
- సెప్టెంబర్ 9–28 వరకు యూఏఈలో మెగా టోర్నీ
దుబాయ్: క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న మెగా టోర్నీకి రంగం సిద్ధమైంది. ఈ ఏడాది ఆసియా కప్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28వ తేదీ వరకు జరగనుంది. ఈ విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మోసిన్ నఖ్వీ శనివారం ప్రకటించారు. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ ఈవెంట్‌లో ఇండియా, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో బరిలో ఉన్నాయి. దాంతో సెప్టెంబర్ 14న గ్రూప్ దశ మ్యాచ్‌తో పాటు సూపర్ –4 రౌండ్‌లో సెప్టెంబర్ 21న దాయాది జట్లు పోటీపడటం దాదాపు ఖాయమైంది.
ఫైనల్ చేరితే ముచ్చటగా మూడోసారి ఢీకొంటాయి. ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన తర్వాత తొలిసారి ఇండో–పాక్ గ్రౌండ్‌లో ఢీకొట్టనున్నాయి. 2026 ఫిబ్రవరిలో ఇండియా, శ్రీలంక టీ20 వరల్డ్ కప్‌నకు ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ఈసారి ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు.
ఆసియా కప్‌కు ఆతిథ్య హక్కులు ఇండియాకే లభించినా.. ఇండో–పాక్ మ్యాచ్‌లు తటస్థ వేదికపై జరిగేలా బీసీసీఐ, పాక్ క్రికెట్ బోర్డు మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా టోర్నీని యూఏఈలో నిర్వహిస్తున్నారు. 2023లో జరిగిన గత ఎడిషన్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టైటిల్ నెగ్గిన ఇండియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.
మొత్తం ఎనిమిది జట్లు పోటీలో ఉండగా.. గ్రూప్–ఎలో ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్–బిలో శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ బరిలో నిలిచాయి. దుబాయ్, అబుదాబి వేదికలుగా ఓవరాల్‌గా 19 మ్యాచ్‌లు జరుగుతాయి. టీమిండియా సెప్టెంబర్ 10న యూఈఏతో, 14న పాకిస్తాన్‌తో, 19న ఒమన్‌తో పోటీపడనుంది.