
న్యూఢిల్లీ: ఆసియన్ పెయింట్స్ నికరలాభం (కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో ఏడాది లెక్కన 5.87 శాతం తగ్గి రూ.1,117.05 కోట్లకు చేరుకుంది. కంపెనీ డెకరేటివ్ పెయింట్‌కు డిమాండ్ తగ్గడమే ఇందుకు ముఖ్య కారణం. ఏషియన్ పెయింట్స్ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, గత ఏడాది ఏప్రిల్--–జూన్ కాలంలో కంపెనీ రూ.1,186.79 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. జూన్ క్వార్టర్లో అమ్మకాల నుంచి దాని ఆదాయం స్వల్పంగా రూ.8,924.49 కోట్లకు తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ.8,943.24 కోట్లుగా ఉంది.
మొత్తం ఖర్చులు జూన్ క్వార్టర్లో రూ.7,658.95 కోట్లుగా ఉన్నాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 1.32 శాతం ఎక్కువ. ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయంతో సహా దాని మొత్తం ఆదాయం జూన్ క్వార్టర్లో రూ.9,131.34 కోట్ల వద్ద స్థిరంగా ఉంది. స్టాండెలోన్ విధానంలో ఆదాయం 1.19 శాతం తగ్గి రూ.7,848.83 కోట్లకు చేరుకుంది. డెకరేటివ్ వ్యాపారం (భారతదేశం) 3.9 శాతం వృద్ధిని నమోదు చేసినప్పటికీ, ఆదాయం 1.2 శాతం తగ్గింది. స్థూల-ఆర్థిక అనిశ్చితులు, రుతుపవనాల ప్రారంభం కారణంగా డిమాండ్ పడిపోయింది. ఆసియన్ పెయింట్స్ తన ఆదాయంలో ఎక్కువ మొత్తం, అంటే 80 శాతానికి పైగా, దాని గృహ అలంకరణ వ్యాపార విభాగం నుంచి వస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లో వృద్ధి
కంపెనీ అంతర్జాతీయ వ్యాపారం నుంచి అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే 8.4 శాతం పెరిగి రూ. 679.1 కోట్ల నుంచి రూ. 736.1 కోట్లకు చేరుకున్నాయి. ఆసియా మార్కెట్లు, యూఏఈ, ఈజిప్టు మార్కెట్ల నుంచి భారీగా ఆదాయం వచ్చింది. జూన్‌లో రుతుపవనాల వేగం మందగించిందని, పట్టణ కేంద్రాల నుంచి స్వల్పంగా డిమాండ్ పెరగడంతో పెయింట్ పరిశ్రమ ఈ క్వార్టర్లో స్వల్ప వృద్ధిని నమోదు చేసిందని మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అమిత్ సింగల్ అన్నారు.
అమ్మకాలు మార్కెటింగ్ పెట్టుబడులు పెరగడం వల్ల ఈ క్వార్టర్లో నిర్వహణ మార్జిన్లు గత ఏడాదితో పోలిస్తే కొద్దిగా తగ్గాయని ఆయన అన్నారు. రిటైల్ వినియోగం తగ్గడం వల్ల గృహ అలంకరణ వ్యాపారం నెమ్మదించిందని వివరించారు. అంతర్జాతీయంగా, ఈ పోర్ట్‌ఫోలియో 11.1 శాతం ఆదాయ వృద్ధితో (స్థిర కరెన్సీ పరంగా 20.4 శాతం) బలమైన పనితీరును కనబరిచింది, మిడిల్ఈస్ట్, దక్షిణాసియాలోని అన్ని కీలక మార్కెట్లు బాగా పనిచేశాయని అమిత్పేర్కొన్నారు. మంగళవారం ఆసియన్ పెయింట్స్ షేర్లు బీఎస్‌ఈలో రూ. 2,401.70 వద్ద స్థిరపడ్డాయి. ఇది మునుపటి ముగింపు కంటే 1.81 శాతం పెరిగాయి.