తీహార్ జైలులో అర్ధరాత్రి కేజ్రీవాల్ వాకింగ్

తీహార్ జైలులో అర్ధరాత్రి కేజ్రీవాల్ వాకింగ్

న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ మొదటి రోజు సరిగా నిద్రపోలేదని జైలు వర్గాలు వెల్లడించాయి. ఆయన తన సెల్ లోని సిమెంట్ దిమ్మెపై కొద్దిసేపు నిద్రపోయారని, అర్ధరాత్రి అటుఇటు తిరుగుతూ వాకింగ్ చేశారని తెలిపాయి. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ కు ఈ నెల 15 వరకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ‘‘సోమవారం సాయంత్రం 4 గంటలకు కేజ్రీవాల్ ను జైలుకు తీసుకొచ్చారు. ఆయనను సెల్ లోకి పంపించే ముందు వైద్య పరీక్షలు నిర్వహించాం. షుగర్ లెవల్స్ 50 కంటే తక్కువగా ఉండడంతో మెడిసిన్స్ ఇచ్చాం” అని తీహార్ జైలు అధికారులు మంగళవారం తెలిపారు.

కేజ్రీవాల్ ను జైలు నంబర్ 2లో ఉంచామని, 14/8 ఫీట్ ఉన్న స్పెషల్ సెల్ కేటాయించామని.. పరుపు, బ్లాంకెట్స్, రెండు మెత్తలు అందజేశామని చెప్పారు. ‘‘మంగళవారం ఉదయం లేచిన తర్వాత కేజ్రీవాల్ మెడిటేషన్ చేశారు. ఆ తర్వాత ఆయనకు చాయ్, రెండు బిస్కెట్లు ఇచ్చాం. ఉదయం చెకప్ చేసినప్పుడు కూడా కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నాయి. ఆయనకు లంచ్, డిన్నర్ కు ఇంటి భోజనం అనుమతిస్తున్నాం. షుగర్ లెవల్స్ నార్మల్ అయ్యే వరకు ఇది కొనసాగిస్తాం” అని వెల్లడించారు. కేజ్రీవాల్ సెల్ బయట జైల్ వార్డర్, ఇద్దరు సిబ్బందిని ఉంచామని.. అత్యవసర సిబ్బందిని కూడా సెల్ కు దగ్గర్లో సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. కేజ్రీవాల్ అడిగిన రామాయణం, మహాభారతం, ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’  బుక్స్ ను అందజేశామన్నారు.   

కరడుగట్టిన నేరగాళ్లున్న జైలులో కేజ్రీవాల్..  

కేజ్రీవాల్ ను ఉంచిన జైలు నంబర్ 2లో కరడుగట్టిన నేరస్తులు, టెర్రరిస్టులు ఉన్నారు. ఈ జైలులో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్, గ్యాంగ్ స్టర్ నీరజ్ బవానా, టెర్రరిస్టు జియావుర్ రెహ్మన్ ఉన్నారు. 

ఇప్పటి వరకు అరెస్టయినోళ్లు వీళ్లే..  

లిక్కర్ స్కామ్​లో ఆప్ నేతలు, వ్యాపారవేత్తలను ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఆప్ మాజీ కమ్యూనికేషన్ ఇన్ చార్జ్ విజయ్ నాయర్, వ్యాపార వేత్తలు సమీర్ మహేంద్రు, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్ర పిళ్లై, అమన్ దీప్ సింగ్ ధాల్, దినేశ్ అరోరా, రాజేశ్ జోషి, గౌతమ్ మల్హోత్రా, అమిత్ అరోరా, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుతో పాటు మాగుంట రాఘవ, గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేసింది.