
డేంజర్లో పడ్డ సర్కార్
సీఎల్పీకి హాజరుకాని పైలట్
డిప్యూటీ సీఎం టార్గెట్గా కాంగ్రెస్ తీర్మానం
పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే
చర్యలు తప్పవని వార్నింగ్
సీఎల్పీ నుంచి నేరుగా హోటల్కి
వెళ్లిన గెహ్లాట్ మద్దతుదారులు
మాతో 106 మంది ఎమ్మెల్యేలు: సీఎం వర్గం
సచిన్ కి ప్రియాంక, రాహుల్ గాంధీ ఫోన్ ?
జైపూర్, న్యూఢిల్లీ: రాజస్థాన్ సర్కార్ డేంజర్లో పడింది. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య విభేదాలు ముదిరిపాకాన పడ్డాయి. సోమవారంనాటి సీఎల్పీ సమావేశానికి డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ డుమ్మా కొట్టారు. ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్లాలన్న ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల మాటను ఆయన బేఖాతరు చేశారు. సీఎల్పీకి 106 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్టు గెహ్లాట్ చెప్పారు. తనకు 30 మంది సపోర్ట్చేస్తున్నట్టు పైలట్ ప్రకటించారు. సర్కార్ను కాపాడుకునేందుకు గెహ్లాట్ రిసార్ట్ రాజకీయాలను మొదలు పెట్టారు. దీంట్లో భాగంగా ఇంట్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సీఎల్పీ) భేటీ తర్వాత, దానికి హాజరైన ఎమ్మెల్యేలను ఆయన జైపూర్ శివార్లలోని హోటల్కు తరలించారు. మరోవైపు, సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సచిన్ పైలట్తో రాహుల్, ప్రియాంక టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. పైలట్కోసం పార్టీ తలుపులు ఏ టైంలోనైనా తెరిచే ఉంటాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ప్రకటించారు. సచిన్ పైలట్తో ప్రియాంక గాంధీ మాట్లాడారని, రాజీకి ఒప్పించారని ప్రచారం జరుగుతుండగా.. హైకమాండ్ ముందు పైలట్ పలు డిమాండ్లు పెట్టారని తెలుస్తోంది. మరోవైపు, మంగళవారం ఉదయం 10 గంటలకు మరోసారి ఎమ్మెల్యేలతో సమావేశమవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనికి సచిన్ పైలట్ను కూడా ఆహ్వానించింది. కాంగ్రెస్ లో ఇంటిపోరు ఒకపక్క తీవ్రమవుతుంటే అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలున్న భారతీయ ట్రైబల్పార్టీ.. గెహ్లాట్ సర్కార్కు మద్దతును ఉపసంహరించుకున్నట్టు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఆపార్టీ చీఫ్ మహేశ్ భాయ్ వాసర ఈ విషయాన్ని సోమవారం చెప్పారు. అసెంబ్లీలో బలనిరూపణ జరిగినప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలు న్యూట్రల్గా ఉంటారన్నారు. కాంగ్రెస్ సంక్షోభాన్ని బీజేపీ దగ్గరగా గమనిస్తోంది. రాజస్థాన్లో పరిస్థితికి రాహుల్గాంధీనే కారణమని బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి విమర్శిస్తే… రాజస్థాన్ సీఎం పదవికి సచిన్ పైలట్ సరైన క్యాండిడేట్ అని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సతీశ్ పునియా మెచ్చుకున్నారు.
కుట్రదారులపై కఠిన చర్యలు
సోమవారం సీఎం అశోక్ గెహ్లాట్ ఇంట్లో జరిగిన సీఎల్పీ భేటీకి ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హైకమాండ్ కూడా సీనియర్ నేతలు పాండే, సూర్జేవాలా, అజయ్ మాకెన్ లను ఈ మీటింగ్కు పంపించింది. ఎంతమంది వచ్చారనే దానిపై అధికారికంగా క్లారిటీ ఇవ్వకపోయినా.. 106 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారని గెహ్లాట్ వర్గం నేతలు చెబుతున్నారు. వచ్చిన ఎమ్మెల్యేలంతా గెహ్లాట్సర్కారుకు మద్ధతు తెలిపారని అన్నారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎల్పీ ఓ తీర్మానం పాస్ చేసింది. ప్రభుత్వాన్ని బలహీన పరిచే కుట్రలను సహించేది లేదని గెహ్లట్మద్దతుదారులు తేల్చిచెప్పారు. ఇదంతా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ చేస్తున్న కుట్ర అని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని గెహ్లాట్ ఆరోపించారు. సమావేశం తర్వాత ఎమ్మెల్యేలు అందరూ బస్సుల్లో సిటీ శివార్లలోని రిసార్టుకు చేరుకున్నారు. బస్కెక్కే ముందు ఎమ్మెల్యేలందరూ విక్టరీ సింబల్ చూపిస్తూ వెళ్ళారు.
తలుపులు తెరిచే ఉంటయ్
సీఎల్పీ మీటింగ్కు ముందు పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాల మాట్లాడుతూ.. కాంగ్రెస్ తలుపులు పైలట్ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. సమస్యలుంటే కూచొని, మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతే అదని తెలిపారు. ‘ఇంట్లో ఏదైనా చికాకు ఏర్పడితే కుటుంబ సభ్యులతో కూర్చుని మాట్లాడి, పరిష్కారం గురించి ఆలోచిస్తం కానీ ఏ కుటుంబ సభ్యుడైనా ఇంటినే కూల్చేయాలని అనుకోడు’ అని సూర్జేవాలా చెప్పారు. సోనియా, రాహుల్ పైలట్తో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
సర్దిచెప్పేందుకు రాహుల్, ప్రియాంక ప్రయత్నాలు
పార్టీలో ఇష్యూలేవైనా ఉంటే పరిష్కరించుకుందాం.. ఇప్పుడైతే గెహ్లాట్తో సర్దుకుపొమ్మంటూ సచిన్పైలట్కు నచ్చచెప్పేందుకు రాహుల్, ప్రియాంక సహా టాప్ నేతలు ప్రయత్నిస్తున్నారు. అహ్మద్ పటేల్, పి.చిదంబరం, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తదితరులు పైలట్తో మాట్లాడారు. పైలట్ మాత్రంవారికి ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం. ఢిల్లీలోనే ఉన్నప్పటికీ చాలా ఫోన్ కాల్స్ను అందుకోవడంలేదని తెలిసింది. అనధికారిక సమాచారం ప్రకారం.. ప్రియాంకతో మాట్లాడిన తర్వాత పైలట్ రాజీకి సిద్ధపడ్డారని పార్టీ నేతలు చెప్పారు. తన వర్గం ఎమ్మెల్యేలకు మూడు కీలక మంత్రిపదవులు ఇవ్వాలని, పార్టీ పదవిలో తనను కొనసాగించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.
గెహ్లాట్ సన్నిహితులపై ఐటీ రెయిడ్స్
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కు సన్నిహితులైన ఇద్దరు కాంగ్రెస్ లీడర్లకు చెందిన పలుచోట్ల ఐటీ అధికారులు సోమవారం సోదాలు చేశారు. పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ అరోరా, ధర్మేంద్ర రాథోడ్ లకు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో దాడులు జరిపారు. ట్యాక్స్ ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో రెయిడ్స్ చేసినట్లు ఐటీ అధికారులు తెలిపారు. పెద్ద మొత్తంలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు ఇన్ఫర్మేషన్ వచ్చిందని, ఇందులో కొన్ని బిజినెస్ గ్రూప్స్ ఉన్నాయని చెప్పారు. జైపూర్, కోటా, ముంబై, ఢిల్లీలలో 80 మందికి పైగా ఆఫీసర్లు రెయిడ్స్ చేశారు. ఐటీ దాడులను కాంగ్రెస్ ఖండించింది. ‘‘ఐటీ, ఈడీ, సీబీఐ బీజేపీ ఫ్రంటల్ డిపార్ట్ మెంట్స్. వారి దాడులు రాజస్థాన్ ప్రభుత్వాన్ని పడగొట్టలేవు” అని కాంగ్రెస్ లీడర్ రణదీప్ సూర్జేవాలా అన్నారు.
For More News..