
- నకిరేకల్ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లో వసూళ్ల దందాపై ఆడియో వైరల్
- ట్రాన్స్‌ఫర్ చేశారన్న కోపంతో అవినీతిని బయటపెట్టిన అటెండర్
నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా నకిరేకల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో వసూళ్ల దందాపై ఆడియో వైరల్ అయింది. ఇల్లు రిజిస్ట్రేషన్‌కు రూ. 4 వేలు, ఫ్లాట్ రిజిస్ట్రేషన్‌కు రూ.5 వేలు వసూలు చేస్తూ, ఆఫీసర్లు వాటాలు పంచుకుంటున్నారని ఆఫీస్ అటెండర్ మాట్లాడిన మాటలు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే... వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి నకిరేకల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఔట్‌సోర్సింగ్ విధానంలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు రిజిస్ట్రేషన్‌కు వచ్చే వారి నుంచి వసూళ్లకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులు రావడంతో సబ్‌రిజిస్ట్రార్ అనూష గత నెల 28న జిల్లా రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని నాలుగు రోజుల కింద నల్గొండకు ట్రాన్స్‌ఫర్ చేశారు.
దీంతో ఆగ్రహానికి గురైన అటెండర్ నకిరేకల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో జరుగుతున్న వసూళ్ల దందాను మీడియాకు చెప్పాడు. ఆఫీస్‌లో జరిగే ప్రతి రిజిస్ట్రేషన్‌కు సబ్ రిజిస్ట్రార్ వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, ఈ దందాను జూనియర్ అసిస్టెంట్ శ్రీధర్‌రెడ్డి నడిపిస్తున్నాడని ఆరోపించాడు. అటెండర్ మాట్లాడిన ఆడియో లీక్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సబ్ రిజిస్ట్రార్‌పై వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.