అక్క స్థలం కొట్టేయడానికి నకిలీ పేపర్లు సృష్టించిన తమ్ముళ్లు

అక్క స్థలం కొట్టేయడానికి నకిలీ పేపర్లు సృష్టించిన తమ్ముళ్లు

నకిలీ పేపర్లు సృష్టించి అక్క పేరు మీదున్న స్థలాన్ని కాజేసేందుకు యత్నించిన ఇద్దరు తమ్ముళ్లు, తల్లి, చెల్లికి జైలు శిక్ష విధిస్తూ మల్కాజిగిరి కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే..కాకతీయనగర్​లో ఉండే లక్ష్మినారాయణకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. లక్ష్మినారాయణ తన పెద్ద కుమార్తె ఎ.అరుణ జ్యోతి(401) కోసం నేరెడ్ మెట్ వినోభానగర్ లో 160 గజాల స్థలాన్ని కొని 4 షటర్లు నిర్మించాడు. కొంతకాలం తర్వాత లక్ష్మినారాయణ చనిపోయాడు. దీంతో ఆ 4 షటర్లకు వచ్చే రెంట్ డబ్బులతో పాటు ఆ స్థలాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని అరుణ జ్యోతి పెద్ద తమ్ముడు సర్వేశ్​యాదవ్(38) ప్లాన్ వేశాడు.

అక్క జ్యోతి సంతకాలు ఫోర్జరీ చేసిన సర్వేశ్​ నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేయించి మరో తమ్ముడు నాగ సాయిమాధవ్(32)కి గిఫ్ట్ డీడీ కింద ఇస్తున్నట్టు తల్లి కళావతి(70), చెల్లి శ్రీదేవి(33)ల సాక్షి సంతకాలు చేయించుకున్నాడు. విషయం తెలుసుకున్న జ్యోతి తల్లి కళావతిని స్థలానికి సంబంధించిన ఒరిజినల్ పేపర్లు ఇవ్వాలని అడిగింది. దీంతో సర్వేశ్, సాయిమాధవ్, శ్రీదేవి అడ్డుపడి..పేపర్లు ఇవ్వడం కుదరదని..మరోసారి అడిగితే చంపేస్తామని జ్యోతిని బెదిరించారు.

జ్యోతి 2015 నవంబర్​ 3న నేరెడ్​మెట్​ పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు చార్జి షీట్​ఫైల్​చేసి కోర్టుకి అందించారు.  విచారణలో ఉన్న ఈ కేసులో.. సంతకాలు ఫోర్జరీ చేసి స్థలాన్ని లాక్కోడానికి ప్రయత్నించిన సర్వేష్​ యాదవ్, శ్రీదేవికు రూ.10 వేల ఫైన్, 3 ఏళ్ల జైలు, నాగ సాయి యాదవ్​, కళావతికి రూ.10 వేలు ఫైన్, ఏడాది జైలు శిక్ష ఖరారు చేస్తూ మల్కాజిగిరి 19వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చింది.