భారీ దోపిడీకి తెరతీసిన మిల్లర్లు.. వరి కోతలు జోరందుకోగానే రేట్లు దించేశారు

భారీ దోపిడీకి తెరతీసిన మిల్లర్లు.. వరి కోతలు జోరందుకోగానే రేట్లు దించేశారు
  • వారం కింద క్వింటాల్ వడ్లు రూ.2,700
  • ఇప్పుడు రూ.2,150కు తగ్గించారు  
  • నల్గొండ జిల్లాలో సిండికేట్​గా మారి దోపిడీ
  • ఇదేమని అడిగిన రైతులకు బెదిరింపులు

నల్గొండ​/మిర్యాలగూడ, వెలుగు :  వరి కోతలు జోరందుకోగానే మిల్లర్లు దోపిడీకి తెరతీశారు. ఈసారి వడ్ల కొరత తీవ్రంగా ఉన్నందున మొదట్లో క్వింటాల్​ ధాన్యానికి రూ. 3 వేల దాకా ధర పెట్టిన మిల్లర్లు ఇప్పుడు భారీగా కోతలు పెడ్తున్నారు. నల్గొండ లాంటి జిల్లాల్లో సిండికేట్​గా మారి హెచ్ఎంటీ లాంటి సన్నరకాలను క్వింటాల్​కు  రూ. 2150 కే కొంటున్నారు. 

ఇదేమిటని నిలదీస్తే  ఇష్టముంటే అమ్మండి.. లేదంటే వెళ్లిపోండి అంటూ రైతులను బెదిరిస్తున్నారు. దీంతో గత్యంతరం లేక మిల్లర్లు చెప్పిన రేటుకే వడ్లు అమ్ముకునేందుకు రైతులు మిల్లుల వద్ద రేయింబవళ్లు పడిగాపులు పడుతున్నారు. యాసంగి సీజన్​కు సంబంధించి సర్కారు ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. సెంటర్లు ప్రారంభించే వరకు ఆగుదామనుకున్నా అక్కడ దొడ్డు వెరైటీలే కొంటారు. దీంతో  రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో సన్నవడ్లను రైస్​ మిల్లులకు తీసుకెళ్తున్నారు. 

ఇదే అదనుగా మిల్లర్లు రైతులను నిండా ముంచుతున్నారు. ప్రస్తుతం మార్కెట్​లో సన్నబియ్యం రేట్లు రూ.6 వేల నుంచి రూ.7 వేలకు పైగా పలుకుతున్నాయి. ఈ లెక్కన వడ్లకు రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు రేటు పెట్టినా మిల్లర్లకు లాభాలే వస్తాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచకపోవడం మిల్లర్లు, వ్యాపారులకు వరంలా మారింది. ఎంఎస్​పీ రూ.2203 మాత్రమే ఉండడంతో దీనిని సాకుగా చూపి, వడ్ల రేట్లు తగ్గిస్తున్న మిల్లర్లు.. బియ్యాన్ని మాత్రం అధిక రేట్లకు అమ్ముకుంటూ అడ్డగోలుగా ఆర్జిస్తున్నారు. 

డిమాండ్​ పెరిగినా రేటు  అంతే

రాష్ట్రంలో ఈసారి 50 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దీంట్లో 40 శాతం సన్నవడ్లు సాగైనట్లు అంచనా. సాగునీరు అందకపోవడం, భూగర్భ జలాలు అడుగండడంతో దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశముంది. దీంతో ఈసారి సన్నవడ్లకు విపరీతమైన డిమాండ్​ ఉండనుంది. కానీ, ఈ విషయాన్ని కప్పిపుచ్చి  రైతులను ముంచేందుకు వ్యాపారులు రెడీ అయ్యారు. 

నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్, ఏఎమ్మార్పీ కింద యాసంగిలో 4.20 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా, దీంట్లో 2 లక్షల ఎకరాల్లో  సన్న వడ్లు పండించారు. మిర్యాలగూడ, నాగార్జునసాగర్, నల్గొండలో  చింట్లు, హెచ్ఎంటీ రకాలు సాగు చేశారు. బోర్లు, బావుల కింద వరికోతలు మొదలై ఫిబ్రవరి నెలాఖరు నుంచే మార్కెట్ లోకి సన్నాలు రావడం మొదలైంది. 

మొదట్లో క్వింటాలు వడ్లు రూ.3 వేలకు కొన్నారు. వారం రోజుల తర్వాత  రూ.2,700 కు తగ్గించారు.  కోతలు పూర్తి స్థాయిలో మొదలుపెట్టగానే మిల్లర్లు కొర్రీలు పెట్టడం షురూ చేశారు. తాలు, తేమ పేరుతో క్వింటాలు వడ్లు  రూ.2150, 2200‌‌లకు మాత్రమే కొంటామని పేచీ పెడుతున్నారు. దాదాపు  వందకు పైగా మిల్లులు మిర్యాలగూడ, సాగర్​ ప్రాంతంలోనే ఉండడంతో  మిల్లర్లంతా సిండికేట్​ అయ్యారు. తాము చెప్పిన రేటుకు వడ్లు అమ్మకపోతే మిల్లుల్లో నిల్వ చేసేందుకు జాగ లేదంటూ కొర్రీలు పెడుతున్నారు. 

మంత్రి  కోమటిరెడ్డి ఆదేశాలు భేఖాతరు

ఇటీవల ఇక్కడకొచ్చిన  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  రైతులతో మాట్లాడారు. మిల్లర్లు పెడ్తున్న ఇబ్బందులను మంత్రికి రైతులు వివరించారు. స్పందించిన మంత్రి..  డీఎస్ఓ వెంకటేశ్వర్లుతో ఫోన్​లో మాట్లాడారు. రైతులను ఇబ్బందిపెడుతున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులను మోసం చేసేవారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. కానీ, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. అగ్రికల్చర్, మార్కెటింగ్, సివిల్ ​ సప్లై శాఖలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పొరుగు రాష్ట్రాల నుంచి వడ్లు రాకుండా అడ్డుకుంటామని చెప్పారని, రేటు విషయంలో మాత్రం తమ సమస్య అట్లాగే ఉందని రైతులు వాపోతున్నారు.

వడ్లు  దించుకుంటలేరు

మాది వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెం. మేమంతా  సన్నవడ్లు సాగుచేశాం. బోర్ల కిందనే కష్టాలు పడి వరి పండించినం. మిల్లులకు  వడ్లు తెస్తే నాణ్యత లేదని మిల్లర్లు దించుకుంటలేరు. వారం కింద క్వింటాల్​కు రూ.2700 రేటు ఉంటే ఇప్పుడు రూ.  2200 కూడా ఇస్తలేరు.  ప్రభుత్వం మాకు న్యాయం చేయాలే.
‑ చల్లా  ఆంజనేయులు, అన్నపురెడ్డి గూడెం