క్లాస్ రూమ్‌లో లేడీ టీచర్ పై కత్తితో దాడి

క్లాస్ రూమ్‌లో లేడీ టీచర్ పై కత్తితో దాడి
  • కత్తిపోట్లతో తీవ్ర గాయాలు.. రాజమండ్రి ఆస్పత్రికి తరలింపు

పశ్చిమ గోదావరి జిల్లా: ఇరగవరం మండలం కాకిలేరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నాగలక్ష్మి అనే మహిళా టీచర్ పాఠాలు బోధిస్తుండగా ఓ వ్యక్తి తరగతి గదిలోకి చొరబడి కత్తితో ఎడాపెడా టీచర్ ను పొడిచేశాడు. ఆమె భయంతో కేకలు వేస్తూ కుప్పకూలింది. పిల్లలు కూడా భయపడి కేకలు వేయడంతో వెంటనే స్థానికులు హుటాహుటిన పరిగెత్తుకుని వచ్చి కత్తితో టీచర్ ను పొడిచేసిన వ్యక్తిని పట్టుకుని తాళ్లతో కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్ర రక్తగాయాలతో కుప్పకూలిన మహిళా టీచర్ నాగలక్ష్మిని స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రికి తరలించారు. మహిళా టీచర్ నాగలక్ష్మిని కత్తితో పొడిచింది స్వయానా ఆమె భర్తేనని తేలింది. గత కొంతకాలంగా తనను విడిచి దూరంగా ఉంటున్న భార్యపై కోపంతోనే ఆమె భర్త దుర్గాప్రసాద్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు చెబుతున్నాడు. నాగలక్ష్మి సొంతూరు ఇరగవరం మండలంలోని నారాయణపురం. 2016లో జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి చెందిన కడలి రామదుర్గా ప్రసాద్ తో పెళ్లి పెళ్లి జరిగింది. వీరికి మూడేళ్ల పాప ఉంది. రామదుర్గాప్రసాద్‌ ఊరిలో చిన్న కిరాణా దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. నాగలక్ష్మి ఇరగవరం మండలం కాకిలేరు మండల ప్రజాపరిషత్‌ ప్రత్యేక పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నారు. కొంత కాలంగా భార్యా భర్తల మధ్య విభేదాలతో తరచూ కొట్లాటలు జరుగుతున్నాయి. తన భర్త తీరుతో విసిగిపోయిన నాగలక్ష్మి ఉండ్రాజవరం, ఇరగవరం పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. తనపై పోలీసు కేసు పెట్టడంతో రామ దుర్గాప్రసాద్‌ మరింత కోపం పెంచుకోవడంతో నాలుగు నెలల క్రితం నాగలక్ష్మి తన కుమార్తెను తీసుకుని తూర్పు విప్పర్రులో ఉంటున్న తన బాబాయ్‌ దగ్గరకు వెళ్లింది. భర్తకు దూరంగా ఉండేందుకు బదిలీపై కాకిలేరు స్కూల్‌కు వచ్చింది. ఇవాళ శుక్రవారం క్లాస్‌రూమ్‌లో విద్యార్థులకు పాఠాలు చెబుతుండగా ఆమె భర్త రామ దుర్గాప్రసాద్‌ హఠాత్తుగా వచ్చి కత్తితో ఎడాపెడా పొడవడంతో నాగలక్ష్మి కేకలు వేస్తూ కుప్పకూలింది. అనూహ్య ఘటనతో పాఠాలు వింటున్న విద్యార్థులు భయంతో కేకలు వేయడంతో స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చారు. రక్తం కారుతున్న కత్తి, షర్టుకు రక్తం అంటిన రామదుర్గాప్రసాద్ ను చూసి వెంటపడి పట్టుకున్నారు. క్లాస్ రూమ్ లో రక్తగాయాలతో పడిఉన్న నాగలక్ష్మిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తీసుకెళ్లారు. చిన్న వ్యాపారంతో జీవిస్తున్న తన భర్త తన ఏటీఎం కార్డు కూడా తీసేసుకుని డబ్బులన్నీ వాడుకునేవాడని నాగలక్ష్మి విలపించింది. డబ్బు గురించి మాట్లాడితే తనను చంపేస్తానని భర్త దుర్గాప్రసాద్ బెదిరించేవాడని.. వేధింపులు భరించలేక భయపడి బదిలీపై వచ్చానని, దూరంగా ఉంటేనైనా మారతాడనుకుంటే అదే కోపంత తనను చంపడానికి స్కూల్‌కు వచ్చి దాడి చేశాడని బాధితురాలు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

For More News..

కశ్మీరీల డిమాండ్లను భారత్ నెరవేర్చాలి

గుర్తుంచుకోండి.. బెంగాల్‌లో గెలిచేది దీదీనే

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం

ఇంటి పనికి భార్యకు జీతమివ్వాల్సిందే.. కోర్టు సంచలన తీర్పు