అప్పు తీరగానే ఇల్లు కాలబెట్టిండు..అప్పు ఇచ్చిన వారిపై వ్యక్తి దాష్టీకం ..నిజామాబాద్ జిల్లాలో ఘటన

అప్పు తీరగానే ఇల్లు కాలబెట్టిండు..అప్పు ఇచ్చిన వారిపై వ్యక్తి దాష్టీకం ..నిజామాబాద్ జిల్లాలో ఘటన
  •  ఆర్మూర్ మండలం  పిప్రి గ్రామంలో ఇంటికి నిప్పు

ఆర్మూర్, వెలుగు: కుటుంబ అవసరాల కోసం ఓ వ్యక్తి మరొకరి వద్ద అప్పు చేశాడు. ఆ అప్పు కట్టకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారు పలుమార్లు నిలదీశారు. దీంతో కొన్ని రోజులకు వడ్డీతో సహా అప్పు తీర్చిన ఆ వ్యక్తి.. అప్పు ఇచ్చిన వారి ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో జరిగింది. 

పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అబ్దుల్ భారీ 2019లో అదే గ్రామానికి చెందిన రాజమల్లు వద్ద రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తీర్చకపోవడంతో రాజమల్లు పలుమార్లు డబ్బులు చెల్లించాలని నిలదీశాడు. దీంతో సుమారు ఆరు నెలల క్రితం అబ్దుల్ భారీ తీసుకున్న అసలు రూ.5 లక్షలు చెల్లించాడు. అయితే వడ్డీకి సంబంధించిన రూ.2 లక్షల కోసం చెక్కు ఇచ్చి, ఎనిమిది నెలల తర్వాత డ్రా చేసుకోవాలని సూచించాడు. శుక్రవారం రాజమల్లు ఆ చెక్కుతో బ్యాంకుకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకున్నాడు. 

అప్పు, వడ్డీ.. రెండూ తీరడంతో అబ్దుల్ భారీ 35 లీటర్ల పెట్రోల్ క్యాన్‌‌‌‌తో రాజమల్లు ఇంటికి వెళ్లాడు. ఒక్కసారిగా వారి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. ప్రమాదాన్ని గమనించిన రాజమల్లు కుటుంబ సభ్యులు బయటకు పరుగెత్తి ప్రాణాలు దక్కించుకోగా, స్థానికులు వారికి సహాయం చేశారు. మంటలు వ్యాపించడంతో ఇల్లు సగానికి పైగా దగ్ధమైంది. 

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన అనంతరం అక్కడికి వచ్చిన అబ్దుల్ భారీ సోదరుడు అబ్దుల్ బాబర్ తమను చంపేస్తామని బెదిరించాడని బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌వో సత్యనారాయణ గౌడ్ తెలిపారు.