ఆ మూడు రాష్ట్రాల్లోనే పోటీ...త్వరలో అభ్యర్థుల లిస్ట్

ఆ మూడు రాష్ట్రాల్లోనే పోటీ...త్వరలో అభ్యర్థుల లిస్ట్

ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ..మిగతా రాష్ట్రాల్లో పాగా వేసేందుకు పక్కా ప్రణాళికను సిద్దం చేసుకుంటోంది. ఇందులో భాగంగా మినీ సార్వత్రిక ఎన్నికలు భావించే ఐదు రాష్ట్రాల్లో పోటీకి సై అంటోంది. అక్టోబర్ 9వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన నేపథ్యంలో..ఏ ఏ రాష్ట్రాల్లో పోటీ చేయబోతున్నామని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. 

ఆమ్ ఆద్మీ పార్టీ మూడు రాష్ట్రాల్లో పోటీ చేయబోతుందని అరవింద్ కేజ్రీవా్  వెల్లడించారు. ఛత్తీస్ ఘడ్ , రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పోటీకి సిద్దమని కేజ్రీవాల్ ప్రకటించారు. వీలైనంత త్వరగా ఈ రాష్ట్రాలలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. 

మరోవైపు ఆప్ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. అయితే ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ అధికారంలో ఉంది.  ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో  ఈ మూడు రాష్ట్రాల్లో ఆప్ కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తుందా..లేక ఒంటరిగా బరిలోకి దిగుతుందా అన్నది తెలియాల్సి ఉంది.