పంజాబ్ సీఎస్, ఐఏఎస్​లతో  ఢిల్లీ సీఎం మీటింగా!

పంజాబ్ సీఎస్, ఐఏఎస్​లతో  ఢిల్లీ సీఎం మీటింగా!

న్యూఢిల్లీ:  పంజాబ్ చీఫ్​సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమావేశం నిర్వహించడం రాజకీయ దుమారం రేపింది. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ గానీ, మంత్రులు గానీ లేకుండా ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతో కేజ్రీవాల్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. దీంతో సీఎం మాన్ ఒక ‘రబ్బర్ స్టాంప్’ అని, పంజాబ్ సర్కారు ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ తో నడుస్తోందంటూ పంజాబ్ ప్రతిపక్ష పార్టీల నేతలు మంగళవారం తీవ్రంగా మండిపడ్డారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) హామీ ఇచ్చింది. ఈ హామీని అమలు చేసే విషయంపైనే పంజాబ్ సీఎస్, స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ చీఫ్, రాష్ట్ర విద్యుత్ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులతో కేజ్రీవాల్ చర్చించినట్లు తెలిసింది. ఈ మీటింగ్ మరునాడు మంగళవారం సీఎం మాన్ కూడా ఢిల్లీలో కేజ్రీవాల్​ను కలిశారు. మీటింగ్ బాగా జరిగిందని, త్వరలోనే పంజాబ్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్తామని ట్వీట్ చేశారు. మాన్ ట్వీట్ కు కేజ్రీవాల్ రిప్లై ఇస్తూ.. ‘‘కలిసికట్టుగా ఉంటే ఢిల్లీ, పంజాబ్​ను మాత్రమే కాదు మొత్తం దేశాన్నే మార్చేయగలం” అని ట్వీట్ చేశారు. పార్టీలు, లీడర్ల చెడ్డ, అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయారని, ప్రజల కోసం తాము రేయింబవళ్లు పనిచేయాల్సి ఉందని చెప్పారు. అయితే, సీఎం మాన్ గానీ, మంత్రులుగానీ లేకుండా పంజాబ్ ఆఫీసర్లతో ఢిల్లీ సీఎం మీటింగ్ పెట్టడం ఏంటంటూ పంజాబ్ ప్రతిపక్ష నేతలు విరుచుకుపడ్డారు.  

ఇదేమంత పెద్ద విషయం కాదు: ఆప్ 

పంజాబ్ ఆఫీసర్లతో కేజ్రీవాల్ మీటింగ్ వివాదంపై ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే, కేజ్రీవాల్ తమ పార్టీకి నేషనల్ కన్వీనర్ అని, ఆయన అలాంటి మీటింగ్ ఏదైనా నిర్వహించినా అదేమంత పెద్ద విషయం కాదని పంజాబ్ రవాణా మంత్రి లాల్ జిత్ సింగ్ భుల్లార్ చెప్పారు. పంజాబ్ ఆప్ అధికార ప్రతినిధి మల్వీందర్ కాంగ్ మాట్లాడుతూ.. ‘‘కేజ్రీవాల్ మోడల్ పాలనను చూసేందుకు చాలామంది వెళ్తుంటారు. ఒకవేళ ఆయన పంజాబ్ ప్రజలకు మేలు చేసేందుకు అనధికారికంగా మీటింగ్ నిర్వహించినా అది స్వాగతించదగ్గ విషయమే” అని అన్నారు. 

పంజాబ్ అసలు సీఎం ఎవరో తేలింది..  

‘‘పంజాబ్ ఐఏఎస్ ఆఫీసర్లతో కేజ్రీవాల్ మీటింగ్ తో.. పంజాబ్ అసలు సీఎం ఎవరో తేలిపోయింది. పంజాబ్ సర్కారును ఢిల్లీ రిమోట్ కంట్రోల్ నడిపిస్తోందని వెల్లడైంది. ఇది రాష్ట్ర ప్రజలకు అవమానం. సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడవటమే. దీనిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలి” అని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ట్వీట్ చేశారు. ‘‘గతంలో ఢిల్లీ ప్రభుత్వ వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం జోక్యం చేసుకుంటున్నారని మీరు ప్రశ్నించారు. ఇప్పుడు రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం మీరు పంజాబ్ సీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లకు ఢిల్లీలో మీటింగ్ పెట్టి, అధ్యక్షత వహిస్తారు? ఇది మీ రెండు నాల్కల ధోరణి కాదా?” అని పేర్కొన్నారు. పంజాబ్ ఆఫీసర్లతో కేజ్రీవాల్ మీటింగ్ రాజ్యాంగ విరుద్ధమని, ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని అకాలీదళ్ చీఫ్​సుఖ్ బీర్ సింగ్ బాదల్ అన్నారు.

పంజాబ్​ హక్కులను ఉల్లంఘించడమే..

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఒక ‘రబ్బర్ స్టాంప్’ అని ఆ రాష్ట్ర మాజీ సీఎం అమరీందర్ సింగ్ విమర్శించారు. ‘‘ఇలాంటి ఘోరం జరుగుతుందని భయపడ్డాం. జరిగిపోయింది. ఊహించినదాని కంటే ముందే పంజాబ్​ను కేజ్రీవాల్ స్వాధీనం చేసుకున్నారు. భగవంత్ మాన్ రబ్బర్ స్టాంప్ సీఎంలా ఉంటారని ముందే తెలుసు. కానీ పంజాబ్ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి ఆ విషయాన్ని కేజ్రీవాల్ ఇప్పుడే నిరూపించారు” అని ఆయన ట్వీట్ చేశారు. ‘‘భగవంత్ మాన్ జీ.. సీఎం, మంత్రులు లేకుండా మన ఆఫీసర్లతో ఇలా మీటింగ్ నిర్వహించడం ఒక రాష్ట్రంగా మన హక్కులను ఉల్లంఘించడమే. ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా నడిచే ఇలాంటి ప్రభుత్వం కోసం పంజాబ్ ప్రజలు ఓట్లేయలేదు” అని పంజాబ్ సీఎల్పీ నేత ప్రతాప్ సింగ్ బజ్వా పేర్కొన్నారు. ‘‘కేజ్రీవాల్ దర్బార్ కు రాష్ట్ర సీనియర్ ఆఫీసర్లు హాజరయ్యారా? లేదా? భగవంత్ మాన్ పేరుకు మాత్రమే పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారా?” అని పంజాబ్ పీసీసీ చీఫ్​ 
అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ప్రశ్నించారు.