Asian Games 2023: తెలంగాణ యువతిపై విషం చిమ్మిన తోటి అథ్లెట్.. ట్రాన్స్‌జెండర్ అంటూ ఆరోపణలు

Asian Games 2023: తెలంగాణ యువతిపై విషం చిమ్మిన తోటి అథ్లెట్.. ట్రాన్స్‌జెండర్ అంటూ ఆరోపణలు

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు భారత క్రీడాకారిణిల మధ్య చిచ్చు పెట్టాయి. మెడల్ చేజారిందన్న కోపంతో హైపథ్లాన్ అథ్లెట్ స్వప్న బర్మ..  తోటి అథ్లెట్, తెలంగాణ గురుకుల యువతి అగసర నందినిపై సంచలన ఆరోపణలు చేసింది. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణకు దిగింది. హైపథ్లాన్ పోటీల్లో ఓడిన ఆమె.. గెలిచిన నందిని ఒక ట్రాన్స్‌జెండర్ అని ఆరోపించింది.

ఆసియా క్రీడల్లో భాగంగా జరిగిన హెప్తథ్లాన్ పోటీల్లో స్వప్న బర్మ 57.08 పాయింట్లు సాధించగా.. అగసర నందిని 57.12 పాయింట్లు సాధించి రజత పతకం గెలుచుకుంది. దీంతో పతకం రాలేదన్న బాధలో స్వప్న.. నందినిపై వ్యక్తిగత ఆరోపణలు చేసింది. తాను.. ఒక ట్రాన్స్‌జెండర్ చేతిలో ఓడిపోయానంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. అయితే ఆ ట్వీట్‌లో ఎక్కడా నందిని పేరు ప్రస్తావించనప్పటికీ.. ఆమె అని స్పష్టమవుతోంది.

ఆ ట్వీట్ వివాదాస్పదం అవుతుండడంతో కాసేపటి అనంతరం ఆమె సదరు పోస్ట్‌ తొలగిం చింది. కానీ అప్పటికే జరగాల్సిన  నష్టం జరిగిపోయింది. సోషల్ మీడియాలో సదరు ట్వీట్ స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి. అథ్లెటిక్స్ నియమావళి ప్రకారం.. తోటి అథ్లెట్లను నేరుగా విమర్శించడం లేదా ఆరోపణలు చేయడం తగదు. అయితే ఆ రూల్స్ అతిక్రమించిన ఆమెపై అథ్లెటిక్ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.