
బెంగళూరు: ఆయనో సాధారణ క్లర్క్. జీతం నెలకు రూ.15 వేలు. కానీ ఆస్తులు మాత్రం కోట్లలో కూడబెట్టాడు. పదుల సంఖ్యలో ఇండ్లు, ఎకరాలకొద్దీ భూములు సంపాదించాడు. ఆదాయంతో పొంతనలేనన్ని ఆస్తులు అక్రమంగా పోగేశాడు. లోకాయుక్త అధికారుల తనిఖీల్లో ఈ విషయాలు బయటపడ్డాయి. అతడి ఇండ్లలో సోదాలు చేసి రూ.30 కోట్లకు పైగా ఆస్తులు, బంగారం, వెండి గుర్తించారు.
నకిలీ బిల్లులు పెట్టి 72 కోట్లు కొల్లగొట్టిండు
కర్నాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన కలకప్ప నిడగుండి కర్నాటక గ్రామీణ అభివృద్ధి బ్యాంకులో క్లర్క్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఉద్యోగిగా ఆయన అందుకున్న చివరి జీతం రూ.15 వేలు మాత్రమే. అయితే, ఇంజనీర్‌గా పనిచేసిన చిన్‌చోల్కర్‌తో కలిసి కలకప్ప తన సర్వీస్ కాలంలో అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. మొత్తం 96 ప్రాజెక్టులకు నకిలీ పత్రాలు, డూప్లికేట్ బిల్లులు క్రియేట్ చేసి, రూ.72 కోట్లకుపైగా ఆస్తులు దుర్వినియోగం చేశాడన్న ఆరోపణలున్నాయి.
ఈ ఆరోపణలతో లోకాయుక్త అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఆయన ఇంట్లో తనిఖీలు చేయగా 30 కోట్లకుపైగా విలువైన ఆస్తులు కూడగట్టినట్లు గుర్తించారు. ఆయన పేరిట 24 ఇండ్లు, నాలుగు ఓపెన్ ప్లాట్లు, 40 ఎకరాలు వ్యవసాయ భూమి ఉన్నట్లు కనిపెట్టారు. భార్య, సోదరుడి పేరిటా ఉన్న పలు ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 350 గ్రాముల బంగారం, కిలోన్నర వెండి లభ్యమైంది. కోటి రూపాయలు విలువ చేసే రెండు కార్లు, రెండు బైకులు అధికారులు జప్తు చేశారు. మాజీ క్లర్క్ కలకప్ప నిడగుండిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.