అశోక్ లేల్యాండ్ ఇండియాలో దూసుకెళ్తోంది!

అశోక్ లేల్యాండ్ ఇండియాలో దూసుకెళ్తోంది!

మన దేశంలో ఏ ఊళ్లో చూసినా కనీసం ఒక్క అశోక్ లేల్యాండ్‌‌ వెహికల్‌‌అయినా కనిపిస్తుంది. అంతెందుకు దేశంలో ఈ కంపెనీ వెహికల్స్‌‌ని రకరకాల అవసరాల కోసం వాడుతుంటారు. ఆర్టీసీ బస్సుల నుంచి ఆర్మీ ట్రక్‌‌ల వరకు ఎన్నో రకాల వెహికల్స్‌‌ని అశోక్‌‌ లేల్యాండ్‌‌ తయారు చేస్తోంది. ఇది ప్రపంచంలోని టాప్‌‌ కమర్షియల్‌‌ మోటార్ వెహికిల్స్‌‌ కంపెనీల్లో ఒకటి. ఓ స్వాతంత్ర్య సమరయోధుడు చిన్న అసెంబ్లింగ్‌‌ యూనిట్‌‌గా మొదలుపెట్టిన ఈ కంపెనీ ఇప్పుడు 50 దేశాలకు విస్తరించింది. 

అశోక్ లేల్యాండ్‌‌‌‌ కంపెనీని పంజాబ్‌‌‌‌కు చెందిన రఘునందన్ సరన్ అనే స్వాతంత్ర్య సమరయోధుడు 1948లో స్థాపించాడు. అతని కొడుకు అశోక్ పేరు మీద కంపెనీకి అశోక్ మోటార్స్ అని పేరు పెట్టాడు. రఘునందన్ సరన్​ ఈ కంపెనీని స్థాపించడానికి ముందు అంటే.. దేశానికి స్వాతంత్ర్యం రాకముందు రావల్పిండి సిటీలోని తన తండ్రి పెట్టిన కార్ వర్క్‌‌‌‌షాప్‌‌‌‌ నడిపేవాడు. అప్పటికే అతని తండ్రి చాలా ధనవంతుడు. సమాజంలో చాలా మర్యాద ఉండేది. అందుకే అక్కడివాళ్లు రఘునందన్‌‌‌‌కి కూడా గౌరవం ఇచ్చేవాళ్లు.  కానీ.. రఘునందన్‌‌‌‌కి అది ఇష్టం ఉండేది కాదు.

ఎందుకంటే తండ్రి ద్వారా వచ్చిన గౌరవం కంటే.. తాను స్వయంగా ఏదైనా చేసి మర్యాద సంపాదించుకోవాలి అనుకునేవాడు. అదే టైంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్‌‌‌‌లాల్ నెహ్రూ ఆధునిక పారిశ్రామిక వెంచర్‌‌‌‌లో పెట్టుబడి పెట్టడానికి చాలామంది వ్యాపారవేత్తలను ఆహ్వానించారు. అప్పుడే రఘునందన్‌‌‌‌ అశోక్ మోటార్స్‌‌‌‌ని ఏర్పాటు చేశాడు. మొదట్లో ఇంగ్లాండ్ నుండి ఆస్టిన్ కంపెనీ కార్ల విడిభాగాలను దిగుమతి చేసుకుని ఈ కంపెనీలో అసెంబ్లింగ్‌‌‌‌ చేసేవాళ్లు. 

కమర్షియల్‌‌‌‌వెహికల్స్

కంపెనీ మెయిన్ బ్రాంచ్‌‌‌‌ని1948లో చెన్నైలో నిర్మించారు. ఇక్కడ మొట్టమొదటిసారిగా1949లో ఆస్టిన్ కంపెనీకి చెందిన A–40 కార్లను స్వదేశీ సాంకేతికతతో అసెంబ్లింగ్‌‌‌‌ చేశారు. అవి మన దగ్గర బాగా సక్సెస్‌‌‌‌ అయ్యాయి. తక్కువ టైంలోనే లాభాలు కూడా వచ్చాయి. కానీ.. వ్యాపారంలోకి దిగిన తర్వాత రఘునందన్‌‌‌‌.. స్వతంత్ర భారతదేశం అభివృద్ధి చెందాలంటే ప్యాసింజర్ కార్ల కంటే కమర్షియల్ వెహికల్స్‌‌‌‌అవసరం ఎక్కువగా ఉందని తెలుసుకున్నాడు. ఆయనకు మొదటి నుంచి దేశభక్తి ఎక్కువగా ఉండడంతో కార్ల అసెంబ్లింగ్‌‌‌‌లో లాభాలు వస్తున్నా... వాటిని వద్దనుకుని కమర్షియల్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌ మాన్యుఫాక్చరింగ్‌‌‌‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. బ్రిటిష్ కంపెనీ లేల్యాండ్ మోటార్స్‌‌‌‌తో పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ కుదుర్చుకున్నాడు. అప్పటికే ఆ కంపెనీ కమర్షియల్ వెహికల్స్ తయారుచేయడంలో సక్సెస్‌‌‌‌ అయ్యింది. ఆ కంపెనీ ఇచ్చే టెక్నాలజీతో ఇండియాలో వెహికల్స్‌‌‌‌ తయారుచేయాలనేది రఘునందన్ ప్లాన్‌‌‌‌.

అశోక్ మోటార్స్‌‌‌‌కు సాయం చేయడానికి లేల్యాండ్ కంపెనీ కూడా ఒప్పుకుంది. అంతేకాదు.. అప్పటి మద్రాసు గవర్నమెంట్‌‌‌‌ కూడా కంపెనీకి ఆర్థికంగా సాయం చేసింది. అయితే.. రఘునందన్ అనుకున్నది సాధించకముందే1953లో విమాన ప్రమాదంలో చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత కొన్నాళ్ల పాటు కంపెనీని మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం సాయంతో కంపెనీలోని కొందరు వాటాదారులు, రఘునందన్ భార్య చూసుకున్నారు. రఘునందన్ చనిపోకముందు లేల్యాండ్‌‌‌‌ మోటార్స్‌‌‌‌తో చేసుకున్న ఒప్పందం వల్ల అశోక్‌‌‌‌ మోటార్స్‌‌‌‌లో లేల్యాండ్‌‌‌‌తో కలసి ‘అశోక్ లేల్యాండ్’గా మారింది. కంపెనీలో ప్యాసింజర్ వెహికల్స్‌‌‌‌ ప్రొడక్షన్ పూర్తిగా ఆపేసి కమర్షియల్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌ మాన్యుఫాక్చరింగ్ మొదలుపెట్టారు. 

కమెట్‌‌‌‌

అశోక్ లేల్యాండ్‌‌‌‌గా ఏర్పడిన తర్వాత కంపెనీ మొట్టమొదటిసారి 1955లో ‘కమెట్ 350’ పేరుతో పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌, ఫ్యుయెల్‌‌‌‌ ఎఫిషియెంట్‌‌‌‌ ట్రక్‌‌‌‌ని మార్కెట్‌‌‌‌లోకి తీసుకొచ్చింది. ఈ వెహికల్‌‌‌‌ తక్కువ టైంలోనే బాగా సక్సెస్‌‌‌‌ అయ్యింది. ఓకే ఏడాదిలో ఏకంగా వెయ్యి ట్రక్‌‌‌‌లు అమ్ముడయ్యాయి. ఈ ట్రక్ ఇచ్చిన సక్సెస్‌‌‌‌తో 1963లో కమెట్‌‌‌‌బస్‌‌‌‌ను మార్కెట్‌‌‌‌లోకి తీసుకొచ్చారు. అయితే.. ట్రక్‌‌‌‌ చాసిస్‌‌‌‌ మీద ప్యాసింజర్‌‌‌‌‌‌‌‌ బస్‌‌‌‌ బాడీని బిల్డ్‌‌‌‌ చేశారు. అందుకే దీనికి కూడా కమెట్‌‌‌‌అనే పేరు పెట్టారు. ఈ బస్‌‌‌‌ కూడా సక్సెస్‌‌‌‌ అయ్యింది. 

అన్నింటిలో ముందుంటూ.. 

అశోక్ లేల్యాండ్ టెక్నాలజీని డెవలప్‌‌‌‌ చేయడంలో, కొత్త టెక్నాలజీని ఇండియాకు తీసుకురావడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఇండియాకు ఎయిర్ బ్రేకింగ్‌‌‌‌ని మొట్టమొదటగా ఈ కంపెనీ తీసుకొచ్చింది. అప్పటికి ప్రపంచంలోనే అత్యంత అధునాతన బ్రేకింగ్ సిస్టమ్ అది. 

హిప్పో

అశోక్ లేలాండ్ 1954లో తీసుకొచ్చిన ట్రక్‌‌‌‌ కెపాసిటీ 7.5 టన్నులు మాత్రమే ఉండేది. కానీ.. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ బరువు మోయగల ట్రక్‌‌‌‌లకు డిమాండ్‌‌‌‌ ఉంటుందనే అంచనా వేసింది. అందుకే వెహికల్స్‌‌‌‌ కెపాసిటీ పెంచింది. 1966లో 10–30 టన్నుల అశోక్ లేల్యాండ్ బీవర్/హిప్పో ట్రక్‌‌‌‌లను డెవలప్‌‌‌‌ చేసింది.  

డబుల్ డెక్కర్ 

ఇండియాకు సొంత డబుల్‌‌‌‌ డెక్కర్‌‌‌‌‌‌‌‌ బస్సులను అందించింది కూడా ఈ కంపెనీయే.1967లో కంపెనీ టైటాన్ పేరుతో డబుల్ డెక్కర్ బస్సులను మార్కెట్‌‌‌‌లోకి తీసుకొచ్చింది. అంతేకాదు.. ఇండియాలో కమర్షియల్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌లో పవర్  స్టీరింగ్‌‌‌‌ తీసుకొచ్చిన మొట్టమొదటి కంపెనీ కూడా ఇదే. ఇలా అన్నింటిలో ముందుండడం వల్ల కంపెనీ రోజురోజుకూ ఎదుగుతూ వచ్చింది. 

ఆర్మీలో 

ఆర్మీ కోసం 1970 నుంచి అశోక్  లేల్యాండ్ ప్రత్యేకంగా వెహికల్స్‌‌‌‌ తయారుచేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా ఆర్మీ కోసం చేసిన 6×4 హిప్పో టిప్పర్ బాగా సక్సెస్‌‌‌‌ అయ్యింది. దాంతో కంపెనీ ప్రొడక్షన్‌‌‌‌ కెపాసిటీని కూడా బాగా పెంచుకుంది.1973 నాటికి ప్రొడక్షన్  కెపాసిటీ10,000 వెహికల్స్‌‌‌‌కు పెరిగింది. 1974లో కంపెనీ టర్నోవర్‌‌‌‌ కోట్ల రూపాయలు దాటింది.1996లో కంపెనీ హోసూర్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేకంగా ఆర్మీ వెహికల్స్‌‌‌‌ తయారు చేయడానికి ఒక ప్లాంట్‌‌‌‌ కూడా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అశోక్ లేల్యాండ్ నుండి వచ్చిన స్టాలియన్స్ భారత సైన్యానికి అతిపెద్ద లాజిస్టిక్స్ వెహికల్‌‌‌‌గా మారింది. 

వైకింగ్‌‌‌‌.. చిరుత 

కంపెనీ ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది. అందుకే సక్సెస్‌‌‌‌ అయ్యింది. అశోక్‌‌‌‌ లేల్యాండ్‌‌‌‌ వైకింగ్ పేరుతో దేశంలో మొట్టమొదటి ఫ్రంట్ ఓవర్ హ్యాంగింగ్‌‌‌‌ బస్‌‌‌‌ని మార్కెట్‌‌‌‌లోకి తీసుకొచ్చింది. అంతేకాదు.. మొదట్లో మన దేశంలో బస్సులకు మధ్యలో ఒకే డోర్ ఉండేది. కానీ.. మొదటిసారి అశోక్‌‌‌‌ లేల్యాండ్‌‌‌‌ తన బస్సుల్లో ఫ్రంట్ ఎంట్రీ డోర్‌‌‌‌‌‌‌‌ బస్సుని తీసుకొచ్చింది. ఆ తర్వాత దేశంలో మొదటి బ్యాక్ ఇంజిన్‌‌‌‌ బస్సు చీతాను కూడా ఈ కంపెనీ తీసుకొచ్చింది. 

హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బస్సు 

అశోక్ లేల్యాండ్ 2002లో డిపార్ట్‌‌‌‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్‌‌‌‌ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ శాఖకు చెందిన ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ అండ్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్ సెంటర్ సాయంతో భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బస్సును డెవలప్‌‌‌‌ చేసింది. 2005లో వాఘా వద్ద ఇండో–పాక్ సరిహద్దును దాటిన భారతదేశపు మొట్టమొదటి బస్సు అశోక్ లేల్యాండ్ స్టాగ్. ఈ కంపెనీ ప్రపంచంలో మొదటి ఫ్రంట్ ఇంజిన్, ఫుల్లీ ఫ్లాట్ ఫ్లోర్ బస్సుని 2012లో తీసుకొచ్చింది. ఆ తర్వాత భారతదేశపు మొట్టమొదటి 37-టన్నుల హమాలీ ట్రక్, యూరో 6 కంప్లైంట్ ట్రక్, రోల్‌‌‌‌ ఓవర్ కంప్లైంట్ స్కూల్ బస్‌‌‌‌ లాంటివి తీసుకొచ్చింది.

అంచెలంచెలుగా... 

కంపెనీ తన రెండో యూనిట్‌‌‌‌‘హోసూర్–1’ని 1980లోనే తమిళనాడులో ఏర్పాటుచేసింది. ఇక్కడ అశోక్ టస్కర్, టారస్, అర్బన్ లాంటివి ప్రొడ్యూస్‌‌‌‌ చేశారు. 1982 మార్చిలో గేర్ బాక్స్ అసెంబ్లింగ్ కోసం భండారాలో మరో  ప్లాంట్‌‌‌‌ని, అదే ఏడాది ఆగస్టులో ప్యాసింజర్ ఛాసిస్ కోసం అల్వార్ యూనిట్ ఏర్పాటు చేశారు. తర్వాత1990లో ఉత్తర చెన్నై శివార్లలో మింజూర్ సమీపంలో వెల్లివోయల్చావాడిలో ఐదో ప్లాంట్‌‌‌‌ ఏర్పాటైంది. ఆ తర్వాత 1995లో తమిళనాడులోని నమక్కల్‌‌‌‌లో డ్రైవర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ కూడా ఏర్పాటు చేశారు. 2006లో దేశాలు దాటి  యూఏఈలోని రస్ అల్ ఖైమాలో అసెంబ్లీ యూనిట్‌‌‌‌ను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్‌‌‌‌ని 2010లో పూర్తి స్థాయి ప్లాంట్‌‌‌‌గా మార్చారు. కంపెనీ 2011 సంవత్సరంలో అమెరికన్ కంపెనీ జాన్‌‌‌‌ను కొనుగోలు చేసింది. తర్వాత డీర్ కంపెనీ సాయంతో నిర్మాణ పనుల్లో వాడే పెద్ద, చిన్న వెహికల్స్‌‌‌‌ని కూడా తయారు చేస్తోంది. 

హిందూజా చేతిలోకి

ఈ కంపెనీలోని 51 శాతం వాటాను 2007లో కొని కంపెనీని హిందూజా గ్రూప్‌‌ దక్కించుకుంది. అప్పటినుంచి కంపెనీ మరింత డెవలప్‌‌ అయ్యింది. ప్రస్తుతం ఈ కంపెనీ ఇండియాలో రెండో అతి పెద్ద కమర్షియల్‌‌ వెహికల్స్ తయారీదారు. ప్రపంచంలో 4వ అతిపెద్ద బస్సుల తయారీదారు. ట్రక్కుల తయారీలో 19వ అతిపెద్దది. చెన్నయ్​లో మెయిన్‌‌ బ్రాంచీతోపాటు మొత్తం 9 మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి. వాటిలో ఇండియాలో 7, రస్ అల్ ఖైమా (యూఏఈ) ఒకటి, యునైటెడ్ కింగ్‌‌డమ్‌‌లోని లీడ్స్‌‌లో మరొకటి ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో అశోక్ లేల్యాండ్‌‌ ట్రక్కులు అమ్ముడవుతున్నాయి.