ఈడీ ఆఫీసర్లపైనే కేజ్రీవాల్​ నిఘా!

ఈడీ ఆఫీసర్లపైనే కేజ్రీవాల్​ నిఘా!

న్యూఢిల్లీ:  లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పై గూఢచర్యం కేసు కూడా నమోదయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కేజ్రీవాల్ ఏకంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు చెందిన ఒక స్పెషల్ డైరెక్టర్, ఒక జాయింట్ డైరెక్టర్ పైనే ఇంటెలిజెన్స్ అధికారులతో నిఘా పెట్టించారని తెలుస్తోంది. గురువారం కేజ్రీవాల్ ఇంట్లో సోదాల సందర్భంగా ఈడీ అధికారులు 150 పేజీలతో కూడిన డాక్యుమెంట్ ను స్వాధీనం చేసుకున్నారని, అందులో సోదాల్లో పాల్గొన్న ఓ ఆఫీసర్ పేరు కూడా ఉండటం చూసి షాక్ అయ్యారని సమాచారం. ఆ ఇద్దరు ఆఫీసర్లకు సంబంధించిన అత్యంత సీక్రెట్ విషయాలు సైతం డాక్యుమెంట్లో బయటపడటం చూసి ఈడీ టీం నోరెళ్లబెట్టినట్టు తెలుస్తోంది. 

భద్రతా కారణాల రీత్యా వారి పేర్లను గోప్యంగా ఉంచి.. వెంటనే ఆ డాక్యుమెంట్ ను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. వెంటనే ఆ ఇద్దరు అధికారులకు సెక్యూరిటీని పెంచడంతోపాటు దీనిపై తదుపరి విచారణ, చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినట్టు చెప్తున్నారు. ఆ డాక్యుమెంట్ లో కచ్చితంగా ఏముందన్నది వెల్లడి కాకపోయినా.. ఈడీలో సెక్యూరిటీ ప్రొటోకాల్స్, సమగ్రతపైనే సందేహాలు వస్తున్నాయని అంటున్నారు. దీంతో తమపైనే నిఘా పెట్టిన కేజ్రీవాల్ పై సపరేట్ గా గూఢచర్యం ఆరోపణలతో కేసు పెట్టేందుకు కూడా ఈడీ సిద్ధమవుతోందని ఢిల్లీలోని అధికారిక వర్గాలు చెప్తున్నాయి.