ఏ పార్టీలో చేరుదాం

ఏ పార్టీలో చేరుదాం
  • ఏ పార్టీలో చేరుదాం
  • ఆశావహుల చూపు ఇతర పార్టీల వైపు
  • ప్రధాన పార్టీల పూర్తి ప్రకటన తర్వాత నిర్ణయం 
  • గుర్తింపు ఉన్న పార్టీల్లో చేరేందుకు ఇంట్రెస్ట్
  • ఇండిపెండెంట్​గానూపోటీ చేసేందుకు రెడీ 
  • ముందుగానే కేడర్​తోనూ ముమ్మర చర్చలు  

హైదరాబాద్, వెలుగు :  గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని ఆశావహులు ఇతర పార్టీల్లోకి వెళ్లి పోటీ చేశారు. కొందరు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోగా, మరికొందరు భారీగానే ఓట్లను రాబట్టుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా గ్రేటర్ పరిధిలో ప్రధాన పార్టీల నుంచి టికెట్లు దొరకని ఆశావహులంతా ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. గోషామహల్, నాంపల్లి మినహా ఇప్పటికే బీఆర్ఎస్​ అభ్యర్థులను ఖరారు చేసి బీ ఫామ్​లు కూడా అందజేసింది.  ఉప్పల్​లో తప్ప అన్నిచోట్ల సిట్టింగ్​లనే బరిలోకి దించింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు కాంగ్రెస్ లో చేరడంతో అక్కడ అధికార పార్టీ అభ్యర్థిగా మంత్రి మల్లారెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది.

 పటాన్​ చెరు, ఉప్పల్, ఎల్​బీనగర్, శేరిలింగంపల్లి, అంబర్ పేట్, ముషీరాబాద్ ప్రాంతాల్లో ఆశావహులు అవసరమైతే పార్టీని వీడేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. తాజాగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, హఫీజ్ పేట కార్పొరేటర్ పూజిత దంపతులు కాంగ్రెస్​లో చేరిపోయారు. ఇంకొందరు నేతలు ఇతర పార్టీలతో టచ్ లోకి వెళ్లారు. కాంగ్రెస్​ ఫస్ట్ లిస్ట్ విడుదల చేయగా.. బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఆయా పార్టీలు పూర్తిగా పేర్లను ప్రకటించిన తర్వాత జంపింగ్​లు జోరుగా పెరిగే అవకాశం ఉంది. 

ఆ మూడు పార్టీల్లోనే..

టికెట్లు రాకపోతే చివరి క్షణాల్లో ఎటుపోవాలో అర్థం కాకపోవడం, ఇండిపెండెంట్​గా పోటీ చేస్తే గుర్తులను ప్రజల్లో తీసుకెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇదే జరుగుతున్నది. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్​, బీజేపీ నుంచి టికెట్లు ఆశించిన, రాని వారు ఎలాగైనా బరిలో ఉండాలనుకునే వారు బీఎస్పీ (ఏనుగు గుర్తు)​, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (సింహం గుర్తు), యుగ తులసి (రోడ్ రోలర్ గుర్తు ) పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో ఆయా పార్టీల సింబల్స్​కు అభ్యర్థుల నుంచి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇందులో బీఎస్పీ నుంచి టికెట్లను ఆశిస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. ఆ పార్టీ ఇప్పటికే 20 మంది అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ప్రధాన పార్టీల ఆశావహుల్లో రోజురోజుకు టెన్షన్ పెరుగుతుంది. 

 ముందుగానే కేడర్ తో చర్చలు

పార్టీలు మారేందుకు సిద్ధమయ్యే లీడర్లు ముందుగానే కేడర్​తో చర్చలు జరుపుతున్నారు. టికెట్ రాకపోతే ఏ పార్టీలోకి వెళ్లాలని కొందరు ఆలోచన చేస్తుండగా.. మరికొందరు ఏ పార్టీ నుంచి కాకుండా ఇండిపెండెంట్​గా  పోటీ చేసి తమ సత్తాను చూపింపించాలని 
భావిస్తున్నారు. మొత్తానికి ఎన్నికల బరిలో ఉండేందుకే సిద్ధంగా ఉన్నట్లు ఆయా పార్టీ
లకు చెందిన పలువురు లీడర్లు అంటున్నారు. ఈసారి ఎక్కువగా ఎల్​బీనగర్, ఉప్పల్, పటాన్​ చెరు, శేరిలింగంపల్లి, మహేశ్వరం, అంబర్ పేట, ముషీరాబాద్ తదితర స్థానాల్లో ఆశావహులు ఎక్కువగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

2018లో టికెట్ దక్కని నేతలు వేరే పార్టీలకు వెళ్లి..

2018 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఆశించిన నేతలకు దక్కకపోవడంతో  వేరే పార్టీల్లోకి వెళ్లి పోటీ చేశారు. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ ​నుంచి ఇబ్రహీంపట్నం టికెట్ ఆశించిన మల్​రెడ్డి రంగారెడ్డికి ఆ టికెట్ దక్కలేదు. దీంతో ఆయన బీఎస్పీ నుంచి పోటీచేసి 376 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీఆర్ఎస్​నుంచి ఖైరతాబాద్ టికెట్ ఆశించిన మన్నె గోవర్ధన్ రెడ్డి కూడా బీఎస్పీ నుంచి పోటీ చేసి 4వేలకుపైగా ఓట్లు సాధించారు. బీఆర్ఎస్​ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి రాజేంద్రనగర్ టికెట్ ఆశించగా దక్కలేదు. దీంతో ఆయన ఆలిండియా ఫార్వర్డ్​ బ్లాక్ నుంచి పోటీ చేసి 13,084 ఓట్లు తెచ్చుకున్నారు. ఇలా ఇంకొన్ని ప్రాంతాల్లోనూ టికెట్లను ఆశించిన వారు బీఎస్పీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్​ల నుంచి పోటీ చేశారు. ఈసారి కూడా ఇదే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.