విపరీతమైన చలి, దట్టమైన పొగమంచు.. ఢిల్లీకి రెడ్​ అలర్ట్

విపరీతమైన చలి, దట్టమైన పొగమంచు..  ఢిల్లీకి రెడ్​ అలర్ట్

న్యూఢిల్లీ: ఢిల్లీని చలి వణికిస్తున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. సిటీ శివారులోని ఆయానగర్ లో శుక్రవారం రాత్రి ఉష్ణోగ్రత 3 డిగ్రీలకు పడిపోయింది. ఈ సీజన్ లో ఇదే అత్యల్పమని వాతావరణ శాఖ శనివారం తెలిపింది. లోధి రోడ్ లో 3.4, సఫ్దర్ గంజ్ లో 3.6, రిడ్జ్ లో 3.9, పాలెంలో 5.8 డిగ్రీల చొప్పున అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొంది. మరోవైపు చలిగాలులకు తోడు సిటీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. 

దీంతో నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ కు రెడ్ అలర్ట్ ఇవ్వగా.. రాజస్థాన్ కు యెల్లో అలర్ట్ ఇచ్చింది. ఎన్సీఆర్ పరిధిలో మరో మూడ్రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. 

ఢిల్లీ, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లో చలిగాలులు, పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొంది. కాగా, వాతావరణ పరిస్థితుల కారణంగా శనివారం ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన, ఢిల్లీకి రావాల్సిన రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఢిల్లీ ఎయిర్ పోర్టులోనూ కొన్ని విమానాలు ఆలస్యమయ్యాయి.