వరదలతో అస్సాం అతలాకుతలం .. 24.5 లక్షల మందిపై ప్రభావం

వరదలతో అస్సాం అతలాకుతలం .. 24.5 లక్షల మందిపై ప్రభావం
  • ఉప్పొంగుతున్న నదులు..డేంజర్ మార్క్ దాటి ప్రవాహం
  • కొండచరియలు విరిగిపడి,తుఫాన్ తో 64 మంది మృతి

గువహటి: ఈశాన్య రాష్ట్రం అస్సాంను వరదలు వదలట్లేదు. తుపాన్, ఎడతెరిపిలేని వానలతో బ్రహ్మపుత్ర నది, దాని ఉపనదులు ఉప్పొంగడంతో మరోసారి వరద బీభత్సం సృష్టించింది. నదులన్నీ డేంజర్​ మార్క్​ను దాటి ప్రవహిస్తుండడంతో జనజీవనం అతలాకుతలమైంది. 30 జిల్లాల్లో 24.5 లక్షల మందిపై ఈ ప్రభావం పడినట్టు అధికారులు శనివారం విడుదల చేసిన బులెటిన్​లో వెల్లడించారు. బ్రహ్మపుత నదితో పాటు దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రహిస్తున్నాయి. బరాక్​ నది, ఉపనదులు ధలేశ్వరి, ఘర్మురా, కటఖల్ ​కూడా ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి.

ఇప్పటివరకూ 64 మంది మృత్యువాత

కామ్​రూప్ జిల్లాలో కొండచరియలు విరిగిపడడంతో ఓ చిన్నారి సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వరదలు, కొండచరియలు విరిగిపడడం, తుపానుల కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 64కి చేరింది. అలాగే, 225 రోడ్లు, 10 బ్రిడ్జిలు దెబ్బతిన్నాయని, 63,490 హెక్టార్ల పంటలు నీట మునిగాయని అధికారులు వెల్లడించారు.

పరిస్థితిపై సీఎం హిమంత బిశ్వశర్మ సమీక్ష

వరదలతో తీవ్రంగా ప్రభావితమైన దిబ్రూగఢ్​ జిల్లాలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిబ్రూగఢ్​లో పర్యటించిన తర్వాత అస్సాం ఆరోగ్య నిదియా హెల్త్​ ఫైనాన్షియల్​ అసిస్టెంట్​ స్కీమ్​తోపాటు ఇతర అంశాలపై రివ్యూ చేసినట్టు చెప్పారు. పరిస్థితి అదుపులోకి వచ్చిందని, అందరినీ  కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం శ్రమిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 612 సహాయక శిబిరాల్లో  47,103 మంది వరద బాధితులు  ఆశ్రయం పొందుతున్నారని, నాన్ రిలీఫ్ క్యాంపుల్లో ఉన్న 4,18,614 మంది ఖైదీలకు సహాయక సామగ్రిని అందించినట్టు చెప్పారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి తన బృందంతో కలిసి పనిచేస్తున్నట్టు సీఎం హిమంత తెలిపారు. 

మురుగు కాలువలో కొడుకు కోసం తండ్రి వెదుకులాట

అస్సాంలో వరదలు పలువురికి తీరని విషాదాన్ని మిగిల్చాయి. 3 రోజుల క్రితం గువహటిలో హీరాలాల్​ సర్కార్​ అనే వ్యక్తి స్కూటర్​పై వెళ్తుండగా ఆయన కొడుకు అభినాశ్ డ్రైనేజీలో పడిపోయాడు. కొడుకు కోసం మూడు రోజులుగా తండ్రి అక్కడే ఉండి వెతుకుతున్నాడు. రాత్రిపూట ఓ షాపు వరండాలో దోమతెర కట్టుకుని పడుకుంటున్నాడు. గురువారం కాలువలో తన కొడుకు చెప్పులు దొరికాయని, వాటిని పోలీసులకు అందజేశానని చెప్పాడు. కొడుకు లేకుండా ఇంటికి ఎలా వెళ్లాలి అంటూ కన్నీటి పర్యంతమవుతున్నాడు.