బ్లాక్ ఫంగస్‌‌పై కేంద్రం అలర్ట్

బ్లాక్ ఫంగస్‌‌పై కేంద్రం అలర్ట్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో అల్లాడుతున్న టైమ్‌‌లో బ్లాక్ ఫంగస్  విజృంభిస్తూ ప్రాణాలను బలి తీసుకుంటుండడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. చాలా రేర్‌‌‌‌గా వచ్చే ఈ ఫంగల్ ఇన్‌‌ఫెక్షన్‌‌ను ముందుగానే గుర్తించి ట్రీట్‌‌మెంట్ తీసుకుంటే, దాని నుంచి సులభంగా బయటపడొచ్చని, ఇందుకోసం ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలు, అది ఈజీగా ఎవరిపై అటాక్ చేస్తుంది, దీనిని ఎదుర్కొని బయటపడేందుకు చేయాల్సిన పనులేంటి, ఏ పనులు చేయకూడదన్న విషయాలను తెలియజేస్తూ ఆయన శుక్రవారం కొన్ని సూచనలు చేశారు. కరోనా పేషెంట్లతో పాటు, డయాబెటిస్ కంట్రోల్‌‌లో లేని వారికి, స్టెరాయిడ్స్ వాడుతున్న వారికి, చాలా కాలం నుంచి ఐసీయూ ట్రీట్‌‌మెంట్ పొందుతున్నవారికి, ఫంగల్ ఇన్‌‌ఫెక్షన్‌‌ చికిత్సలు తీసుకుంటున్నవారికి, ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉన్నవారికి బ్లాక్ ఫంగస్ వచ్చే ముప్పు ఎక్కువని, ఇమ్యూనిటీ మంచిగా ఉంటే ఏ సమస్య ఉండదని ఆయన తెలిపారు. కండ్లు నొప్పి, ఎర్రబడడం, దగ్గు, జ్వరం, తీవ్రమైన తలనొప్పి, దగ్గు, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో సమస్య, రక్తం కక్కుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్‌‌‌‌ను కలవాలని సూచించారు. ముఖ్యంగా కరోనా పేషెంట్లు, ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్లు ముక్కు పట్టేసినట్టుగా ఉంటే సైనస్ వల్ల అని లైట్ తీసుకోవద్దని చెప్పారు.

సూచనలు..

  •     షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవాలి.
  •     కరోనా పేషెంట్లు రికవరీ అయ్యాక తప్పనిసరిగా షుగర్ చెక్ చేసుకుంటూ ఉండాలి.
  •     డాక్టర్ల సలహాతోనే స్టెరాయిడ్స్ వాడాలి.
  •     ఆక్సిజన్ కాన్సెంట్రేటర్‌‌‌‌లో క్లీన్ వాటర్‌‌‌‌నే ఫిల్ చేయాలి.
  •     డాక్టర్ల సలహాతోనే యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్ మందులు వాడాలి.
  •     ఏ మాత్రం సింప్టమ్స్ ఉన్నాయనిపించినా నిర్లక్ష్యం తగదు. వెంటనే బ్లాక్ ఫంగస్ గుర్తించే టెస్టులు చేయించుకోవాలి.
  •     సీరియస్ అయ్యే వరకూ లేట్ చేయకుండా ఎర్లీ స్టేజ్‌‌లోనే డాక్టర్‌‌‌‌ను కలవాలి. ఆలస్యమైతే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇన్‌‌ఫెక్షన్ బ్రెయిన్‌‌లోకి చేరితే   ప్రాణాలే పోవచ్చు.

మహారాష్ట్రలో 52 మంది మృతి

ముంబై: మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ కారణంగా ఇప్పటి వరకు 52 మంది మరణించినట్లు శుక్రవారం ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. గత ఏడాది కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు నమోదైన మొత్తం ఫంగస్ డెత్స్ అని చెప్పారు. వాళ్లంతా కూడా కరోనా నుంచి కోలుకున్నవారేనన్నారు. బ్లాక్ ఫంగస్‌‌ను ఇప్పటి వరకు ఒక జబ్బుగానే గుర్తించకపోవడం వల్ల దీనికి సంబంధించిన డేటా బేస్ లేదని, తొలిసారి మహారాష్ట్ర సర్కారు ప్రిలిమినరీ డేటా సిద్ధం చేసిందని తెలిపారు. సెకండ్ వేవ్ మొదలయ్యాక మహారాష్ట్రలో 1500 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్టు చెప్పారు.