యాదాద్రి జిల్లాలో జాడలేని వాన .. పత్తి సాగుపై పెను ప్రభావం

యాదాద్రి జిల్లాలో జాడలేని వాన .. పత్తి సాగుపై పెను ప్రభావం
  • సాగుపై పెను ప్రభావం..  జిల్లాలో 32 శాతమే సాగు
  • వాడిపోతున్న పత్తి..  దిక్కుతోచని స్థితిలో  రైతు

యాదాద్రి, వెలుగు:  వానాకాలం వచ్చి దాదాపు 45 రోజులు కావొస్తుంది.  అయినా ఇప్పటి వరకు ఒక్క భారీ వర్షం కూడా పడలేదు. వానదేవుడు ముఖం చాటేశాడు. వానలు కురవక పత్తి, కంది మొక్కలు వాడిపోతున్నాయి. ముందస్తుగా మే నెలలో కురిసిన వానలు రైతుల్లోనూ ఆశలు రేపాయి.  దుక్కులు దున్ని పత్తి విత్తేశారు. తీరా చూస్తే వానలు పడడం లేదు. ఎండలు మండిపోతున్నాయి. కొందరు రైతులు ఇప్పటికే  రెండుమార్లు విత్తిన సందర్భాలున్నాయి.  మధ్యలో పడిన చిన్నపాటి వానలకు మొలకెత్తిన పత్తి మొక్కలు ఇప్పుడు వాడిపోతున్నాయి.  ఈ పరిణామంతో పత్తి సాగు చేద్దామని భావించిన రైతులు వెనక్కి తగ్గడం వల్ల ఈ సీజన్​లో గణనీయంగా పంట విస్తీర్ణం 
తగ్గిపోయింది. 

వానే పడ్తలే.. 36 శాతం లోటు

మేలో కురిసిన వానలు తప్ప.. ఆ స్థాయిలో మళ్లీ వానలు పడలేదు. అప్పుడప్పుడు అక్కడక్కడ జల్లు కురుస్తోంది తప్పా భారీ వర్షాలు పడటం లేదు. దీంతో జిల్లాలోని ప్రతి మండలంలోనూ లోటు వర్షపాతం నమోదైంది.  జిల్లాలో ఈ సీజన్​లో 167.7 మిల్లీ మీటర్ల వాన కురియాల్సి ఉండగా 106.2 మిల్లీ మీటర్లు కురిసింది.  దీంతో జిల్లాలో 36 శాతం తక్కువగా నమోదైంది. 

32 శాతమే సాగు

యాదాద్రి జిల్లాలో అన్ని పంటలు కలిసి 4.40 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అగ్రికల్చర్​ ఆఫీసర్లు  అంచనా వేశారు.  దీంతో సాగుపై తీవ్ర ప్రభావం పడింది.  అంచనాలో ఇప్పటివరకూ కేవలం 1.40 లక్షల ఎకరాలు (32 శాతం) మాత్రమే పంటలను సాగు చేశారు. పత్తి 80,362 ఎకరాల్లో సాగు చేశారు. గతేడాది ఇదే సీజన్​లో 1.05 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. పత్తి విత్తే గడువు ముగిసిపోవడంతో ఇంకా పంట విస్తీర్ణం పెరిగే అవకాశం లేదు. వరిని ఇప్పటివరకూ 50 వేల ఎకరాల్లో సాగు చేశారు. మరో 35 వేల ఎకరాల్లో వరి నారు సిద్ధంగా ఉంది. కొంచెం ఆలస్యమైనా వరి నాట్లు వేయడానికి ఆగస్టు వరకూ గడువున్నందున సాగు పెరిగే అవకాశం ఉంది.

జిల్లాలో గతేడాది సాగు, ఈ సీజన్​ సాగు అంచనా, చేసిన సాగు ఎకరాల్లో 

పంట     గతేడాది సాగు    సాగు అంచనా    సాగు చేసింది
వరి    2,87,98    2.95 లక్షల ఎకరాలు    50 వేల ఎకరాల్లో
పత్తి    1,08,856    1.15    80 వేల ఎకరాల్లో 
కంది    4286    6000    3700