
భారత్ భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదంటూ ప్రధాని మోడీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. డెప్సాంగ్, డెమ్ చోక్ ప్రాంతాలను చైనా సైనికులు ఆక్రమించుకున్నట్టు శాటిలైట్ ఫొటోల్లో తెలుస్తోందన్నారు. ఇంత జరుగుతున్నా చైనాతో వ్యాపార , వాణిజ్య సంబంధాలు కొనసాగించడం ఏమిటని ప్రశ్నించారు.
బార్డర్లో ఇష్యూస్ పై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. భారత సైన్యం చాలా పవర్ ఫుల్ అని.... కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం బలహీనంగా ఉందని అసద్ మండిపడ్డారు. చైనాను చూసి కేంద్రం భయపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్మీని ప్రతి ఒక్కరు గౌరవించాలి : విదేశాంగ మంత్రి జైశంకర్
బార్డర్లో చైనా ఆక్రమణపై కేంద్రం ఉదాసీనంగా ఉంటుందనే విమర్శలను విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తిప్పికొట్టారు . రాజకీయ విమర్శలతో తమకు సంబంధం లేదన్న ఆయన... జవాన్లను అగౌరవ పరచొద్దని చెప్పారు. సొంత అవగాహనను మరింత పెంచుకోవాలంటూ తనపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. ఎవరు సలహా ఇస్తున్నారో చూసి.... వారిని గౌరవిస్తామని చెప్పారు. ఎన్నో ఇబ్బందులు పడుతూ... 13 వేల అడుగుల ఎత్తులో నిలబడి దేశాన్ని కాపాడుతున్న ఆర్మీని ప్రతీ ఒక్కరు గౌరవించాలని పార్లమెంట్ లో జైశంకర్ చెప్పారు.