు. అందులోని అంశాలివీ..

  •  డిఫెన్స్, ఫారిన్ ఎఫైర్స్, ఫైనాన్స్, కమ్యూనికేషన్ అంశాలు మాత్రమే కేంద్రం పరిధిలో ఉంటాయి. మిగతా అంశాల్లో చట్టాలు చేసే అధికారం జమ్మూకాశ్మీర్​ అసెంబ్లీదే. కేంద్రం ఏదైనా చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి.
  •  సహజంగా పార్లమెంట్​ ఏ చట్టం చేసినా అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. జమ్మూ కాశ్మీర్ కు మాత్రం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తేనే వర్తిస్తుంది.
  •  కాశ్మీర్ లో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించే అధికారం కేంద్రానికి ఉండదు. యుద్ధం వంటి ప్రత్యేక పరిస్థితుల్లోనే ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశాలుంటాయి.
  • ఇతర రాష్ట్రాల ప్రజలు జమ్మూకాశ్మీర్ లో స్థిరాస్తులు కొనడానికి అవకాశం ఉండదు.
  • ఇక్కడి ప్రజలకు రెండు సిటిజన్ షిప్ లు (రాష్ట్ర పౌరసత్వం, దేశ పౌరసత్వం) ఉంటాయి.
  •  కాశ్మీరీ అమ్మాయి దేశంలోని వేరే రాష్ట్ర అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అప్పటివరకు ఆమెకు ఉన్న కాశ్మీరీ పౌరసత్వం రద్దవుతుంది.
  • జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం, జెండా, పీనల్ కోడ్ ఉన్నాయి.

డీ లిమిటేషన్ అంశం

జమ్మూకాశ్మీర్​లో నియోజకవర్గాల పునర్విభజన అంశమూ ఆర్టికల్ 370తో ముడిపడి ఉంది. ఆ రాష్ట్రంలోని కాశ్మీర్ లోయ, జమ్మూ, లడఖ్ లలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. జమ్మూ లో హిందువులు, కాశ్మీర్ లోయలో ముస్లింలు, లడఖ్‌లో బౌద్ధులు ఎక్కువ. దేశవ్యాప్తంగా పదేళ్లకోసారి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. కానీ జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. దేశంలోని అన్ని అసెంబ్లీల కాల పరిమితి ఐదేళ్లుకాగా.. జమ్మూకాశ్మీర్ లో ఆరేళ్లు. కాశ్మీర్ లోయలో 46 సీట్లు, జమ్మూ ప్రాంతంలో 37 సీట్లు,
లడఖ్ ప్రాంతంలో 4 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక ముందు ఇవన్నీ మారనున్నాయి.

ఆర్టికల్ 35-ఎ తో హక్కులన్నీ వాళ్లకే

జమ్మూకాశ్మీర్ ప్రజలకు రాష్ట్రం శాశ్వత పౌరసత్వం (పర్మనెంట్​ రెసిడెంట్స్) కల్పిస్తూ.. రాష్ట్రంలో ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు, ఆస్తులపై హక్కులన్నీ అక్కడి వారికే వర్తించేలా తెచ్చిన నిబంధనలే ఆర్టికల్ 35(ఎ). 1954 రాజ్యంగ సవరణలో ఈ ఆర్టికల్​ను పొందుపర్చారు. జమ్మూకాశ్మీర్ లో ఉద్యోగ నియామకాలు, ఆస్తుల కొనుగోళ్లు ఈ ఆర్టికల్ ప్రకారమే జరుగుతాయి. అసెంబ్లీ తీసుకునే నిర్ణయాన్ని సవాల్ చేసే అధికారం ఎవరికీ ఉండదు. అయితే ఆర్టికల్ 35 (ఎ)ను అక్రమ మార్గంలో రాజ్యాంగంలో పొందుపరిచారని చాలాకాలంగా విమర్శలున్నాయి. ఇతర రాష్ట్రాల ప్రజలకు కాశ్మీర్ లో ఉద్యోగాలు ఇవ్వకపోవడం, ఆస్తులు కొనుగోలు చేయకుండా అడ్డుకోవడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని.. ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించే 14,19,21 ఆర్టికల్స్ ను దెబ్బతీసినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.