పేదోళ్ల భూములపై పడ్డరు

పేదోళ్ల భూములపై పడ్డరు
  • పార్కుల కోసం అసైన్డ్​ ల్యాండ్స్​ గుంజుకుంటున్న సర్కారు 
  • బాధితుల్లో దళితులే ఎక్కువ ..రాష్ట్రవ్యాప్తంగా 7,920 ఎకరాలను సేకరిస్తున్న ఆఫీసర్లు 
  • గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములు ఇప్పుడు బలవంతంగా స్వాధీనం 
  • అడ్డుకుంటే క్రిమినల్​ కేసులు పెడ్తామని బెదిరింపులు
  • పోలీసుల బందోబస్తు నడుమ మొక్కలు నాటుతున్నరు

మంచిర్యాల, వెలుగు: విలేజ్​పార్కులు, అర్బన్​ పార్కుల కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం పేదల భూములను గుంజుకుంటున్నది. దశాబ్దాల కింద దళిత, గిరిజన, బలహీన వర్గాలకు పంచిన అసైన్డ్​ భూముల నుంచి వాళ్లను అధికారులు బలవంతంగా వెళ్లగొడుతున్నారు. ఈ భూముల్లో సాగుచేయడం లేదని, పట్టా పాస్​బుక్​లు లేవని, రెవెన్యూ రికార్డుల్లో కనిపించడం లేదని, ధరణిలోకి ఎక్కలేదని.. ఇలా రకరకాల కారణాలు చెప్పి స్వాధీనం చేసుకుంటున్నారు. కొన్ని చోట్లయితే  పాస్​బుక్కులు ఉన్నా  వదలడం లేదు. పేదలు మర్లవడితే.. గవర్నమెంట్​ ల్యాండ్​ కబ్జా చేశారని క్రిమినల్​ కేసులు పెట్టి జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారు. పోలీస్​ బందోబస్తు పెట్టి, ఫెన్సింగ్​లు వేసి, ట్రెంచ్​లు తవ్వి, మొక్కలు నాటిస్తున్నారు. తాతలు తండ్రుల కాలం నుంచి ఎకరం, రెండెకరాలను నమ్ముకొని బతుకుతున్న పేదలను, ముఖ్యంగా దళితులను సర్కారు రోడ్డుపాలు చేస్తోంది. 
రాష్ట్రవ్యాప్తంగా 7,920 ఎకరాలు
మండలం, మున్సిపాలిటీలో ప్రజలకు అనుకూలంగా ఉన్న చోట ఎక్కడైనా పదెకరాల్లో మెగా పార్క్​లను డెవలప్​ చేయాలని సర్కారు నిర్ణయించింది. భూములున్నచోట పదెకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో కూడా పార్క్​లను ఏర్పాటు చేయవచ్చని చెప్పింది. ఎకరానికి మూడు వేల చొప్పున 30 వేల మొక్కలు నాటడంతో పాటు మధ్యలో ఖాళీ స్థలాలు ఉండేలా పార్క్​లను అధికారులు డిజైన్​ చేశారు. ఉపాధి హామీ పథకం కింద ఒక్కో పార్క్​కు రూ. 43 లక్షలు ​కేటాయించారు. 592 మండలాల్లోని 5,920 ఎకరాలు, 128 మున్సిపాలిటీల్లో 1,280 ఎకరాల భూములు అవసరం. పార్క్​ల కోసం మండలాల్లో రూ. 254.56 కోట్లు ఖర్చవుతుండగా, మున్సిపాలిటీల్లో రూ.40 కోట్ల నుంచి 50 కోట్లు కేటాయించారు.
లీడర్లు కబ్జా చేసినవి వదిలి.. 
వందల ఎకరాల గవర్నమెంట్​ ల్యాండ్స్​ లీడర్ల కబ్జాల్లో, కోర్టు కేసుల్లో ఉన్నాయి. వాటి జోలికి ఆఫీసర్లు వెళ్లడం లేదు. గత ప్రభుత్వాలు వివిధ వర్గాల పేదలకు ఇచ్చిన భూములపై ఆఫీసర్లు దృష్టిపెట్టారు. ఎక్కడెక్కడ అసైన్డ్​​ భూములున్నాయో లెక్కలు తీస్తున్నారు. చాలామందికి దశాబ్దాల కిందట అసైన్​​ చేసిన భూములకు ఫైనల్​ పట్టా ప్రొసీడింగ్స్​ ఉన్నప్పటికీ... పట్టా పాస్​బుక్​ లేవు. కొంతమందికి అసైన్​మెంట్​ ప్రొసీడింగ్స్​ లేకున్నా తాతలు తండ్రుల కాలం నుంచి సర్కారు భూములను సాగుచేసుకుంటున్నారు. ఇటువంటి భూములను గుర్తించిన ఆఫీసర్లు పట్టాలు లేవని, రెవెన్యూ రికార్డుల్లో లేరని, ధరణిలో నమోదు కాలేదని, సాగులో లేరని చెప్పి భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. అసైన్డ్​ భూములను పంపిణీ చేసినప్పటి నుంచి మూడేండ్లలో సాగు చేయకుంటే వాటిని స్వాధీనం చేసుకోవచ్చు. కానీ అసైనీలకు నోటీసులు కూడా ఇవ్వకుండా భూములను గుంజుకుంటున్నారు. బాధితుల్లో చాలా మంది దళితులు, గిరిజనులే ఉన్నారు. మరికొన్ని చోట్ల గీతకార్మికులకు, ఇతర కులవృత్తుల వాళ్లకు ఇచ్చిన భూములను కూడా లాక్కుంటున్నారు. 
పట్టాపాస్​ బుక్​లు ఉన్నా స్వాధీనం
మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో 22 ఎకరాలను 1985లో 20 మంది దళిత, గిరిజన పేదలకు ఎకరం చొప్పున అసైన్​​ చేశారు. వారికి ఫైనల్​ పట్టా ప్రొసీడింగ్స్​ జారీ చేశారు. అప్పటినుంచి భూములు సాగుచేసుకుంటున్న పేదలు పట్టా పాస్​బుక్​ల కోసం పలుమార్లు దరఖాస్తులు పెట్టుకున్నారు. పాస్​బుక్​లు పొందినవాళ్లు వాటిని బ్యాంకుల్లో పెట్టి క్రాప్​లోన్లు కూడా తీసుకున్నారు. 1​బీ రికార్డుల్లోనూ ఉన్నారు. కానీ ఈ భూములను సాగుచేయడం లేదని చెప్పి గత నెలలో బృహత్ ప్రకృతివనం కోసం గుంజుకున్నారు. పేదలు అడ్డం తిరిగితే పోలీస్ బందోబస్తు పెట్టి ఫెన్సింగ్ వేసి, ట్రెంచ్ తవ్వి, మొక్కలు నాటుతున్నారు. దళిత ఎమ్మెల్యే బాల్క సుమన్ తమకు అన్యాయం చేశారని పేదలు మండిపడుతున్నారు. 
ఎల్లంపల్లి భూముల్లోనూ పార్క్​లు
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం రైతుల నుంచి సేకరించిన భూముల్లో పార్కులు ఏర్పాటు చేస్తుండటం వివాదాస్పదంగా మారింది. గుళ్లకోటలోని ఎల్లంపల్లి భూములను ఒక టీఆర్​ఎస్​ లీడర్​ కబ్జా పెట్టి చేపల చెరువులు చేశాడు. ఆ భూముల వైపు కన్నెత్తి చూడని ఆఫీసర్లు.. పక్కనే ఉన్న పోతపల్లిలోని భూముల్లో  పార్క్​ఏర్పాటు చేస్తున్నారు. ఎల్లంపల్లి భూములను ఆఫీసర్లు ఎంపిక చేయగా, రైతులు అడ్డుకున్నారు. ముంపు లేనందున ఆ భూములను సాగు చేసుకుంటున్న రైతులను వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 
ఇండ్ల స్థలాలకు ఇచ్చిన భూమిని గుంజుకున్నరు
మంచిర్యాల జిల్లా క్యాతన్​పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11, 31 సర్వేనంబర్లలో గల 40 ఎకరాలల్లో 1985లో బొక్కలగుట్ట గ్రామానికి చెందిన పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించారు. అప్పుడు అనుకూలంగా లేకపోవడంతో ఇండ్లు కట్టుకోలేదు. ఖాళీగా ఉన్న ఈ భూమిలో ప్రస్తుతం 27.29 ఎకరాలు మాత్రమే ఉంది. ఇందులో ఇప్పటికే పల్లె ప్రకృతివనం, శ్మశానవాటిక నిర్మించిన ఆఫీసర్లు, ఇటీవల పదెకరాల్లో బృహత్​ ప్రకృతివనం ఏర్పాటు చేశారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పంచాయతీలో ఎస్సీ కాలనీ కోసం గతంలో గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్​ను ప్రస్తుతం మెగా పార్క్ కోసం కేటాయించడంపై దళితులు తహసీల్దార్​ ఆఫీస్​ ఎదుట ధర్నా చేశారు. సిద్దిపేట రూరల్‌‌‌‌ మండల పార్క్​ను రాఘవాపూర్​లోని 982 సర్వే నెంబరులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇదే సర్వే నెంబర్​లో ఎనిమిది మంది గొల్లకుర్మలకు పశువుల వేత కోసం పదేండ్ల కిందట పట్టా సర్టిఫికెట్లు జారీ చేయగా, మరో  ఏడుగురు ఎస్సీ రైతులకు ఎనిమిది ఎకరాలు కేటాయించారు. ఇటీవల పార్క్ ఏర్పాటు స్థల పరిశీలనకు వెళ్లగా గొల్లకుర్మలు, రైతులు అభ్యంతరం తెలుపడంతో వారి పట్టా కాపీలు తీసుకుని వెళ్లిపోయారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో 2008–09లో దళితులకు కేటాయించిన భూములను ఆఫీసర్లు లాక్కున్నారు. దీంతో పార్క్​ పనులను అక్కడివాళ్లు అడ్డుకున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పాటిమీదగుంపు గ్రామంలో బచ్చుల కోటేశ్వరరావు  కుటుంబాలకు తొమ్మిది ఎకరాల ఆర్​వోఎఫ్​ఆర్ పట్టా ఇచ్చారు. అందులో నాలుగున్నర ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. మిగిలిన భూమిలో పశువులు మేపుకుంటున్నారు. ఇందులో పార్క్​ ఏర్పాటుపై రైతు కుటుంబీకులు ఆందోళనకు దిగారు.

మా భూమి మాకే కావాలె...
మా ఊరి గౌడ కులస్తులకు 2011లో 295 సర్వేనంబర్లో ఈత, తాటి వనాలు పెంచడానికి భూమి ఇచ్చిన్రు. 2011, 2013, 2018లో పట్టా చేయాలని రెవెన్యూ ఆఫీసర్లను కలిసినా పట్టించుకోలేదు. ఇప్పుడు మెగా పార్క్​ కోసం స్వాధీనం తీసుకుంటున్రు. పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు వచ్చి ట్రెంచ్ వేయాలని ప్రయత్నిస్తే అడ్డుకున్నం. మా భూమి మాకు కావాలె.
                                                                                                                                                                                    - పూరేళ్ల శ్రీనివాస్, ముప్పిరితోట, పెద్దపల్లి జిల్లా     

దళిత ఎమ్మెల్యేనే అన్యాయం చేసిండు... 
భీమారంలో 1984లో 40 మంది దళిత, గిరిజన పాలేర్లతోటి పాలేర్ల సంఘం ఏర్పడ్డది. ఇందులో ఉన్న 20 మందికి  138 సర్వే నంబర్​లో అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ తలా ఎకరం భూమి అసైన్డ్​ చేసిండు. తర్వాత కొందరికి పాస్​బుక్​లు ఇచ్చి, మరికొందరికి ఇయ్యలే. ఆఫీసర్లకు ఎన్నిసార్ల దరఖాస్తు పెట్టినా పట్టించుకోలే. ఏండ్లుగా పంట పండించుకుంటున్న భూములను సాగులో లేవని గుంజుకున్నరు. దళితుడైన చెన్నూర్​ ఎమ్మెల్యే బాల్క సుమన్​ మా దళితులకే అన్యాయం చేసిండు. ​ 
                                                                                                                                                                                          ‑ సోత్కుల లచ్చయ్య, భీమారం, మంచిర్యాల జిల్లా

వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక శివారు సర్వేనంబర్ 213లో ఉన్న అసైన్డ్ భూమిని ఏండ్లుగా దళిత, గిరిజన రైతులు సాగు చేసుకుంటున్నారు. అందులో పార్క్ ఏర్పాటు కోసం అధికారులు రావడంతో ఈ భూమి గతంలోనే తమకు అసైన్​ చేశారంటూ పేపర్లు చూపిస్తున్న రైతులు. భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కోనంపేటలో మెగా విలేజ్​పార్కు పనుల కోసం వచ్చిన ఆఫీసర్లతో తమ భూములు తీసుకోవద్దంటూ వేడుకుంటున్న గిరిజనులు