
- పల్లెల్లో మళ్లీ ‘బెల్టు’ దందాలు
- ఎమ్మార్పీకి మించి ధరలు
- పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
మొగుళ్లపల్లి, వెలుగు : ఎలక్షన్ కోడ్ రద్దయిందో లేదో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని గ్రామాల్లో అప్పుడే మళ్లీ వాడవాడకు పదుల సంఖ్యలో బెల్టు షాపులు పుట్టుకొచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో 30 రోజుల ముందుగానే గ్రామాల్లో బెల్టు షాపులను అధికారులు బంద్ చేయించారు. అక్రమంగా మద్యం తరలిస్తూ దొరికిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి ఆఫీసర్ల ముందు బైండోవర్ చేస్తూ మద్యాన్ని సీజ్ చేయడంతో బెల్టు షాపులు పూర్తిగా మూతపడ్డాయి. దీంతో ప్రతి పల్లెలో మహిళలు నెల రోజుల పాటు ప్రశాంతంగా ఉన్నారు. అయితే, వారం క్రితం ఎన్నికలు ముగియడంతో ఈసీ ఎన్నికల కోడ్ ఎత్తేసింది.దీంతో గ్రామాల్లో బెల్టు షాపుల దందా మళ్లీ మొదలైంది.
2023–-25 సంవత్సరానికి డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. జిల్లాలోని మొగుళ్లపల్లిలో రెండు వైన్ షాపులను దక్కించుకున్న నిర్వాహకులు.. సిండికేట్ గా మారి అధిక లాభాల కోసం బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నారు. వైన్ షాప్ యజమానులు బెల్టు షాపులకు మద్యాన్ని అమ్మేందుకు ఓ షాపును ప్రత్యేకంగా కేటాయించి లాభాల కోసం వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కస్టమర్ కు కావలసిన మద్యాన్ని ఎమ్మార్పీకి అమ్మకుండా ఆ బ్రాండ్ మద్యం లేదంటూ ఎక్కువ ధరకు బెల్టు షాపులకు అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వైన్ షాపు నిర్వాహకులు ఎమ్మార్పీకి మించి క్వార్టర్ పై, బీర్ బాటిల్ పై రూ.20, ఫుల్ బాటిల్ పై రూ.80 పెంచి బెల్టు షాపులకు విక్రయిస్తున్నారు. దీంతో పాటు బెల్టు షాపుల వారు అదనంగా మరో రూ.20 పెంచి కస్టమర్లకు విక్రయిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ రూల్స్ ధిక్కరించి వైన్ షాపులో నిర్వాహకులు ఎమ్మార్పీకి మించి బెల్టు షాపులకు మద్యం అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి ఉన్నత ఆఫీసర్లు గ్రామాల్లో బెల్టు షాపుల మూసివేత దిశగా చర్యలు తీసుకోవాలనికోరుతున్నారు.