భూమి దగ్గరగా భారీ గ్రహశకలం..

భూమి దగ్గరగా భారీ గ్రహశకలం..

ఉల్కలు, గ్రహశకలాలు, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు వంటి వాటితో ఖగోళం చాలా అందంగా కనిపిస్తుంది. కానీ, అప్పుడప్పుడు వాటి వల్ల ప్రమాదాలు కూడా ఏర్పడతాయి. తాజాగా ఒక భారీ గ్రహశకలం భూమి దగ్గరగా వచ్చి వెళ్లింది. నాసా శాస్త్రవేత్తల ప్రకారం.. 2016 AJ193 అనే గ్రహశకలం ఆగస్టు 21 రాత్రి భూమికి దగ్గరగా వెళ్లింది. ఇది దాదాపు 4,500 అడుగుల వ్యాసం కలిగి ఉండటం గమనార్హం. ఈ ఉల్క భూమి వైపు గంటకు 94,208 కిలోమీటర్ల వేగంతో దూసుకురావడంతో సైంటిస్టులలో కలవరం కలిగింది. 

ఈ గ్రహశకలం భూమి మరియు చంద్రుడి మధ్య తొమ్మిది రెట్లు దూరం నుంచి భూమిని దాటి వెళ్లింది. శాస్త్రవేత్తలు టెలిస్కోపులను ఉపయోగించి 1.4 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఉల్కను చూశారు. ఈ ఉల్క మళ్లీ 2063లో భూమికి దగ్గరగా వస్తుందని నాసా తెలిపింది. ఈ గ్రహశకలాన్ని జనవరి 2016లో హవాయిలోని హాలెకాల అబ్జర్వేటరీలో ఉన్న పనోరమిక్ సర్వే టెలిస్కోప్ సాయంతో గుర్తించారు. ఈ గ్రహశకలం ప్రతి 5.9 సంవత్సరాలకు ఒకసారి సూర్యుని చుట్టూ తిరుగుతుందని.. ఇది భూమి యొక్క కక్ష్యకు దగ్గరగా ఉంటుందని నాసా తెలిపింది. 

ప్రస్తుతం నాసా భూమికి సమీపంగా ఉన్న 26,000 గ్రహశకలాలను, వాటి గమనాన్ని పర్యవేక్షిస్తుంది. అయితే వీటిలో 1,000కి పైగా గ్రహశకలాలు ప్రమాదకరమైనవిగా నాసా పరిగణించింది.