‘పరోపకారార్థమిదం శరీరం’ ఇది మన ప్రాచీన వివేచనాత్మక నానుడి. ఈ ప్రకృతిలో వృక్షం తన పండ్లను తానే ఆరగించదు. ఏ నదీ తన నీటిని తానే తాగదు. అలాగే సాధుజనులు కూడా ఈ ధరణిపై ఆ స్ఫూర్తితోనే జన్మనెత్తుతారు’ అని ఇది ప్రబోధిస్తుంది. ఆశ్రితులకు పండ్లతో ఆకలి తీర్చే వృక్షం.. తీరం చేరినవారికి దప్పిక తీర్చే నది.. జన క్షేమమే పరమావధిగా గల సాధుపుంగవులు ఇదే కోవలోకి వస్తారు. వ్యక్తిగత విజయం కన్నా సాటివారి సంక్షేమానికి అంకితమైన జీవితానికి ఎంతో పరమార్థం ఉంటుందని మన రుషులు, మునులు అనాదిగా ప్రబోధిస్తూనే వచ్చారు. ఆ స్ఫూర్తిని తన జీవితంలో నిండుగా ప్రతిబింబించిన వ్యక్తులలో శ్రీ అశోక్ సింఘాల్ కూడా ఒకరు.
ఆధ్యాత్మిక సాధన, సాంస్కృతిక చైతన్యం, దశాబ్దాలపాటు కొనసాగిన అంకితభావం, సంస్థాగత కృషి మూర్తీభవించిన ఆయన అసమాన వ్యక్తిత్వాన్ని స్మరించుకుంటూ.. సెప్టెంబరు 27 నుంచి ఆయన శతజయంతి వేడుకలను మనం ఘనంగా నిర్వహించుకుందాం.
తో సంభాషించి ఆయన ఆదరాభిమానాలను పొందే అనేక అవకాశాలు లభించడం నిజంగా నా అదృష్టం. ఓ యువ కార్యకర్తగా సంస్థాగత బాధ్యతల నిర్వహణలో ఉన్నపుడు 1981నాటి ఒక సంఘటన నాకింకా గుర్తుంది. ఆ సమయంలో ఆయన స్వదస్తూరీతో రాసిన లేఖ నాకు అందింది. సహజంగానే నాకు అదొక ప్రత్యేక సందర్భంగా అనిపించింది. త్వరలో చేపట్టబోయే ఓ కీలక కార్యక్రమాన్ని ఆ లేఖలో ప్రస్తావిస్తూ.. ఆయన కర్తవ్య నిర్దేశం చేశారు.
ఆయన దశాబ్దాలపాటు రేయింబవళ్లు శ్రమించడం నేను స్వయంగా చూశాను. ఆ రోజుల్లో శ్రీ సింఘాల్ ఎంతో ప్రయాసకోర్చి, సుదీర్ఘంగా పయనిస్తూ మారుమూల ప్రాంతాలకు వెళ్లడం నాకు తెలుసు. ప్రత్యేకించి గుజరాత్‌లోని గిరిజన ప్రాంతాలలో పర్యటనకు ఆయన ఆసక్తి చూపేవారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు ఇంకా ఏమి చేయగలమన్న ఆలోచనే ఆయన మదిలో సదా మెదిలేది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే..బాధితులకు ఆపన్న హస్తం
దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే, బాధితులకు ఆపన్న హస్తం అందించడం కోసం అందరికన్నా ముందు అక్కడికి చేరడం, లేదా అప్పటికే చేరుకున్న కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంలో శ్రీ అశోక్ అగ్రస్థానంలో ఉండేవారు. గుజరాత్‌లోని కచ్‌లో 2001 నాటి భూకంపం తర్వాత ఆయనతో కలసి పనిచేసిన నా అనుభవం చిరస్మరణీయం. సాటి మానవులపై కరుణ, వారి సంక్షేమంపై శ్రద్ధ చూపే విశిష్ట లక్షణాలను శ్రీ అశోక్ బాల్యంలోనే అలవరచుకున్నారు. ఆయన తండ్రి శ్రీ మహావీర్ పరిపాలన యంత్రాంగంలో అత్యున్నత హోదాగల అధికారి. అలాంటి ఎంతో గొప్ప, సంపన్న కుటుంబంలో శ్రీ అశోక్ సింఘాల్ జన్మించారు. ఆయన సోదరులలో ఒకరైన బి.పి. సింఘాల్ పోలీసు అధికారిగా ఉద్యగం చేసి, ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడిగా ప్రజలకు సేవలందించారు.
మరో సోదరుడు వి.పి.సింఘాల్ త్రిపుర రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా వాణిజ్య, వ్యవసాయ రంగాల్లో ఎన్నో విజయాలు సాధించారు. అయితే, శ్రీ అశోక్ చిన్ననాటి నుంచే భిన్న దృక్కోణం వైపు ఆకర్షితులయ్యారు. అదే.. మాతృభూమికి పునరుజ్జీవం, భరతమాత బిడ్డల పూర్వవైభవ పునరుద్ధరణ. చిన్నతనాన ప్రయాగ్‌రాజ్‌లో నదీ సంగమం వద్ద శ్రీ అశోక్ గంటల తరబడి దీర్ఘాలోచనలో మునిగిపోయేవారు. అలా ఆ నదిని చూస్తూ.. దానిపైనే కాకుండా, అక్కడ పుణ్యస్నానాలు చేయడానికి వచ్చే సాధువులు, సన్యాసులు, భక్తులపైనా ఆసక్తి పెంచుకున్నారు. తద్వారా భారతీయ సాంస్కృతిక విలువలపై అవగాహన ఇనుమడించగా, సమాజానికి తనవంతు సేవ చేయాలనే సంకల్పం ఆయనలో బలపడింది.
అశోక్ సింఘాల్ మహోన్నత వ్యక్తిత్వాన్ని చాటే రెండు సందర్భాలు
‘పరోపకారార్థమిదం శరీరం’ అనే నానుడికి అనుగుణంగా ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) వైపు ఆకర్షితులయ్యారు. తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను ఉత్సాహంతో, క్రమశిక్షణతో, కర్తవ్య భావనతో నిర్వర్తించారు. పట్టుదల, అవిరళ కృషితో సంస్థలను, ఉద్యమాలను శ్రీ అశోక్ సింఘాల్ నడిపించారు. అద్భుత కంఠస్వరం, యావత్ సభను మంత్రముగ్ధం చేయగల వాగ్ధాటి ఆయన సొంతం. మరోవైపు సాటి కార్యకర్తలతో సౌహార్ద సంబంధాలపై ఆయన శ్రద్ధ కూడా ప్రశంసనీయం.
శ్రీ సింఘాల్‌తో పరిచయం తర్వాత ఆయనెంత నిరాడంబరుడో తెలిసిన తరువాత అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. సాధుసంతులలోనూ ఆయనకు ప్రగాఢ అనుబంధం ఉండేది. కాబట్టే, దేశంలోని సాధువులు, దార్శనికులలో ఆయనపై అపార గౌరవం కనిపించేది. వారంతా ఆయన సలహాలు, సూచనలకు ఎంతో విలువనిచ్చి శ్రద్ధగా ఆలకించేవారు. ఈ నేపథ్యంలో శ్రీ అశోక్ సింఘాల్ మహోన్నత వ్యక్తిత్వాన్ని చాటే రెండు సందర్భాలు స్ఫురణకొస్తున్నాయి.
మొదటిది- షికాగాలో స్వామి వివేకానంద ప్రసంగ శతాబ్ది వేడుకల్లో భాగంగా 1993లో విశ్వ హిందూ పరిషత్ అమెరికాలో ఒక సదస్సును నిర్వహించింది. అసలు ఇలాంటి కార్యక్రమాన్ని విదేశాల్లో నిర్వహించాలనే విశిష్ట ఆలోచన, తదనుగుణ ప్రణాళిక, విభిన్న భాగస్వాములను ఏకతాటిపైకి తేవడం ఆయనలోని అనుపమాన నిర్వహణ సామర్థ్యానికి మచ్చుతునకలు. ఇక రెండోది- ట్రినిడాడ్- టొబాగోలోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో ప్రపంచ హిందూ సదస్సు-2000 నిర్వహణ.
ఆ కార్యక్రమానికి ఆయన రాక ప్రతినిధులందరిలో ఎంతటి ఉత్సాహాన్ని రగిలించిందో నేను ప్రత్యక్షంగా చూశాను. అటుపైన నేను ప్రసంగించాక, నన్ను అభినందిస్తూ ఆయన ప్రసంశపూర్వకంగా పలికిన పలుకులు నన్నెంతో కదిలించాయి. ఆయనిచ్చిన ప్రోత్సాహం వల్ల ప్రతి కార్యకర్త రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడం మరోసారి నేను ప్రత్యక్షంగా చూశాను.
అద్భుత గాయకుడు అశోక్ సింఘాల్
శ్రీ అశోక్ సింఘాల్ అద్భుత గాయకుడని ఆయనతో సాన్నిహిత్యం గలవారికి తెలుసు! నాగ్‌పూర్‌లో సమావేశాల సందర్భంగా ఆయన ‘ఏకల్ గీత్’ ఆలాపనతో అందరినీ ఆశ్చర్యచకితులను చేయడం నేను ప్రత్యక్షంగా చూశాను. తద్వారా ఆయన సమావేశాలకు ఒక సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించేవారు. ముఖ్యంగా తన 90వ జన్మదినం సందర్భంగా 2015లో ఆయన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ- ‘హే మాతృభూమి మేరీ... హే పితృభూమి మేరీ’ అని పాడిన వీడియో ఎంతగా ప్రజల్లోకి దూసుకెళ్లిందో నాకిప్పటికీ గుర్తుంది. ఈ నేపథ్యంలో ఆయన శతజయంతి సందర్భంగా- యువతరం మరింతగా ఆయన మహోన్నత వ్యక్తిత్తం గురించి తెలుసుకునేలా మనం కృషి చేద్దాం. అలాగే, మన మాతృభూమి కోసం, ప్రజా సంక్షేమం కోసం ఆయన కన్న కలల సాకారం దిశగా మన ప్రతిజ్ఞను పునరుద్ఘాటిద్దాం.
వేద విద్య, సంగీతంపై ఆసక్తి
దేశ పురోగమనంతోపాటు మరో రెండు రంగాలపై శ్రీ అశోక్ సింఘాల్ ఎంతో ఆసక్తి చూపేవారు. వాటిలో ఒకటి విద్య (ముఖ్యంగా వేద విద్య), రెండోది సంగీతం. ప్రాచీన కాశీ నగరం ఆయన జీవితంలో ఓ ప్రధాన పాత్ర పోషించిన నేపథ్యంలో నేను వారణాసి ఎంపీగా దానికి ప్రాతినిధ్యం వహించడం నాకెంతో గర్వకారణం. బీహెచ్‌యూలో విద్యాభ్యాసం చేసిన సమయంలో ఉత్తమ విద్యార్థిగానూ శ్రీ సింఘాల్ గుర్తింపు పొందారు.
మారుమూల గ్రామాలకు.. ముఖ్యంగా గిరిజన వర్గాలకు ప్రాథమిక విద్యా ప్రదానం దిశగా కృషి చేసిన ‘ఏకల్ విద్యాలయ’ కార్యక్రమంతో ఆయనకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన విపరీతంగా పుస్తకాలు చదవడంతో పాటు ఇతరుల మాటకు ఎంతో ప్రాధాన్యమిస్తూ శ్రద్ధగా వినేవారు. వీలైనంత ఎక్కువగా పుస్తకాలు చదవాల్సిందిగా యువ కార్యకర్తలను ఆయన సదా ప్రోత్సహించేవారు.
రామజన్మభూమి ఉద్యమంలో అశోక్ సింఘాల్ కీలక పాత్ర
రామజన్మభూమి ఉద్యమంలో శ్రీ అశోక్ సింఘాల్ కీలక పాత్ర పోషించడాన్ని గుర్తుచేసుకోకపోతే ఆయన ప్రస్తావనకు అర్థం ఉండదు. ఆయన 1991నాటి బోట్ క్లబ్ సభలో చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరి మదిలో నేటికీ నిలిచి ఉంది. ఈ ఉద్యమం ఉచ్ఛస్థాయికి చేరినపుడు గాయం నుంచి రక్తం స్రవిస్తున్నా ఆయన లెక్కచేయకపోవడాన్ని ఎవరైనా ఎలా మరువగలరు? ఈనాడు అయోధ్యలో దివ్య-భవ్య రామమందిరం రూపుదిద్దుకుందంటే- నిస్వార్థంగా తమను తాము ఉద్యమ దీక్షకు అంకితం చేసుకున్న శ్రీ సింఘాల్ వంటి మహనీయులే కారణం. అయోధ్యలో రామమందిర స్వప్నం సాకారం చూడగలిగి ఉంటే ఆయనెంత సంతోషించి ఉండేవారో ఊహించవచ్చు.
శ్రీ సింఘాల్ ఆలోచనలు అత్యంత స్పష్టంగా ఉండేవి. సామాజిక ఐక్యత-, సమానత్వ బలోపేతానికి ఆయనెంతో కృషి చేశారు. సమాజంలో ఎలాంటి వివక్షకు తావులేదని, ప్రతి ఒక్కరికీ సమాన గౌరవ మర్యాదలు దక్కాలని ఆకాంక్షించేవారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తొలి పునాది రాయిని బిహార్‌లోని అణగారిన వర్గాల క్షేత్రస్థాయి వీహెచ్‌పీ కార్యకర్త శ్రీ కామేశ్వర్ చౌపాల్ చేతుల మీదుగా వేయించాలన్నది ఆయన ఆలోచన. ఇక కాశీలో ఒక ‘ధర్మ పరిరక్షణ సభ’లో డోమ్ రాజాను సత్కరించాలని నిర్ణయించుకున్న ఆయన, ఆ తర్వాత వివిధ సామాజిక కార్యక్రమాలలో ఆయనతో కలిసి పనిచేశారు.
-నరేంద్ర మోదీ, భారత ప్రధాన మంత్రి
