చేరికలపై నజర్​.. అసంతృప్తులపై పార్టీల ఫోకస్

చేరికలపై నజర్​.. అసంతృప్తులపై పార్టీల ఫోకస్

కామారెడ్డి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు  చేరికలపై నజర్​ పెట్టాయి. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్​లు ప్రత్యర్థి ​పార్టీల్లో ఉన్న అసంతృప్తులను తమ వైపు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక పార్టీలో ఉన్న లీడర్​మరో పార్టీలోకి చేరగానే, ఆ పార్టీ నుంచి ఇంకో లీడర్​ను తమవైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు. జిల్లాలోని మిగతా నియోజకవర్గాల కంటే కామారెడ్డి నియోజకవర్గంలో చేరికలు ఎక్కువగా జరుగుతున్నాయి. తమ పార్టీలోకి వస్తే మంచి భవిష్యత్​ ఉంటుందంటూ భరోసా కల్పిస్తున్నారు. కుల సంఘాల ప్రతినిధులతోనూ ఆయా పార్టీల లీడర్లు టచ్​లో ఉంటున్నారు.

కారెక్కిస్తున్నారు..

కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్​ నియోజకవర్గాల్లో ఆయా పార్టీలకు చెందిన లీడర్లు బీఆర్ఎస్​లో చేరుతున్నారు. మండల, గ్రామ స్థాయిలో పట్టున్న లీడర్లు, ప్రతిపక్ష పార్టీల్లో కొనసాగుతున్న ప్రజాప్రతినిధులను తమ వైపు ఆకర్షించి గులాబీ కండువాలు కప్పుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని మద్దికుంటకు చెందిన బీజేపీ ఎంపీటీసీ ఇటీవల బీఆర్ఎస్​లో చేరారు. బీబీపేట, దోమకొండ, భిక్కనూరు, రాజంపేట మండలాలకు చెందిన పలువురు కాంగ్రెస్​ లీడర్లు సైతం బీఆర్ఎస్​లో  చేరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలకు చెందిన కొందరు స్థానిక ఎమ్మెల్యే సమక్షంలో  బీఆర్ఎస్​ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్​ లీడర్లు మండల, గ్రామ స్థాయిల్లో పలుకుబడి ఉన్నవారిపై ఫోకస్​చేస్తున్నారు.  

హస్తం గూటికి రావాలని..

కాంగ్రెస్​ పార్టీలోనూ బీఆర్ఎస్, బీజేపీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేయగలిగే వ్యక్తుల కోసం అన్వేషిస్తున్నారు. అనివార్య కారణాల వల్ల పార్టీని వీడినవారిని తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గం వ్యాప్తంగా మాజీమంత్రి, కాంగ్రెస్​నేత షబ్బీర్​అలీ విస్తృతంగా పర్యటిస్తూ, తిరిగి హస్తం గూటికి రావాలని గతంలో కాంగ్రెస్​లో కొనసాగిన వారిని కోరుతున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలతో పాటు, టౌన్​కు చెందిన ఆయా పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరారు. ఎల్లారెడ్డిలోనూ పలు మండలాలకు చెందిన గ్రామస్థాయి కార్యకర్తలు హస్తం గూటికి  చేరారు. టికెట్​ఆశిస్తున్న మదన్​మోహన్​రావు, వడ్డేపల్లి సుభాష్​రెడ్డి పోటాపోటీగా ఇతర పార్టీల కార్యకర్తల్ని కాంగ్రెస్​లోకి రప్పిస్తున్నారు. 

యూత్​పై బీజేపీ ఫోకస్​..

బీజేపీ కూడా చేరికలపై ఫోకస్ పెట్టింది. ప్రధానంగా యూత్​పై దృష్టి సారించింది. కామారెడ్డి నియోజక వర్గంలోని ఆయా మండలాలతో పాటు, టౌన్​కు చెందిన పలువురు బీజేపీలో చేరారు. నియోజకవర్గ ఇన్​చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి   సమక్షంలో యువకులతో పాటు, మహిళలు కూడా బీజేపీలో చేరారు. పార్టీ జిల్లా ప్రెసిడెంట్​ అరుణతార, జుక్కల్​ టికెట్​ను ఆశిస్తూ.. అక్కడ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జుక్కల్, మద్నూర్, బిచ్కుంద మండలాలకు చెందిన పలువరు యువకులు బీజీపీలో చేరారు. ఆయా చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్​లో ఉన్న అసంతృప్తులు ఆమెతో టచ్​లో ఉంటున్నారు.