రూ.2 వేల నోట్లకు..చిల్లర కావాలె

రూ.2 వేల నోట్లకు..చిల్లర కావాలె

ఎన్నికల టైమ్ కావడంతో పెద్ద నోట్లు బయటకు తీస్తున్న బడా నేతలు
ఎలక్షన్లలో ఖర్చు పెట్టేందుకు చిల్లర కోసం గ్యాంగులకు పని అప్పగింత
ఖమ్మం, వరంగల్ లో తిరుగుతున్న గ్యాంగులు  
బ్యాంకర్లు, రియల్టర్లు, చిట్ ఫండ్ కంపెనీల నుంచి సేకరణ 
కోటికి రూ.లక్ష చొప్పున కమీషన్  
ఇప్పటికే రూ.వందల కోట్లలో నోట్ల మార్పిడి

ఖమ్మం, వెలుగు : అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు దగ్గర పడడంతో బడా నేతలు డబ్బులు బయటకు తీస్తున్నారు. గతంలోనే పెద్ద నోట్లు దాచిపెట్టుకున్న లీడర్లు.. ఇప్పుడు వాటిని చిల్లరగా మార్చే పనిలో పడ్డారు. ఎన్నికల్లో పంచేందుకు వీలుగా రూ.2 వేల నోట్లకు చిల్లరగా రూ.500 నోట్లు కావాలని అడుగుతున్నారు. తాము దాచుకున్న రూ.2 వేల నోట్లను చిల్లరగా మార్చే పనిని కొన్ని గ్యాంగులకు అప్పగించారు. ఈ గ్యాంగులు కొద్ది రోజులుగా ఖమ్మం, వరంగల్ నగరాల్లో తిరుగుతున్నాయి. ‘‘మేం రూ.2 వేల నోట్ల కట్టలు ఇస్తం. వాటికి సరిపడా రూ.500 నోట్ల కట్టలు మాకు ఇవ్వండి. ఇందుకు కోటికి రూ.లక్ష కమీషన్​ ఇస్తం’’ అని ఆఫర్ ఇస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగులు, చిట్​ఫండ్​ కంపెనీల ఓనర్లు, రియల్టర్లను కలుస్తున్నాయి. వాళ్ల దగ్గర అయితే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉంటాయని వాళ్లను సంప్రదిస్తున్నాయి. ప్రధానంగా విజయవాడ నుంచి వస్తున్న ఈ గ్యాంగులు మొదట ఖమ్మం, తర్వాత వరంగల్​కు రాగా.. ఇప్పుడు ఇతర జిల్లాల్లోనూ తిరుగుతున్నాయి. 

డౌట్ అక్కర్లే.. నిజమైన నోట్లే 

వచ్చే ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు రూ.500 నోట్లు అవసరమని, అందుకే రూ.2 వేల నోట్లు చిల్లరగా మారుస్తున్నామని ఈ గ్యాంగులు అంటున్నాయి. ‘‘మేం మారుస్తున్న నోట్లన్నీ రాజకీయ నాయకులు దాచిపెట్టిన మనీ. ఇవి ఫేక్​  నోట్లు అనే అనుమానం అక్కర్లేదు. డౌట్ ఉంటే మీ దగ్గర ఉన్న కౌంటింగ్​ మెషిన్లు తెచ్చి చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాతే రూ.500 నోట్లు ఇవ్వండి. కోటికి లక్ష కట్ చేసుకొని రూ.99 లక్షలు ఇస్తే సరిపోతుంది” అని చెప్తున్నాయి. భారీ మొత్తంలో మార్చేందుకు ముందుకొస్తున్న వారిని సంబంధిత రాజకీయ నాయకులతోనూ మాట్లాడిస్తున్నట్లు సమాచారం. గ్యాంగులపై నమ్మకం కుదరడంతో చాలామంది బ్యాంకర్లు, చిట్​ఫండ్ కంపెనీల నిర్వాహకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్లకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగులు ఇప్పటికే ఖమ్మం, వరంగల్ సిటీల్లోని పలు చిట్ ఫండ్ కంపెనీల ద్వారా వందల కోట్లు మార్పిడి చేసినట్లు తెలిసింది.

నిన్న మొన్నటి వరకు క్యాష్ ఎక్కడుంటే అక్కడకు తామే వస్తామంటూ ఆఫర్​ ఇచ్చిన వాళ్లు కాస్తా.. రూటు మార్చారు. రీసెంట్​గా వరంగల్ కేంద్రంగా నడుస్తున్న ఓ చిట్ ఫండ్ కంపెనీ నిర్వాహకులు రూ.3 కోట్లు మార్చారు. అప్పుడు ముందుగా రూ.2 వేల నోట్లు ఇచ్చి, వాళ్లు చెప్పిన అడ్రస్​లో రూ.500 నోట్లు మార్చుకున్న వాళ్లు కాస్తా.. ఇప్పుడు విజయవాడ రావాలని చెప్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఖమ్మం, వరంగల్ నగరాల్లో బ్యాంకర్లు, చిట్​ఫండ్ ​కంపెనీల ఉద్యోగులతో పాటు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఈ నోట్ల మార్పిడిపై చర్చ జరుగుతోంది. 

పెద్దల చేతుల్లోకి పెద్ద నోట్లు..

2016 నవంబర్​లో కేంద్రం పాత నోట్ల రద్దు చేసిన తర్వాత ఆర్బీఐ కొత్తగా రూ.2 వేల నోట్లను తెచ్చింది. దాదాపు ఏడాది పాటు అందరి దగ్గర కనిపించిన రూ.2 వేల నోట్లు.. తర్వాత మార్కెట్ నుంచి మాయమయ్యాయి. కొత్తలో రూ.2 వేల నోట్లు పట్టుకొని జనం చిల్లర కోసం తిరిగిన రోజులు పోయాయి. ప్రస్తుతం బ్యాంకుల్లో, ఏటీఎం సెంటర్లలో కూడా రూ.2 వేల నోట్లు పెద్దగా కనిపించడం లేదు. ఆర్బీఐ కూడా రూ.2 వేల నోట్ల ప్రింటింగ్ ఆపేసింది. కానీ అప్పటికే చెలామణిలో ఉన్న నోట్లన్నీ ఎక్కడికి పోయాయనే చర్చ మొదలైంది. 2017 నుంచే ఈ నోట్లన్నీ కొందరు వ్యాపారవేత్తలు, బడా రాజకీయ నాయకుల చేతుల్లోకి పోయాయనే అనుమానాలున్నాయి. దీంతో ఎన్నికల టైమ్ కావడంతో రూ.2 వేల నోట్లు మళ్లీ బయటకు వస్తున్నాయని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణల్లో ఎన్నికలు దగ్గర పడడంతో, వాటిలో ఖర్చు పెట్టేందుకు ఆ డబ్బును బయటకు తీస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రూ.2 వేల నోట్లు రద్దు చేస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, అదంతా అబద్ధమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

పెరిగిన డిమాండ్.. 

రెండు, మూడు నెలలుగా రాష్ట్రంలో రూ.2  వేల నోట్లు మార్చే గ్యాంగులు యాక్టివ్​అయ్యాయి. మొదట్లో తమ దగ్గరున్న రూ.2 వేల నోట్లు ఫేక్​కాదని నమ్మించేందుకు పడరాని పాట్లు పడ్డ గ్యాంగులు.. ఇప్పుడు ఈజీగా నోట్ల మార్పిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. కోటికి రూ.లక్ష కమీషన్ ఇస్తుండడం, మెషిన్లతో చెక్​చేసుకొని నోట్లు తీసుకెళ్లాకే చిల్లర తీసుకొచ్చి ఇవ్వండని చెబుతుండడం, నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడిస్తుండడంతో క్రమంగా చాలామంది నోట్ల మార్పిడికి ముందుకొస్తున్నారు. దీంతో ఆ గ్యాంగులకు ఎక్కడ లేని డిమాండ్ ​ఏర్పడింది.