వాళ్లిద్దరూ ఆడితే టీమిండియాకు మరింత బలం

వాళ్లిద్దరూ ఆడితే టీమిండియాకు మరింత బలం

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్స్ కు మరో నెల సమయం కూడా లేదు. సుదీర్ఘ ఫార్మాట్ లో న్యూజిలాండ్ ను ఓడించి కప్ ను సొంతం చేసుకునేందుకు టీమిండియా వ్యూహాలు రచిస్తోంది. పటిష్ఠ టీమ్ ను ఎంపిక చేసుకున్న భారత్.. ఫైనల్ ఎలెవన్ లో ఎవర్ని ఆడించాలనే విషయంలో కొంత సందిగ్ధతతో ఉంది. ఈ నేపథ్యంలో భారత తుది జట్టులో ఏయే బౌలర్లు ఉండాలనే దానిపై వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా తన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు. మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రాలను తప్పక బౌలింగ్ దళంలో చేర్చాలని సూచించాడు.

ఇండియా, న్యూజిలాండ్ రెండు జట్లలోనూ మంచి బౌలర్లు ఉన్నారు. అయితే షమి, బుమ్రా కివీస్ బౌలర్ల కంటే వైవిధ్యం. వీళ్లిద్దరూ జీవం లేని ఫ్లాట్ వికెట్ల పైనా బ్యాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెట్టగలరు. వీరికి తోడుగా ఇషాంత్ ఉండనే ఉన్నాడు. 100 టెస్టులు ఆడిన అతడి అనుభవం జట్టుకు కొండంత బలం చేకూరుస్తుంది. ఒకవేళ వేగమైన పచ్చిక పిచ్ మీద ఆడాల్సి వస్తే మహ్మద్ సిరాజ్ కు చోటు కల్పించాలి. వీరిని మినహాయిస్తే ట్రాక్ ను బట్టి ఇద్దరు స్పిన్నర్లు కావాలంటే అశ్విన్, రవీంద్ర జడేజాను ఆడించాలి. ఈ ఇద్దరూ బ్యాట్ తోనూ సత్తా చాటగలరు. కాబట్టి వీరిని టీమ్ లో తీసుకోవాలి. అప్పుడే జట్టు మరింత పటిష్టంగా తయారవుతుంది' అని నెహ్రా పేర్కొన్నాడు.