ఆర్టిస్టుకి బౌండరీస్ ఉండకూడదు : వరుణ్ తేజ్

ఆర్టిస్టుకి బౌండరీస్ ఉండకూడదు : వరుణ్ తేజ్

‘నా నుంచి సినిమా వస్తోందంటే అందులో నా పాత్ర ఎలాంటిదైనా ప్రేక్షకులు రిసీవ్ చేసుకునేలా ఉండాలి. అందుకే వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్నాను’ అంటున్నాడు వరుణ్ తేజ్. ఆయన హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్మీకి’ ఈనెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరుణ్ చెప్పిన విశేషాలు.

ఫిదా, తొలిప్రేమ లాంటి ప్రేమకథల తర్వాత ఏదైనా డిఫరెంట్ మూవీ చేయాలనుకున్నాను. కానీ హరీష్ గారితో సహా చాలామంది లవ్ స్టోరీసే చెప్పారు. నిజానికి ఆయన చెప్పిన ‘దాగుడు మూతలు’ కథ చాలా బాగుంది. కానీ తన స్టైల్ ఆఫ్ ఎంటర్‌‌‌‌టైనర్ కావాలని నేనే అడిగాను. అప్పుడు ‘జిగర్తాండ’ రీమేక్ చర్చకొచ్చింది.

గణేష్ అనే పాత్రని ఇంకా బాగా చూపించడానికి ప్రయత్నించాం. మిగతా పాత్రల్లో మార్పులు తక్కువే. కథలోని ఆత్మ చెడకుండా అతను ఎందుకంత క్రూరంగా మారాడనేది చూపించాం. ఇరవై నిముషాల  ప్లాష్ బ్యాక్ సీన్స్‌‌లోనే పూజాహెగ్డే కనిపిస్తుంది. తమిళంలో ఈ సీన్స్ లేవుగా అని అడిగాను. హీరోగా తొమ్మిది చిత్రాల తర్వాత ఇంత క్రూరమైన పాత్ర చేస్తున్నప్పుడు.. ప్రేక్షకులు సమాధానపరిచేలా ఆ సీన్స్ ఉండాలన్నారు హరీష్.

చాలామంది ఈ రోల్ నీకు కరెక్ట్ కాదేమో అన్నారు. నాకెంత నచ్చినా మరీ మూర్ఖంగా వెళ్లకూడదని చిరంజీవి గారిని సంప్రదించాను. మా కుటుంబంలో ఈ స్క్రిప్ట్ మొదట విన్నది ఆయనే. హీరోనా, విలనా లాంటివి పట్టించుకోకుండా కథ చాలా బాగుందని హరీష్‌‌కి చిన్న చిన్న సూచనలు చెప్పారు. ‘పునాదిరాళ్లు’ సినిమాలోని చిరంజీవి గారి హెయిర్ స్టైల్‌‌నే ఈ సినిమాకి రిఫరెన్స్‌‌గా తీసుకున్నాం.

క్యారెక్టరైజేషన్‌‌కి రీజనింగ్ సరిగ్గా ఉండాలి. గద్దలకొండ గణేష్ పదిమందిని కొట్టాడంటే నమ్మాలనిపించాలి. ఈ సినిమాలో నా పాత్ర చిత్రణ అంత బలంగా ఉంది.  పరిధులు లేని పాత్ర. నేను ఎంతలా నటిస్తే అంతలా అన్నట్టుంటుంది. ‘ఎఫ్ 2’ కోసం తెలంగాణ యాస ప్రాక్టీస్ చేయడం పనికొచ్చింది. కానీ ఇది పూర్తిస్థాయి రూరల్ తెలంగాణ యాస. కొంత మొరటుగా ఉంటుంది. హరీష్ కరీంనగర్ యాసలో డైలాగ్స్ రాశారు. ఇరవై నిముషాల ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఓ రోజంతా డబ్బింగ్ చెప్పాను. మంచి ట్విస్ట్​తో పాటు నా పాత్రకి చాలా రకాల వేరియేషన్స్ ఉండే సీన్ అది.

తక్కువ సమయంలోనే వైవిధ్యభరిత చిత్రాలు చేసే అవకాశం దక్కింది. హీరో ప్రతిసారీ మంచోడే ఎందుకు అయ్యుండాలి, చెడ్డవాడు అయితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్న సమయంలో ఈ సినిమా నన్ను వరించింది.  తమిళంలో బాబీసింహా అద్బుతంగా చేశాడు.. జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఆ స్థాయిలో ఉన్న నటనని అనుకరించకుండా ఏదైనా కొత్తగా చేద్దామనుకున్నాం. డిఫరెంట్‌‌గా చూపిద్దామనే ఉద్దేశంతోనే ఇమిటేట్ చేయలేదు తప్ప నేనేదో చేయగలుగుతానని కాదు.

ఒక మంచి సినిమా ఎక్కువమందికి రీచ్ అవలేదు, మనం చూపిద్దామనే రీమేక్ చేశాం.   ప్రభావం పడుతుందని ఎక్కువసార్లు మాతృకని చూడలేదు. అది చూసిన వారికి ఇది నచ్చుతుందో లేదో తెలీదు. కానీ ఈ పాత్రలో నన్ను చూస్తే మాత్రం భయమేస్తుంది. హరీష్‌‌ లాంటి స్పీడున్న దర్శకులతో పనిచేస్తే మనమూ అంతే వేగంతో వెళ్తాం. నిజానికి నేనూ ఫాస్టే.

నాలుగేళ్ల తర్వాత పూజాహెగ్డేతో  నటించాను. తన పాత్రకి నూరు శాతం న్యాయం చేసింది. సినిమాలో కొద్దిసేపే ఉన్నా ప్లెజెంట్ ఫీల్ తీసు కొస్తుంది. అధర్వ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఎంతో శ్రద్ధగా ఒక్కో డైలాగ్ నేర్చుకుని చాలా కష్టపడ్డాడు. నటీనటులంతా ఆయా పాత్రలను వాళ్లు తప్ప మరొకరు చేయలేరన్నట్టు మెప్పించారు.

ఆర్టిస్టుకి బౌండరీస్ ఉండకూడదని నమ్ము తాను. భవిష్యత్తులో ప్రేక్షకులు వరుణ్ సినిమా వస్తోందంటే అతను ఏ పాత్రయినా చేస్తాడని చూడాలి తప్ప స్క్రీన్​పై చూసి షాక్ అవకూడదు. ఇప్పుడు కూడా నేను రౌడీగా చేశానని ప్రేక్షకులు ఫీలవడం లేదు. ఆల్రెడీ నేను డిఫరెంట్ రోల్స్ చేయడమే అందుకు కారణం.

‘అంతరిక్షం’ బిగ్ అటెంప్ట్​. షూటింగ్ సమయంలోనే మేమనుకున్న స్కేల్‌‌లో చేయలేకపోయాం. విడుదల సమయానికి చేయి దాటి పోయింది. పరిమిత బడ్జెట్‌‌లో చేసే సినిమా కాదు.  చేయగలమనుకున్నాం కానీ కుదర లేదు. దాంతో సీజీ లాంటి అంశాల్లో కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. ఎలాగైనా అడుతుందనే  పాజిటివ్ థింకింగ్‌‌తో ముందుకెళ్లాం. ఆ ఫలితం చాలా నేర్పింది. కొన్ని మిస్టేక్స్  ఎప్పుడూ గుర్తుండాలని ఆ స్పేస్ సూట్​ని ఆఫీస్​ ఎంట్రన్స్‌‌లో పెట్టుకున్నాను. కొత్త కథలు వినేటప్పుడు దాన్నొకసారి చూసుకుంటాను.

సాగర్ చంద్ర సినిమాకి స్క్రిప్ట్ సెట్ అవలేదు. అందుకే హోల్డ్‌‌లో పెట్టాల్సి వచ్చింది. ఉంటుందా ఉండదా అని చెప్పలేను. నిజానికి ఈ సినిమా ఉంటుందని కూడా అనుకోలేదు. కానీ వచ్చింది. మరో నాలుగు స్క్రిప్ట్ వర్క్‌‌లు జరుగుతున్నాయి. ఏదో ఒకటి స్టార్టవుతుంది.  నెక్స్ట్ సినిమా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో ఉంటుంది.

చిరంజీవి గారి బయోపిక్ తీస్తే నేనే తీస్తాను అన్నారు హరీష్. కానీ నాతో తీస్తానని మాత్రం అనలేదు. అయినా అది చరణన్న చేస్తేనే బాగుంటుంది. తను చేయకపోతే మాత్రం నెక్స్ట్ నేనే ఆ వరుసలో ఉంటాను. సీజీలో హైట్ కూడా తగ్గించుకుంటాను (నవ్వుతూ). అలాగే వెంకటేష్ గారు, నేను రెగ్యులర్‌‌గా కలుస్తుంటాం. తప్పకుండా మా కాంబినేషన్‌లో మరో సినిమా ఉంటుంది. ఇక ‘సైరా’ లాంటి హిస్టారికల్ సబ్జెక్ట్ వస్తే కాదనకుండా చేస్తాను. ఈ ఇంటర్వ్యూ చూసి ఎవరైనా అలాంటి కథలతో వస్తారేమోచూడాలి.