ఆస్ట్రేలియానే టీ20 వరల్డ్ కప్‌‌ నయా బాద్‌‌షా

ఆస్ట్రేలియానే టీ20 వరల్డ్ కప్‌‌ నయా బాద్‌‌షా
  • ఫైనల్లో 8 వికెట్లతో కివీస్‌‌పై గ్రాండ్‌‌ వికర్టీ
  • చెలరేగిన మార్ష్‌‌, వార్నర్‌‌, హేజిల్‌‌వుడ్‌‌
  • నెరవేరని న్యూజిలాండ్‌‌ కప్పు కల

ఎక్కడ ఎలా ఆడినా.. 
వరల్డ్‌‌ కప్‌‌ అనగానే శక్తినంతా
కూడదీసుకోవడం వాళ్ల నైజం!
అప్పటిదాకా ఫామ్‌‌లో లేకున్నా  కప్పును చూడగానే  కలిసికట్టుగా.. కసితీరా ఆడటం వాళ్లకు ఇష్టం!
ఫేవరెట్‌‌ అయినా అండర్‌‌ డాగ్‌‌ అయినా.. టైటిల్‌‌ ఫైట్‌‌కు రాగానే ఖతర్నాక్‌‌ ఆటతో అవతలి టీమ్ 
మైండ్‌‌బ్లాంక్‌‌ చేయడం వాళ్ల ఇజం! 
అలాంటి  తిరుగులేని ఆటతో.. చెక్కు చెదరని రికార్డుతో  వన్డే వరల్డ్‌‌కప్‌‌లో  ఏకంగా ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచారు ఆస్ట్రేలియన్లు..! 
కానీ, ఒక్క టీ20 వరల్డ్ కప్‌‌ మాత్రమే ఇప్పటిదాకా వాళ్ల దరికి చేరలేదు...!

ఇప్పుడు ఆ ముచ్చటా తీరింది..!
స్వదేశంలో 2015 వన్డే వరల్డ్‌‌కప్‌‌ తర్వాత ఆరేళ్లుగా మరో టైటిల్‌‌ అందుకోలేక.. ఈ టోర్నీకి ముందు బంగ్లాదేశ్‌‌ చేతిలో టీ20 సిరీస్‌‌లో చిత్తుగా ఓడి..  పెద్దగా అంచనాలే లేకుండా వచ్చిన  కంగారూ టీమ్‌‌ అరబ్‌‌ గడ్డపై అద్భుతమే చేసింది..! తమదైన స్టయిల్లో.. తమకు మాత్రమే సాధ్యమయ్యే ఆటతో తొలిసారి టీ20 వరల్డ్‌‌ కప్‌‌ను ముద్దాడింది..! తమ పొరుగుదేశం న్యూజిలాండ్‌‌ వరల్డ్‌‌కప్‌‌ ఆశలపై నీళ్లు కుమ్మరిస్తూ.. 
షార్ట్‌‌ ఫార్మాట్‌‌లో చాంపియన్‌‌ అయ్యింది..! ఓవరాల్​గా 
ఆరో వరల్డ్‌‌ కప్‌‌తో సిక్సర్‌‌ కొట్టింది! 

తాము డిసైడ్‌‌ అయితే వార్‌‌సైడ్‌‌ అన్నట్టుగా  హోరాహోరీ తప్పదనుకున్న  టైటిల్‌‌ ఫైట్‌‌ను ఆరోన్‌‌ ఫించ్‌‌ కెప్టెన్సీలోని ఆసీస్‌‌ ఏకపక్షం చేసేసింది..! మిచెల్‌‌ మార్ష్‌‌ (50 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 నాటౌట్‌‌), డేవిడ్‌‌ వార్నర్‌‌ (38 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53) చెలరేగిన వేళ  భారీ టార్గెట్‌‌ను ఊదేసి కప్పు కైవసం చేసుకుంది. దాంతో, టీ20 వరల్డ్‌‌కప్‌‌లోనూ కంగా‘రూల్‌‌’ షురూ అయింది..!

పాపం న్యూజిలాండ్‌‌. ఆ టీమ్‌‌ వరల్డ్‌‌కప్‌‌ కల మరోసారి చెదిరింది..! ఎప్పట్లానే నిలకడైన ఆటతో టైటిల్‌‌కు చేరువగా వచ్చిన కివీస్‌‌ నిరాశతోనే వెనుదిరిగింది..!  బ్యాటింగ్‌‌లో కెప్టెన్‌‌ విలియమ్సన్‌‌ (48 బాల్స్‌‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 85), బౌలింగ్‌‌లో ట్రెంట్‌‌ బౌల్ట్‌‌  (2/18) ఒంటరి పోరాటం ఆ జట్టును ఒడ్డుకు చేర్చలేకపోయింది..!  2015, 2019  వన్డే వరల్డ్‌‌ కప్‌‌ ఫైనల్స్​లో ఓడి హార్ట్‌‌బ్రేక్‌‌ ఎదుర్కొన్న  కేన్‌‌ విలియమ్సన్‌‌సేన ఈ సారి కూడా అభిమానుల మనసు మాత్రమే గెలుచుకోగలిగింది..! 

దుబాయ్‌‌:  టీ20 వరల్డ్‌‌ కప్‌‌లో కొత్త చాంపియన్లు కంగారూలే. మెగా టోర్నీలో తన ఏడో ప్రయత్నంలో ఆస్ట్రేలియా టైటిల్‌‌ అందుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఆసీస్‌‌ 8 వికెట్ల  తేడాతో న్యూజిలాండ్‌‌ను చిత్తు చేసి కప్పు కైవసం చేసుకుంది. వన్‌‌సైడ్‌‌గా.. ఆసీస్‌‌సైడ్‌‌గా సాగిన పోరులో తొలుత న్యూజిలాండ్‌‌ 20 ఓవర్లో 4 వికెట్లకు 172 రన్స్‌‌  చేసింది. విలియమ్సన్‌‌ చెలరేగినా.. మార్టిన్‌‌ గప్టిల్‌‌ (35 బాల్స్‌‌లో 3 ఫోర్లతో 28) స్లోగా ఆడటం దెబ్బకొట్టింది ఆసీస్‌‌ బౌలర్లలో హేజిల్‌‌వుడ్‌‌ (3/16) మూడు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం మార్ష్‌‌, వార్నర్‌‌తో పాటు మ్యాక్స్‌‌వెల్‌‌(18 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 28 నాటౌట్) మెరుపులతో ఆసీస్‌‌ 18.5 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి టార్గెట్‌‌ను ఛేజ్‌‌ చేసింది. కివీస్‌‌ బౌలర్లలో ట్రెంట్‌‌ బౌల్ట్‌‌ (2/18) రాణించినా మిగతా బౌలర్లు చేతులెత్తేశారు.  మిచెల్‌‌ మార్ష్‌‌కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్, వార్నర్‌‌కు  కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద టోర్నీ అవార్డులు దక్కాయి. 

మార్ష్‌‌, వార్నర్‌‌ ఫటాఫట్‌‌

పక్కా ప్లాన్‌‌తో ఆడిన ఆసీస్​ టార్గెట్‌‌ను అలవోకగా ఛేజ్‌‌ చేసింది. కెప్టెన్‌‌ ఆరోన్‌‌ ఫించ్ (5) ఫెయిలైనా వార్నర్‌‌, మిచెల్ మార్ష్‌‌ సూపర్బ్‌‌ బ్యాటింగ్‌‌తో ఈజీగా విక్టరీ అందుకుంది. బౌల్ట్‌‌ వేసిన ఫస్ట్‌‌ ఓవర్లోనే ఎల్బీ అయ్యే ప్రమాదం తప్పించుకున్న ఫించ్‌‌ అతనికే వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. మూడో ఓవర్లో పుల్‌‌ షాట్‌‌కు ట్రై చేసి డారిల్‌‌ మిచెల్‌‌కు చిక్కాడు. అప్పటికే రెండు ఫోర్లు కొట్టిన వార్నర్‌‌ దూకుడు కొనసాగించగా.. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన మిచెల్‌‌ మార్ష్‌‌ స్టార్టింగ్‌‌ నుంచే దుమ్మురేపాడు. నాలుగో ఓవర్లో మిల్నే (0/30)కు 6, 4, 4తో స్వాగతం పలికాడు. ఆపై సౌథీ (0/43)బౌలింగ్‌‌లో వార్నర్‌‌ సిక్స్‌‌ కొట్టగా.. శాంట్నర్‌‌ (0/23) ఓవర్లో మిచెల్‌‌ కూడా బాల్‌‌ను స్టాండ్స్‌‌కు తరలించాడు. మధ్యలో రెండు ఓవర్లు నెమ్మదించినా.. స్పిన్నర్‌‌ ఇష్‌‌  సోథీ (0/40)బౌలింగ్‌‌లో  వార్నర్‌‌  రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌‌ బాదడంతో సగం ఓవర్లకు ఆసీస్‌‌ 82/1తో పటిష్టంగా నిలిచింది. మార్ష్‌‌, వార్నర్‌‌ తర్వాత కూడా అదే జోరు కొనసాగించారు. నీషమ్‌‌ (0/15)బౌలింగ్‌‌లో చెరో సిక్స్‌‌తో 12 ఓవర్లలోనే స్కోరు వంద దాటించారు. అయితే,  13వ ఓవర్లో మళ్లీ బౌలింగ్‌‌కు వచ్చిన బౌల్ట్‌‌.. 34 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకొని దూసుకెళ్తున్న వార్నర్‌‌ను క్లీన్‌‌బౌల్డ్‌‌ చేశాడు. దాంతో, సెకండ్‌‌ వికెట్‌‌కు 59 బాల్స్‌‌లోనే 92 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అవగా.. కివీస్‌‌ క్యాంప్‌‌లో ఆశలు చిగురించాయి. కానీ, బ్లాక్‌‌క్యాప్స్‌‌ టీమ్స్‌‌కు మార్ష్‌‌ ఎలాంటి చాన్స్‌‌ ఇవ్వలేదు. సోధి బౌలింగ్‌‌లో తను 6, 4 రాబట్టి రన్‌‌రేట్‌‌ తగ్గకుండా చూసుకున్నాడు. మరోవైపు  నాలుగో నంబర్‌‌లో వచ్చిన మ్యాక్స్‌‌వెల్‌‌ సైతం చెలరేగిపోయాడు. మిల్నే ఓవర్లో 4, 4, సౌథీ వేసిన 16వ ఓవర్లో 4, 6 బాదడంతో కివీస్‌‌ ప్లేయర్లు డీలా పడిపోయారు. చివరి 18 బాల్స్‌‌లో 14 రన్స్‌‌ అవసరం అవగా.. 18వ ఓవర్లో మిల్నే మూడే రన్స్‌‌ ఇచ్చి కివీస్‌‌ క్యాంప్‌‌లో ఆశలు రేపాడు. కానీ, సౌథీ వేసిన తర్వాతి ఓవర్‌‌ ఫస్ట్‌‌ బాల్‌‌కే మార్ష్‌‌ ఫోర్‌‌ కొట్టగా.. ఐదో బాల్‌‌ను మ్యాక్సీ రివర్స్‌‌ స్వీప్‌‌ షాట్‌‌తో విన్నింగ్‌‌ ఫోర్‌‌ బాదడంతో ఆసీస్‌‌ సంబరాలు మొదలయ్యాయి. 

విలియమ్సన్​ ఒక్కడే

న్యూజిలాండ్‌‌ ఇన్నింగ్స్‌‌లో హీరో కెప్టెన్‌‌ కేన్‌‌ విలియమ్సనే. అతని వల్లే కివీస్‌‌ మంచి స్కోరు చేసింది. స్టార్టింగ్‌‌లో స్లోగా ఆడినా.. తర్వాత గేర్లు మార్చి బౌండ్రీల వర్షం కురిపించాడు. తన దూకుడు చూస్తే కివీస్‌‌ స్కోరు 200 దగ్గరికి వెళ్తుందని అనిపించినా.. చివర్లో ఆసీస్‌‌ బౌలర్లు పుంజుకొని కట్టడి చేశారు. తొలి పది ఓవర్లలోనూ కంగారూ బౌలర్లు ఆకట్టుకున్నారు. సెమీస్‌‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌‌ ఆడిన డారిల్​ మిచెల్‌‌ (11)ను నాలుగో ఓవర్లో హేజిల్‌‌వుడ్‌‌ లెగ్‌‌ కట్టర్‌‌తో  పెవిలియన్‌‌ చేర్చి ఆసీస్‌‌కు ఫస్ట్ బ్రేక్‌‌ ఇచ్చాడు. అక్కడి నుంచి పేసర్లు కమిన్స్‌‌ (0/27), హేజిల్‌‌వుడ్‌‌తో పాటు స్పిన్నర్లు జంపా (1/26), మ్యాక్స్‌‌వెల్‌‌ డాట్‌‌ బాల్స్‌‌తో ఒత్తిడి పెంచారు. దాంతో, గప్టిల్‌‌తో పాటు విలియమ్సన్‌‌ స్లోగా బ్యాటింగ్‌‌ చేయడంతో10 ఓవర్లకు కివీస్‌‌ 57/1 స్కోరు మాత్రమే చేసింది. కానీ,  సగం ఓవర్ల తర్వాత కెప్టెన్‌‌ విలియమ్సన్‌‌ ఒక్కసారిగా టాప్‌‌ గేర్‌‌లోకి వచ్చాడు. స్టార్క్‌‌  వేసిన 11వ ఓవర్లో కేన్‌‌ హ్యాట్రిక్‌‌ ఫోర్లు బాది ఇన్నింగ్స్‌‌కు ఊపు తెచ్చాడు. తర్వాతి ఓవర్లో గప్టిల్​ను జంపా ఔట్‌‌ చేసినా విలియమ్సన్‌‌ ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. తన స్టయిల్‌‌కు భిన్నంగా భారీ షాట్లతో రెచ్చిపోయాడు. మ్యాక్స్‌‌వెల్‌‌ బౌలింగ్‌‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. నాలుగో నంబర్‌‌లో వచ్చిన ఫిలిప్స్‌‌ (18) కూడా జంపా ఓవర్లో 6, 4తో టచ్‌‌లోకి వచ్చాడు. ఇక, స్టార్క్‌‌ (0/60) వేసిన 16వ ఓవర్లో కేన్‌‌ తన విశ్వరూపం చూపించాడు. క్లాసిక్‌‌ షాట్లతో ఆ ఓవర్లో 4, 4, 6, 4, 4తో రెచ్చిపోయి ఏకంగా 22 రన్స్‌‌ రాబట్టడంతో  ఆ ఓవర్‌‌ చివరకు కివీస్‌‌ 136/2తో నినలిచింది. కేన్‌‌, ఫిలిప్స్‌‌ జోరు చూస్తుండే ఆ టీమ్‌‌ 200 స్కోరుపై కన్నేసినట్టు అనిపించింది. కానీ, ఈ దశలో ఆసీస్‌‌ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. 17వ  ఓవర్లో కమిన్స్‌‌ ఏడు రన్సే ఇవ్వగా.. తర్వాతి ఓవర్లో ఫిలిప్స్‌‌, కేన్‌‌ ఇద్దరినీ ఔట్‌‌ చేసిన ఐదే రన్స్‌‌ ఇచ్చిన హేజిల్‌‌వుడ్‌‌ కివీస్‌‌ స్పీడుకు బ్రేకులేశాడు. లాస్ట్​ 2 ఓవర్లలో కమిన్స్‌‌, స్టార్క్‌‌ వరుసగా 13, 10 రన్స్‌‌ ఇచ్చి ప్రత్యర్థిని 180లోపే కట్టడి చేశారు. నీషమ్‌‌ (13), సీఫర్ట్‌‌ (8) ఇద్దరూ నాటౌట్‌‌గా నిలిచారు.

స్కోర్‌‌బోర్డ్‌‌

న్యూజిలాండ్‌‌: గప్టిల్‌‌(సి) స్టోయినిస్‌‌ (బి) జంపా 28, మిచెల్‌‌ (సి) వేడ్‌‌ (బి) హేజిల్‌‌వుడ్‌‌ 11, విలియమ్సన్‌‌ (సి) స్మిత్‌‌ (బి) హేజిల్‌‌వుడ్‌‌ 85, ఫిలిప్స్‌‌ (సి) మ్యాక్స్‌‌వెల్‌‌ (బి) హేజిల్‌‌వుడ్‌‌ 18, నీషమ్‌‌ (నాటౌట్‌‌) 13, సీఫర్ట్‌‌ (నాటౌట్) 8; ఎక్స్‌‌ట్రాలు: 9; మొత్తం : 20 ఓవర్లలో 172/4; వికెట్ల పతనం: 1–27, 2–76, 3–144, 4–148; బౌలింగ్‌‌: స్టార్క్‌‌ 4–0–60–0, హేజిల్‌‌వుడ్‌‌ 4–0–16–3, మ్యాక్స్‌‌వెల్‌‌ 3–0–28–0, కమిన్స్‌‌ 4–0–27–0, జంపా 4–0–26–1, మార్ష్‌‌ 1–0–11–0. 

ఆస్ట్రేలియా: వార్నర్‌‌ (బి) బౌల్ట్‌‌ 53,  ఫించ్‌‌(సి) మిచెల్‌‌ (బి) బౌల్ట్‌‌ 5, మార్ష్‌‌ (నాటౌట్‌‌) 77, మ్యాక్స్‌‌వెల్‌‌ (నాటౌట్‌‌) 28; ఎక్స్‌‌ట్రాలు: 10; మొత్తం: 18.5 ఓవర్లలో 173/2;  వికెట్ల పతనం: 1–15, 2–107;  బౌలింగ్‌‌: బౌల్ట్‌‌  4–0–18–2, సౌథీ 3.5–0–43–0,  మిల్నే 4–0–30–0, సోధీ 3–0–40–0, శాంట్నర్‌‌ 3–0–23–0, నీషమ్‌‌ 1–0–15–0.