హార్ట్స్టెంట్లు.. ప్రైవేట్‌‌‌‌లోనే ఎక్కువ!..లక్షల్లో వసూలు

హార్ట్స్టెంట్లు.. ప్రైవేట్‌‌‌‌లోనే ఎక్కువ!..లక్షల్లో వసూలు
  • రాష్ట్రంలో ఏటా 51 వేల ఆపరేషన్లు 
  • అందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగినవి ఐదారు వేలలోపే 
  • కోట్లు ఖర్చు పెట్టి ఏడు సర్కార్ దవాఖాన్లలో క్యాథ్ ల్యాబ్‌‌‌‌ల ఏర్పాటు 
  • అయినా పేదలకు అందని ట్రీట్‌‌‌‌మెంట్
  • రోజుల తరబడి వెయిటింగ్, స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నా పట్టించుకోకపోవడమే కారణం 
  • తప్పని పరిస్థితుల్లో లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్‌‌‌‌ హాస్పిటళ్లకే వెళ్తున్న బాధితులు

హైదరాబాద్, వెలుగు:గుండె జబ్బులకు ట్రీట్‌‌‌‌మెంట్ అందించడంలో ప్రభుత్వ ఆస్పత్రులు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. హార్ట్ స్టెంట్ ఆపరేషన్లకు సంబంధించిన సౌలతులున్నా, ఆ ట్రీట్‌‌‌‌మెంట్ అందించేందుకు స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నా పేదలకు మాత్రం వైద్యం అందడం లేదు. రాష్ట్రంలో ఏటా 51 వేల హార్ట్ ​స్టెంట్ ఆపరేషన్లు జరుగుతుండగా, అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం ఐదారు వేల లోపే జరగుతున్నాయి. 

మిగతా ఆపరేషన్లన్నీ ప్రైవేట్‌‌‌‌ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద గత మూడేండ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కలిపి దాదాపు 30 వేల గుండె స్టెంట్లు వేశారు. అంటే ఏటా సగటున 9,500 స్టెంట్లు కేవలం ఆరోగ్య శ్రీ కిందనే వేస్తున్నారు.  ఇక ఆరోగ్యశ్రీ పరిధిలో కాకుండా ప్రైవేట్ ఆస్పత్రుల్లో క్యాష్ ట్రీట్మెంట్​కింద స్టెంట్లు వేయించుకుంటున్న వారి సంఖ్య దీనికి నాలుగైదు రెట్లు ఉంటున్నది. 

రాష్ట్రంలో ఏటా సుమారు 51 వేల గుండె స్టెంట్లు వేస్తున్నట్లు లెక్కలను బట్టి తెలుస్తున్నది. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సగటున కేవలం ఐదారు వేల స్టెంట్లు మాత్రమే వేస్తున్నట్టు తెలిసింది. దీంతో ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు పెట్టి, ఏడు సర్కార్ ఆసుపత్రుల్లో క్యాథ్‌‌ ల్యాబ్‌‌లు ఏర్పాటు చేసినా అవి పూర్తిస్థాయిలో పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 

నిజామాబాద్ ల్యాబ్ నిరుపయోగం.. 

ప్రభుత్వం గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రుల్లో క్యాథ్ ల్యాబ్‌‌లు ఏర్పాటు చేసింది. ఒక్కో క్యాథ్ ల్యాబ్ కోసం దాదాపు రూ.8 కోట్లు ఖర్చు చేశారు. గుండె రక్తనాళాల్లోని సమస్యలను గుర్తించడానికి, స్టెంట్లను అమర్చడానికి క్యాథ్ ల్యాబ్‌‌లు అత్యవసరం. అయితే ఈ ల్యాబ్‌‌లు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 

కొన్ని ల్యాబ్‌‌లు కేవలం నామమాత్రంగానే ఉన్నాయని, మరికొన్నింటిలో సిబ్బంది కొరత, పరికరాల నిర్వహణ లోపాలతో పూర్తిస్థాయి సేవలు అందించలేకపోతున్నాయని తెలుస్తున్నది. దీంతో పేదల కోసం క్యాథ్ ల్యాబ్‌‌లు ఏర్పాటు చేసినప్పటికీ.. వాళ్లకు సేవలు అందడం లేదు. నిజామాబాద్‌‌లోని క్యాథ్ ల్యాబ్ అసలు పని చేయడం లేదు. గాంధీ ఆసుపత్రిలో 24 మంది కార్డియాలజీ నిపుణులు, రోజుకు 15 స్టెంట్‌‌లు వేసే సామర్థ్యం ఉన్నా.. కేవలం 2 నుంచి 3 స్టెంట్‌‌లు మాత్రమే వేస్తున్నారు. 

ఉస్మానియా ఆసుపత్రిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ రోగులు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తున్నది. నిమ్స్‌‌లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ.. ఖమ్మం, ఎంజీఎం, ఆదిలాబాద్‌‌ రిమ్స్‌‌లో రోగులను హైదరాబాద్‌‌కు లేదా ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. 

ఎమర్జెన్సీ అయినా వారం ఆగాల్సిందే.. 

పేదలు గుండె జబ్బులతో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే.. రోజుల తరబడి వెయిట్ చేయిస్తున్నారు. ఎమర్జెన్సీ కేసుల్లో కూడా వారం, పది రోజుల వరకు స్టెంట్​కోసం ఆగాల్సిన పరిస్థితి ఉంటున్నది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్డియాలజీ విభాగంలో అర్హత కలిగిన సిటీ సర్జన్లు, కార్డియాలజీ స్పెషలిస్టులు ఉన్నప్పటికీ..  వాళ్లు పూర్తి స్థాయిలో సేవలు అందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొందరు డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీస్‌‌పైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 

దీని వల్ల రోగులు సరైన సమయంలో చికిత్స పొందలేకపోతున్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అత్యాధునిక సౌకర్యాలు కల్పించినా, వ్యవస్థీకృత లోపాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర గుండె చికిత్సలకు ఒక ప్రొటోకాల్‌‌ను రూపొందించి, దాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. డాక్టర్ల జవాబుదారీతనాన్ని పెంచడం, పూర్తి సమయం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం ద్వారా ఈ పరిస్థితిని మెరుగుపరచవచ్చని సూచిస్తున్నారు.

ప్రైవేట్‌‌లో వెంటనే ట్రీట్మెంట్.. లక్షల్లో వసూలు 

ప్రైవేటు ఆసుపత్రుల్లో హార్ట్​ఎటాక్, ఇతర అత్యవసర కేసులకు గంటల్లోనే చికిత్స అందిస్తున్నారు. రోగి వెళ్లిన వెంటనే యాంజియోగ్రామ్, ఆ తర్వాత స్టెంట్ అమర్చడం వంటి ప్రక్రియలు పూర్తవుతున్నాయి. గుండె సంబంధిత ఎమర్జెన్సీల్లో జాప్యం ప్రమాదకరం కావడంతో రోగులు తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఇటీవల కాలంలో గుండెపోట్లు పెరగడంతో ప్రభుత్వ హాస్పిటళ్లకు వెళితే ఎప్పుడు అడ్మిట్​ చేసుకుంటారో? ఎప్పుడు ట్రీట్మెంట్​చేస్తారో ఏమో అన్న ఆందోళనతో బాధితులు నేరుగా ప్రైవేట్​ హాస్పిటల్స్‌‌కు వెళ్తున్నారు. 

పేషెంట్​ అక్కడికి వెళ్లగానే 2డీ ఎకో, ఈసీజీ తీసుకోవడం, నిర్ణీత టైం దాటిన తరువాత కూడా అవసరం లేకపోయినా ‘లైఫ్ సేవింగ్’ పేరుతో రూ.55,000 విలువైన ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఆ తరువాత యాంజియోగ్రామ్ చేసి గంటల్లోపే స్టెంట్ వేస్తున్నారు. హైదరాబాద్‌‌లోని ఒక ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్‌‌లో ఒక్క రోజులో ఒక్క డాక్టర్​గరిష్టంగా 30 స్టెంట్లు వేసిన సందర్భాలు ఉన్నాయి.

 అయితే హాస్పిటల్​స్థాయిని బట్టి  ఒక్క స్టెంట్‌‌కు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు, కొన్ని సందర్భాల్లో నాణ్యమైన స్టెంట్స్​అంటూ రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఈ ఖర్చులు పేద, మధ్యతరగతి రోగులకు భారమవుతున్నాయి. అటు ప్రభుత్వ హాస్పిటల్​కు వెళ్లలేని పరిస్థితుల్లో ఇటు ప్రైవేటులో ట్రీట్‌‌మెంట్‌‌ కోసం అప్పులు చేసి లక్షలు చెల్లిస్తున్నారు.