ఢిల్లీ బడ్జెట్ ప్రవేశపెట్టేదెవరంటే..?

ఢిల్లీ బడ్జెట్ ప్రవేశపెట్టేదెవరంటే..?

ఢిల్లీ కేబినేట్ లో కీలక శాఖలకు మంత్రులుగా ఉన్న సత్యేందర్ జైన్, మనీశ్ సిసోడియాలు అరెస్టు కావడంతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. గతేడాది జూన్‌లో అప్పటి ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ అరెస్టు తర్వాత తాజాగా సిసోడియా అరెస్ట్ కావడంతో ఢిల్లీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. వీరిలో సిసోడియా ఆరోగ్యం, విద్య, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ), సర్వీసెస్, ఫైనాన్స్, పవర్, హోమ్  అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌తో సహా 18 శాఖలను చూస్తున్నారు. ప్రత్యేకంగా ఏ మంత్రికి కేటాయించని శాఖలన్నింటిని కూడా ఆయనే నిర్వహిస్తున్నారు. విద్య , ఆరోగ్య శాఖలను విజయవంతంగా ముందుకు నడిపించి.. పార్టీ ప్రజాదరణ, ఎన్నికల విజయానికి దోహదపడిన వీరిద్దరూ అరెస్టు కావడం పార్టీలో సంచలనంగా మారింది. కేబినేట్ లో వీరి గైర్హాజరు అరవింద్ కేజ్రీవాల్‌కు తీరని లోటుగా మారింది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం సిసోడియాను భర్తీ చేసి ఢిల్లీలో బడ్జెట్‌ను సమర్పించడం, కేజ్రీవాల్‌కు తక్షణ సవాలుగా గోచరిస్తోంది. దీంతో బడ్జెట్ ను ఎవరు ప్రవేశపెడతారనే విషయం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఢిల్లీ ప్రభుత్వ బడ్జెట్‌ను రెవెన్యూ మంత్రి కైలాష్ గహ్లోట్ సమర్పించే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. గహ్లోట్ గత కొన్ని రోజులుగా బడ్జెట్ సంబంధిత సమావేశాలకు హాజరవుతుండడంతో ఇదే ఖరారవనున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ ప్రభుత్వ వెబ్‌సైట్ల ప్రకారం మొత్తం 33 శాఖలున్నాయి. ఢిల్లీ ప్రభుత్వంలో కేజ్రీవాల్ తో పాటు ఆరుగురు కేబినేట్ మంత్రులుండగా.. గతేడాది మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. దీంతో సిసోడియాకు 18శాఖలు కేటాయించగా.. పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్‌కు మూడు శాఖలు ఇచ్చారు. ఇమ్రాన్ హుస్సేన్  ఆహారం అండ్ పౌర సరఫరాలు, ఎన్నికలకు మాత్రమే ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. కైలాష్ గహ్లోట్ రెవెన్యూ, రవాణా సహా ఆరు శాఖలకు ఇన్‌ఛార్జ్‌గా ఉండగా, రాజ్ కుమార్ ఆనంద్‌కు నాలుగు పోర్ట్‌ఫోలియోలు ఉన్నాయి.