కల్లాలు, కొనుగోలు సెంటర్లలో తడుస్తున్న వడ్లు

కల్లాలు, కొనుగోలు సెంటర్లలో తడుస్తున్న వడ్లు
  • కొనుగోళ్లు స్పీడ్​ అందుకోక.. ఎక్కడికక్కడ నిలిచిన వడ్ల రాశులు
  • 4,569 సెంటర్లు మొదలైనా.. సగం కేంద్రాల్లో కాంటాలు పెడ్తలే
  • బార్​దాన్, హమాలీలు, లారీలు లేక ఇబ్బందులు
  • కుప్పలపై కప్పేందుకు టార్పాలిన్లు కూడా ఇయ్యని సర్కారు
  • రెక్కల కష్టం నీళ్లపాలైతుందని అన్నదాతల ఆవేదన

(వెలుగు, నెట్​వర్క్​)

రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కల్లాలు, కొనుగోలు సెంటర్లలో వడ్లు తడుస్తున్నాయి. కళ్ల ముందే పంటంతా నీళ్లపాలు అవుతుండడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. రానున్న మూడు రోజులు భారీ వర్షాలకు చాన్స్​ ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మరింత బుగులు పడుతున్నారు. కొనుగోళ్లు స్పీడ్​ అందుకోకపోవడంతో దగ్గర దగ్గర కోటి టన్నుల ధాన్యం బయటే ఉన్నది. మడికట్లు, కల్లాలు, రోడ్లు, కొనుగోలు సెంటర్లు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎటుచూసినా వడ్ల కుప్పలే కనిపిస్తున్నాయి. మెజారిటీ సెంటర్లలో కనీసం టార్పాలిన్లు కూడా అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి దయనీయంగా తయారైంది. 
కోతలు మొదలై నెల.. కొన్నది 7 శాతం!
ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర సర్కారు చెప్తున్నదానికీ, కొంటున్న వడ్లకు పొంతన ఉంటలేదు. వరి కోతలు మొదలై నెల దాటినా కొనుగోళ్లు స్పీడ్​అందుకోవట్లేదు. సివిల్​ సప్లైస్​ శాఖ డెయిలీ రిలీజ్​చేస్తున్న వడ్ల కొనుగోళ్ల లెక్కలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కొనాల్సిన వడ్లు కోటి 30 లక్షల టన్నులు కాగా, ఇప్పటివరకు కొన్నది కేవలం 9 లక్షల 58 వేల మెట్రిక్​ టన్నులు మాత్రమే. అంటే లక్ష్యంలో ఇది కేవలం 7 శాతం మాత్రమే. ఇందులో కాంటా అయిన తర్వాత మిల్లులకు తరలించింది 9 లక్షల మెట్రిక్​ టన్నులే. 
వాస్తవానికి వడ్ల సేకరణకు రాష్ట్రవ్యాప్తంగా 6,670 కొనుగోలుసెంటర్లు ఏర్పాటుచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇందులో సోమవారం నాటికి 4,569 సెంటర్లు ఓపెన్​ చేశామని సివిల్​ సప్లై మినిస్టర్​ గంగుల కమలాకర్ వెల్లడించారు. కానీ మంత్రి చెబుతున్న సెంటర్లన్నీ కేవలం లీడర్లు, ఆఫీసర్లు వచ్చి రిబ్బన్​ కటింగ్ చేసి వెళ్లినవవి మాత్రమే! నిజానికి ఇందులో నాలుగోవంతు సెంటర్లలోనూ పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదు. ఉదాహరణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో154 సెంటర్లను అధికారికంగా ఓపెన్​చేసినా కేవలం పది సెంటర్లలోనే కాంటాలు నడుస్తున్నయి. మంత్రి ఓపెన్​ చేసినట్లు చెబుతున్న వందలాది సెంటర్లకు ఇప్పటికీ  రైస్​మిల్లులను అలాట్​చేయలేదు. ప్రభుత్వం ఇస్తున్న ట్రాన్స్​పోర్ట్​చార్జీలు తమకు గిట్టుబాటు కావంటూ కొన్నిజిల్లాల్లో లారీలు రావడం లేదు. సరిపడా బార్​దాన్​లేక కొన్నిచోట్ల, హమాలీలు లేక మరికొన్నిచోట్ల కాంటాలు పెట్టడం లేదు. పెట్టిన చోట్ల రైస్​మిల్లుల్లో లోడ్​ దింపుకోక ఎక్కడి కొనుగోళ్లు అక్కడే ఆగిపోతున్నాయి. చాలా సమస్యలు ఆఫీసర్ల స్థాయిలో పరిష్కారం కావడం లేదు. 
వర్షంతో టెన్షన్​టెన్షన్​..
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని, దీని వల్ల  రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌‌ ఉందని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో ఆందోళన మొదలైంది. పచ్చిగుంటే కొంటలేరనే కారణంతో సోమవారం ఉదయం నుంచే వడ్లను సెంటర్లలో, కల్లాల్లో,  రోడ్లపై ఆరబోసుకున్న రైతులు.. మధ్యాహ్నం తర్వాత మబ్బులు పట్టాక భయంతో ఎక్కడికక్కడ కుప్పలు పోశారు. సెంటర్లలో టార్పాలిన్లు లేకపోవడంతో ఇంట్లో ఉన్నవి, అద్దెకు తెచ్చుకున్నవి ఏదో ఒకటి తీసుకెళ్లి కప్పుకున్నారు. ఈ ఏర్పాట్లన్నీ చిన్నవర్షాలకే  పనికి వస్తాయని, భారీ వర్షాలు పడితే కొనుగోలు సెంటర్లలోని వడ్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. ఆదివారం ఉమ్మడి మహబూబ్​నగర్​, వరంగల్​జిల్లాల్లో పలుచోట్ల చిరు జల్లులకే కల్లాల్లో వడ్లు కొట్టుకపోయాయి. కరీంనగర్, వరంగల్​సహా పలు జిల్లాల్లో వర్షం మొదలై, కళ్ల ముందే వడ్ల కుప్పలు తడిసిపోతుండగా, రైతులకు కంటి మీద కునుకు కరువైంది.
పట్టించుకుంటలేరు
వడ్లు జల్దీ కొనాలని వేడుకుంటున్నా ఎవరూ పట్టించుకుంటలేరు. నాకున్న ఐదెకరాల్లో పండించిన వడ్లను వారం కింద చాకుంట సెంటర్​కు తెచ్చిన. ఒక్క టార్పాలిన్​ కూడా ఇయ్యలే. వర్షం వస్తే వడ్లు తడుస్తయని పర్దాలు కిరాయి తెచ్చుకొని కప్పుకున్నం. 
- ఏముండ్ల నాగరాజు, 
  చాకుంట, కరీంనగర్​ జిల్లా

వానకు తడిసినయి..
రాత్రి కొట్టిన వానకు వడ్లు తడిసి ముద్దైనయ్. నాలుగు ఎకరాల్లో పండిన వడ్లను సెంటర్‌కు తీసుకుపోయిన. అక్కడ సౌలతులు లేవు. పొద్దంతా మబ్బులు పడితే భయమైతంది. పంట చేతికి వచ్చిన తర్వాత అక్కరకు రాకుండా పోయేటట్టు ఉన్నది.
- శీలం ఓంకార్ రెడ్డి, 
రేగొండ, భూపాలపల్లి జిల్లా

రెండు వారాలైనా..
4 ఎకరాల్లో వరి పెట్టిన. పంట అమ్ముదామని 2 వారాల కింద సెంటర్​కు వడ్లు తీసుకొచ్చిన. ఎండలేదని కాంట చేయలేదు. రెండు రోజుల నుంచి మొగులైతంది. వర్షం వచ్చి కొన్ని వడ్లు నానినై. అరిగోస పడి పండించిన పంట అమ్ముకుందామంటే సరిగ కొంటలేరు.
- యమా రాజయ్య, 
   రైతు, మెట్ పల్లి, జగిత్యాల జిల్లా