కరోనా వైరస్: గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన WHO

కరోనా వైరస్: గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన WHO

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టి.. ప్రపంచ దేశాలకు వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ వల్ల చనిపోతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గత డిసెంబరు చివరిలో పుట్టిన ఈ కొత్త వైరస్ వల్ల శుక్రవారం నాటికి 213 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనా నుంచి భారత్, అమెరికా సహా 18 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా 9.692 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ పరిస్థితిపై నిన్న అత్యవసరంగా సమావేశమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లోని ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్ కమిటీ.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలని నిర్ణయించింది. అలాగే ఈ కొత్త వైరస్ ద్వారా వ్యాపిస్తున్న వ్యాధికి ‘2019 నావెల్ కరోనా వైరస్ అక్యూట్ రెస్పిరేటరీ డిసీజ్’ అని తాత్కాలికంగా పేరు పెట్టారు. ప్రపంచ దేశాలతో మరోసారి మాట్లాడి తుది పేరును ఖరారు చేస్తామని తెలిపింది.

చైనాను శంకించడం లేదు

కేవలం చైనాలో ఉన్న పరిస్థితినే కాక, ప్రపంచ వ్యాప్తంగా 18 దేశాల్లో కరోనా వ్యాపిస్తున్న తీరును ఆధారంగా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన నిర్ణయం తీసుకున్నట్లు WHO స్పష్టం చేసింది. చైనా ఆవల 18 దేశాల్లో 98 కరోనా కేసులు నమోదైనట్లు తెలిపింది. కరోనాను నివారించడంలో, ప్రపంచ దేశాల ఆరోగ్యం విషయంలో చైనా నిబద్ధతను తాము శంకించడం లేదని కమిటీ సభ్యులు అన్నారు. ఆ దేశం పూర్తి స్థాయిలో కరోనా కట్టడికి ప్రయత్నాలు చేస్తోందని నమ్ముతున్నామని, అయితే చైనాకు అంతర్జాతీయంగా మరింత మద్దతును అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ కొత్త వైరస్‌ను చైనా వేగంగా గుర్తించి, ప్రపంచాన్ని అప్రమత్తం చేసిందన్నారు. అయితే ఇతర దేశాల్లోనూ ఈ వైరస్‌ను వ్యాప్తి చెందకుండా సమర్థమైన  చర్యలు తీసుకునేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా ప్రయాణాలను, వాణిజ్యాన్ని కట్టడి చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.

వ్యాక్సిన్ లేదు

జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, ఊపిరి తీసుకోలేకపోవడం, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కరోనా వైరస్ సోకినవారిలో కనిపిస్తాయి. ఈ వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఒకరి నుంచి మరోకరికి వ్యాపిస్తున్న ఈ వైరస్‌కు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. దీని బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు వైద్యులు. తరచూ చేతులు కడుక్కోవాలని, జలుబు, దగ్గు, జ్వరం ఉన్నా మామూలేనని తేలిగ్గా తీసుకోవద్దని సూచిస్తున్నారు. కరోెనా వ్యాపించిన దేశాలకు వెళ్లి వచ్చినవారు వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని చెబుతున్నారు.