గంజాయి సాగు చేస్తే పథకాలు ఆపేస్తాం

గంజాయి సాగు చేస్తే పథకాలు ఆపేస్తాం

ఆసిఫాబాద్, వెలుగు: గంజాయి సాగు చేసే వారికి ప్రభుత్వ పథకాలను ఆపేస్తామని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే హెచ్చరించారు. గంజాయికి అలవాటు పడిన వారిని గుర్తించి పునరావాస కేంద్రానికి తరలించాలని చెప్పారు. బుధవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఏఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి జిల్లాలో డ్రగ్స్​నియంత్రణపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసిఫాబాద్ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించారు. హాస్టళ్లు, కళాశాలల వద్ద ప్రత్యేకంగా నిఘా ఉంచాలని, టోల్ ప్లాజాల వద్ద తనిఖీలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో, విద్యాసంస్థలలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల జరిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్  మాట్లాడుతూ.. గంజాయి సాగు, రవాణా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు 69 కేసులు నమోదు చేసి 120 మందిని జైలుకు పంపించినట్లు పేర్కొన్నారు.  

మాస్టర్ ప్లాన్ కు సమాచారం ఇవ్వాలి 

అమృత్ 2.0 పథకం కింద ఎంపికైన కాగజ్ నగర్ మున్సిపాలిటీకి సంబంధించి మాస్టర్ ప్లాన్ కోసం అధికారులు సమగ్ర సమాచారం ఇవ్వాలని కలెక్టర్​వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, వరంగల్ ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్​(ప్లానింగ్) మహిపాల్ తో కలిసి అధికారులతో మాస్టర్ ప్లాన్​రూపకల్పనపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మరో 50 సంవత్సరాలకు అవసరమైన రహదారులు, తాగునీరు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, చెరువుల అభివృద్ధి, బీపీఎల్​కుటుంబాలు, మురుగు ప్రాంతాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వివరాలు అందించాలని సూచించారు.