ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ అరెస్ట్ పై కేజ్రీవాల్ ఆగ్రహం 

ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ అరెస్ట్ పై కేజ్రీవాల్ ఆగ్రహం 

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. గుజరాత్ లో ఆప్ కు ఆదరణ పెరగడంతో  కమలనాధులు చాలా బాధపడుతున్నట్లు కనిపిస్తోందని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి విమర్శలు చేశారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డు రిక్రూట్ మెంట్ లో అవకతవకలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు, అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు  చేసి ఆప్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. మొదట సత్యేంద్ర జైన్ ను అరెస్ట్ చేశారు. కానీ కోర్టుకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేకపోయారు. అనంతరం  మనీష్ సిసోడియా ఇంటిపై దాడులు నిర్వహించినా ఏమీ దొరకలేదు. ఇప్పుడు అమానతుల్లాను అరెస్ట్ చేశారు.రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ను అరెస్ట్ చేసి పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని కేజ్రీవాల్ మండిపడ్డారు. అమానతుల్లాఖాన్ సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి హమీద్ అలీని ఆయుధాల చట్టం కింద  ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నివాసం నుంచి తుపాకీ, కొన్ని బుల్లెట్లు, రూ. 12 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.